Pv Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం - బ్యాడ్మింటన్ స్టార్ పెళ్లికి హాజరైన అతిథులు వీళ్లే!
ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం రాత్రిరాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది. సింధు పెళ్లికి కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలిసింది.
Pv Sindhu Wedding:ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పెళ్లిపీటలెక్కింది. వెంకటదత్త సాయితో ఏడడుగులు వేసింది. ఈ జంట వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది. ఆదివారం రాత్రి 11.20 నిమిషాలకు సింధు మెడలో వెంకట దత్త సాయి మూడుముళ్లు వేశారు. తెలుగు సంప్రదాయ పద్దతిలో సింధు, దత్త సాయి పెళ్లి జరిగింది.
ఈ జంట పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితుల సహా 140 మంది వరకు అతిథులు హాజరైనట్లు తెలిసింది. సింధు కుటుంబానికి సన్నిహితులైన చాముండేశ్వరినాథ్, గురువారెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు మరికొంత మంది ప్రముఖులు పెళ్లి వేడుకకు హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో రిసెప్షన్ జరుగనున్నట్లు సమాచారం. ఈ వివాహ రిసెప్షన్‌కు సచిన్ టెండూల్కర్, చిరంజీవి సహా పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరుకాబోతున్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రి ఫొటో వైరల్...
సింధు పెళ్లికి కేంద్ర టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. పెళ్లి వేడుకకు హాజరైన ఫొటోను సోషల్ మీడియాలో మినిస్టర్‌షేర్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారీగా ఖర్చు...
సింధు, దత్త సాయి పెళ్లి ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ జరిగింది. ఈ పెళ్లి కోసం సింధు కుటుంబసభ్యులు భారీగానే ఖర్చు చేసినట్లు చెబుతోన్నారు. సింధు పెళ్లి కోసం ఈ హోటల్‌లోని వంద గదులను కుటుంబ సభ్యులు బుక్ చేసినట్లు సమాచారం. ఈ హోటల్‌లోని ఒక్కో గది రెంట్ ఒక్క రాత్రికే లక్షకుపైనే ఉంటుందని సమాచారం.
సింధు భర్త వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 14న ఈ జంట ఎంగేజ్‌మెంట్ జరిగింది.
రిచెస్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్...
ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ క్రీడల్లో సింధు ఇప్పటివరకు రెండు మెడల్స్ గెలిచింది. 2016 ఓలింపిక్స్‌లో రజతం, 2020 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. బ్యాడ్మింటన్‌లో వరల్డ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలిచిన ఫస్ట్ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలోనే రిచెస్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా సింధు కొనసాగుతోంది. సింధు మొత్తం ఆస్తులు అరవై కోట్లకుపైనే ఉంటాయని సమాచారం