Flood Compensation: నేడు వరద బాధితులకు పరిహారం..ముంపు బాధితుల ఖాతాలకు చెల్లింపు
Flood Compensation: ఇటీవలి వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు రాష్ట్రప్రభుత్వం నేడు పరిహారం చెల్లించనుంది. విజయవాడలో బుడమేరు ముంపు, కృష్ణానదిలో ముంపుకు గురైన లక్షలాదిమంది ప్రజలకు వరద పరిహారం చెల్లించనున్నారు. ముఖ‌్యమంత్రి చంద్రబాబు నేడు నష్టపరిహారం చెక్కులు విడుదల చేస్తారు.
Flood Compensation: రాష్ట్రంలో ఇటీవల వరద ముంపుకు గురైన బాధితులకు నేడు నష్ట పరిహారం చెల్లించనున్నారు. మునుపెన్నడూ లేని విధంగా విజయవాడ నగరంలో సగ భాగం బుడమేరు ముంపుకు గురై పది రోజుల పాటు ముంపులో ఉండిపోవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని బుధవారం సీఎం చంద్రబాబు విడుదల చేస్తారు.
వరద ముంపు సాయంగా దాదాపు 4 లక్షల మంది బాధితులకు రూ.597 కోట్లు అందజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి, విజయవాడలో లక్షన్నర మంది బాధితులకు వరద సాయం అందించనున్నారు. దాదాపు రూ.597 కోట్లను ప్రభుత్వం బాధితులకు అందచేస్తారు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని పరిహారం చెల్లిస్తున్నారు. బుడమేరు వరదల్లో విజయవాడలో దాదాపు 32 డివిజన్లు ముంపుకు గురయ్యాయి. వాటిలో దాదాపు లక్షన్నర కుటుంబాలకు నేడు పరిహారం చెల్లించనున్నారు.
మరోవైపు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పారదర్శకంగా నష్ట గణనను పూర్తిచేసినట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. 179 సచివాలయాల పరిధిలో ఎన్యూమరేషన్ పూర్తిచేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు వివరించారు. వరద ప్రభావిత జాబితాలో చేర్చాలంటూ 38వ వార్డు నివాసితుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, 38వ వార్డు ఎన్యూమరేషన్ పరిధిలో లేనందునే సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు.
ముంపు ప్రభావిత 179 సచివాలయాల పరిధిలో అత్యంత పారదర్శకంగా నష్ట గణన ప్రక్రియను పూర్తిచేసి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. 25వ తేదీ బాధితుల ఖాతాల్లో డీబీటీ విధానం ద్వారా నేరుగా పరిహారం మొత్తాన్ని జమచేయనున్నట్లు వెల్లడించారు. ఏ ఒక్క బాధిత కుటుంబం ఎన్యూమరేట్ కాకుండా ఉండకూడదనే ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా పలు అవకాశాలు కల్పించినట్టు పేర్కొన్నారు.
అర్హుల జాబితాలను సచివాలయాల్లోనూ ప్రదర్శించినట్లు తెలిపారు. వివిధ కారణాల వల్ల ఎన్యూమరేషన్ సమయంలో ఇళ్లవద్ద లేని వారిని కూడా ప్రత్యేక బృందాలతో ఆది, సోమవారం ప్రత్యేకంగా నమోదు చేసినట్లు వివరించారు. 38వ వార్డు నివాసితులు కొందరు తమను కూడా ముంపు బాధితుల జాబితాలో చేర్చాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారని.. ఈ వార్డు ఎన్యూమరేషన్ పరిధిలోకి రాదని.. అందువల్లే సర్వే నిర్వహించలేదని వివరించారు. ప్రత్యేక బృందాల విచారణలో 38వ వార్డు నివాసితులు వరద పరిహారానికి అర్హులు కాదని గుర్తించినట్లు కలెక్టర్ సృజన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఆగస్టు - సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలు, వరద బాధితులకు అందించే సాయంపై ప్రభుత్వం ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది. విజయవాడ పరిధిలో లక్షన్నర మంది బాధితులకు వరద సాయం కింద ఆర్థిక ప్యాకేజీ అందించనుంది. బాధితులకు ఆర్థిక సాయం కింద దాదాపు రూ. 597 కోట్లను ప్రభుత్వం పంపిణి చేయనుంది.
ఇళ్లు, దుకాణాలు, తోపుడు బళ్లు, వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు, వాహనాలు, పంటలు, పశువులకు ఆర్థిక సాయం అందించనుంది. డీబీటీ కింద బాధితుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది. ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాలకు ప్రభుత్వం మించి ఆర్థిక సాయం అందిస్తోంది. ముంపు ప్రాంతాల్లో రూ. 180 కోట్ల మేర బ్యాంక్ రుణాల రీ-షెడ్యూల్ చేయనుంది. ఎన్యూమరేషన్లో ఎవరికీ ప్యాకేజీ అందక పోయినా నిబంధనల మేరకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక ప్యాకేజీ అందించనున్నారు.