CM Revanth Reddy : డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే లబ్దిదారులకు అప్పగించండి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు-cm revanth reddy orders handover double bedroom houses to beneficiaries sell rajiv swagruha houses ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే లబ్దిదారులకు అప్పగించండి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy : డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే లబ్దిదారులకు అప్పగించండి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Sep 25, 2024 10:17 PM IST

CM Revanth Reddy : దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి గరిష్ట సంఖ్యలో పీఎంఏవే ఇళ్లు సాధించాలన్నారు. రాజీవ్ స్వగృహలో నిరుపయోగంగా ఉన్న ఇళ్లు, బ్లాక్ లను వేలం వేయాలన్నారు.

డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే లబ్దిదారులకు అప్పగించండి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే లబ్దిదారులకు అప్పగించండి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy : ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ‌, వార్డు, మండ‌ల, ప‌ట్టణ‌, నియోజ‌క‌వ‌ర్గ, జిల్లా స్థాయి క‌మిటీల ఏర్పాటుకు విధివిధినాలు ఒక‌ట్రెండు రోజుల్లో రూపొందించాల‌ని సూచించారు. అర్హుల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌ని అన్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి బుధ‌వారం స‌మీక్ష నిర్వహించారు.

ప్రధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న నుంచి ఇత‌ర రాష్ట్రాలు ల‌క్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే ఈ విష‌యంలో తెలంగాణ వెనుక‌బ‌డి ఉంద‌ని, ఈ ద‌ఫా కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గ‌రిష్ట సంఖ్యలో రాష్ట్రానికి ఇళ్లు సాధించేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పీఎంఏవై కింద రాష్ట్రానికి రావాల్సిన బ‌కాయిలు రాబ‌ట్టాల‌ని సీఎం సూచించారు.

కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన స‌మాచారం వెంట‌నే ఇవ్వాల‌ని, ఇందిర‌మ్మ ఇళ్ల విష‌యంలో డేటాను ఎప్పటిక‌ప్పుడు అప్‌డేట్ చేయాల‌ని సీఎం సూచించారు. పెద్ద సంఖ్యలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజినీరింగ్ సిబ్బంది స‌మ‌స్య ఎదుర‌య్యే ప‌రిస్థితి ఉంటుంద‌ని అధికారులు తెల‌ప‌గా... అవ‌స‌ర‌మైతే ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధతిన నియామ‌కాలు చేప‌ట్టాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాజీవ్ స్వగృహ ఇళ్లు వేలం

రాజీవ్ స్వగృహలో నిర్మించి నిరుప‌యోగంగా ఉన్న బ్లాక్‌లు, ఇళ్లు వేలం వేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఏళ్ల త‌ర‌బ‌డి వృథాగా ఉంచ‌డం స‌రికాద‌ని, వెంట‌నే వేలానికి రంగం సిద్ధం చేయాల‌న్నారు. డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల ల‌బ్ధిదారుల ఎంపిక పూర్తయినా వాటిని ఎందుకు అప్పగించ‌లేద‌ని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అర్హుల‌కు ఆ ఇళ్లను అప్పగించాల‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నిర్మించి నిరుప‌యోగంగా ఉన్న బ్లాక్‌ల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పించి, వాటికి అర్హులైన ల‌బ్ధిదారుల‌కు అప్పగించాల‌ని అధికారుల‌కు సూచించారు. ఈ స‌మావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, సీఎం స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

బీసీ కులగణనపై

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, సభ్యులు కలిశారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధి విధానాలపై ముఖ్యమంత్రితో కమిషన్ సభ్యులు చర్చించారు. బీసీ కులగణన ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయాలన్నారు. వెంటనే బీసీ కులగణనకు కార్యాచరణ ప్రారంభించి.. వేగంగా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించరు. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

కిమ్స్ హాస్పిటల్స్ విరాళం

వరద బాధితుల సహాయార్థం కిమ్స్ హాస్పిటల్స్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయల విరాళం అందించింది. కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ బి. భాస్కర్ రావు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.

Whats_app_banner

సంబంధిత కథనం