Karimnagar Congress: కరీంనగర్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు, మంత్రి పొన్నం టార్గెట్‌గా అసెంబ్లీ ఇన్‌ఛార్జి విమర్శలు
Karimnagar Congress: కరీంనగర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు భగ్గుమన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి పురుమల్ల శ్రీనివాస్ పార్టీ ముఖ్య నేతలపై ఫైరయ్యారు. పుష్ప తరహాలో తాను ఫ్లవర్ కాదని.. ఫైర్ అంటూ కార్యకర్తల సమక్షంలో తన ఆవేదనను, ఆక్రోశం వెళ్ళగక్కారు. ఇక సహించనని అల్టిమేటం ఇచ్చారు.
Karimnagar Congres: కరీంనగర్ కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి. అసెంబ్లీ నియోజక వర్గ ఇన్‌ఛార్జి పురుమళ్ల శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా పార్లమెంట్ ఇన్ చార్జి వెలిచాల రాజేందర్ రావుపై కూడా విమర్శలు చేశారు. డీసీసీ కార్యాలయంలో కార్యకర్తలతో రహస్యంగా సమావేశమై పార్టీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేయడం కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి నిముషంలో టికెట్టు దక్కించుకున్న పురుమల్ల శ్రీనివాస్ మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి కూడా దూరంగా ఉండిపోయారన్నది బహిరంగ సత్యం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో పురుమల్ల ప్రాధాన్యత రోజురోజుకు తగ్గిపోయిన సంగతి అనేక సందర్భాల్లో తేటతెల్లమైంది.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చిన పురుమల్ల శ్రీనివాస్ తనకు తన నియోజకవర్గంలో, పార్టీలో గాని ఎటువంటి ప్రాధాన్యత దక్కడం లేదంటూ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు నగరానికి వచ్చిన సందర్భంగా సమాచారం అందజేసేలా చూస్తున్నానని.. మంత్రి పొన్నం ప్రభాకర్ సహా ఇతర మంత్రులు, ముఖ్య నేతలెవరు వచ్చినా కూడా నియోజకవర్గ ఇన్ చార్జిగా తనకు మాటమాత్రంగా కూడా ఇవ్వడం లేదంటూ మదనపడుతూ వస్తున్నారు.
పురుమల్ల శ్రీనివాస్ ను నమ్మి ఆయన వెంట కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరూ కూడా ఇప్పుడు ఆయనతో కలిసి నడిచేందుకు కూడా ఆసక్తి చూపకపోవడాన్ని పురుమల్ల జీర్ణించుకోలేక పోయారు. ఇటీవల జరిగిన ప్రజాపాలన సంబరాల సందర్భంగా కూడా పురుమల్ల శ్రీనివాస్ కు సమాచారం లేకపోవడంతో ఇన్ చార్జి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచన మేరకు చివరి నిముషంలో నగర అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తానే చొరవ తీసుకొని సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. దీంతో అసలు ఏం జరుగుతుందో. తెలియక తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పురుమల్ల ఎట్టకేలకు తన మనసులో మాట కార్యకర్తల ముందు పెట్టాలనే నిర్ణయంతో డీసీసీ కార్యాలయంలో లంచ్ మీటింగు ఏర్పాటు చేశారు.
అన్యాయం.. అక్రమాలను ఇక సహించం...
కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అసలు.. ఉజ్వల పార్కు టెండర్ ఎవరికి దక్కింది... చేగుర్తి ఇసుక క్వారీ ఎవరికి దక్కింది... ఊటూరు ఇసుక క్వారీలో ఏం జరుగుతోంది.. మినరల్ ఫండ్ కింద మూడు కోట్ల రూపాయలను కేవలం ఒక చోటనే ఎందుకు పెట్టాల్సి వచ్చింది... ఇంకా చాలా ఉన్నాయి. బయటకు తీయాలంటే.... అంగబలం, అర్థబలం ఉందని విచ్చలవిడిగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు... ఈ అన్యాయాలను.. అక్రమాలను ఇకపై సహించబోం... అంటూ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి పురుమల్ల శ్రీనివాస్ నిప్పులు చెరిగారు.
అధికార పార్టీలో కీలక నేతగా ఉన్న పురుమల్ల శ్రీనివాస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఉద్దేశించినవేనని కార్యకర్తలు చెబుతున్నారు. నియోజకవర్గ ఇన్ చార్జిగా తనకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని.. ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని, కార్యకర్తలకు కూడా పనులు జరగడం లేదని, తాము ఎక్కడకు పోవాలి.. ఎవరిని కలువాలన్నది కూడా అర్థం కాకుండా పోయిందంటూ పురుమల్ల వాపోయారు.
ఎవరు వస్తారో తెలియదు.. ఎవరు పోతారో తెలియదని, నేతలు వచ్చినప్పుడు సమాచారం ఇస్తే పది మంది కార్యకర్తలు వచ్చి నాయకుల వెన్నంటి ఉంటేనే కదా పార్టీలో ఉత్సాహం కనబడేది, ఎవరికి వారే యమునా తీరేలా ఉంటే మరోసారి నగరంలో పార్టీ ఎలా బలపడుతుందని అంటున్నారు.. ఇక్కడ పార్టీని పట్టించుకోరని, పని చేస్తానంటే తనకు సహకరించరని కార్యకర్తలు దయనీయ స్థితిలో ఉన్నా ఎవరూ పట్టించుకోరని పురుమల్ల శ్రీనివాస్ తన ఆవేదన వెళ్ళగక్కారు.
నామినేటెడ్ పదవులేవీ...?
అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టుగా కరీంనగర్ కార్యకర్తల పరిస్థితి ఉందని పురుమల్ల వాపోయారు. నామినేటెడ్ పదవులు ఎవరికి వస్తున్నాయో కూడా తెలియదన్నారు. ఏడాది క్రింద సుడా చైర్మన్ ఇచ్చారు.. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇచ్చారు.. డైరెక్టర్ పదవులను కూడా భర్తీ చేస్తే పది మందికి లాభం జరిగేది.. మార్కెట్ కమిటీ ఇప్పటికీ పెండింగ్ పెట్టారు.. అదీ కూడా నియమిస్తే మరో పది మందికి అవకాశం లభించేది కదా...గిద్దె పెరుమాళ్ళ గుడి, సాయి బాబా, బ్రహ్మంగారి గుడి, వెంకటేశ్వర దేవస్థానం సహా అనేక చోట్ల నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తే ఈ రోజు నగరంలో కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉండేవారంటూ పురుమల్ల గుర్తు చేశారు. తన పొరపాట్లు ఉంటే చెప్పాలని.. సరిదిద్దుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ సంకేతాలు ఇచ్చారు.
ఒక్క చోటనే 3 కోట్లా...
నగరానికి మంజూరైన 3 కోట్ల రూపాయలలో తలా పది లక్షలు కేటాయిస్తే కార్యకర్తలు సంతోషించే వారని.. అలా కాకుండా మల్కాపూర్ వద్ద కేవలం ఒక ప్రైవేటు నిర్మాణం అవసరాల కోసం 2.70 కోట్ల రూపాయలు కేటాయించడం ఎంత వరకు సమంజసమని పురుమల్ల సూటిగా ప్రశ్నించారు. బాలాజీ ఫంక్షన్ వద్ద పనులు పెట్టారని.. కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా ఎవరికీ తెలియకుండా ఇలా చేయడం సమంజసం కాదని పురుమల్ల ఎత్తిచూపారు.
ప్రొటోకాల్ ఎందుకు వర్తించదు...
మంత్రి పొన్నం ప్రభాకర్ రెండుసార్లు పార్లమెంట్, రెండుసార్లు అసెంబ్లీకి చేశారని.. ఆ సమయంలో నియోజకవర్గ సమావేశాలకే మంత్రి పొన్నమే సభాధ్యక్షత వహించారని పురుమల్ల శ్రీనివాస్ గుర్తు చేశారు. మరి ఏడాదికాలంగా ఇక్కడ జరుగుతున్న సమావేశాల్లో తనకు ఎందుకు ఆ బాధ్యత అప్పగించడం లేదని ఆయన పార్టీ నాయకత్వాన్ని నిలదీశారు. పొన్నం ఇన్ చార్జిగా ఉన్న సమయంలో వేరే వాళ్ళు అధ్యక్షత వహించలేదు కదా అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ప్రజాపాలన సంబరాల సమావేశంలోనూ తానే అధ్యక్షత వహించాల్సి ఉండేనని వాపోయారు.
ఓడిపోలేదు.. ఓడించారు...
కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి తాను పోటీ చేస్తే పార్టీ నేతలెవరూ తనకు సహకరించలేదని పురుమల్ల సంచలన ఆరోపణలు చేశారు. గంగుల కమలాకర్ కోసం కేసీఆర్, కేటీఆర్.. బండి సంజయ్ కుమార్ గెలుపు కోసం మోడి ప్రచారం చేస్తే తనకు రేవంత్ రెడ్డి కాకుండా చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిని పంపించారని పురుమల్ల వాపోయారు. ఆ సమయంలో ఆయన ప్రచారానికి రావల్సిన అవసరమే లేదని.. రేవంత్ రెడ్డి వస్తే పరిస్థితి వేరేగా ఉండేదని.. వేరే కారణాల వల్ల రాలేకపోయారన్నారు.
పార్టీ కోసం పని చేసిన వారికే పదవులు ...
పార్టీ కోసం దశాబ్దాలుగా శ్రమిస్తూ వస్తున్న వారిని గుర్తించి పదవులు కట్టబెట్టాలంటూ పురుమల్ల శ్రీనివాస్ సూచించారు. డీసీసీ అధ్యక్ష పదవిని వెలిచాల రాజేందర్ రావుకు కాకుండా పార్టీ కోసం కష్టపడుతున్న వారిలో ఎవరో ఒకరికి ఆ పదవిని ఇవ్వాలంటూ పురుమల్ల సూచించారని తెలుస్తోంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొత్తగా వచ్చిన వారికి కాకుండా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి టికెట్లు ఇచ్చి అందరం కలిసి గెలిపించుకుందామంటూ కొత్త ట్విస్టు సంధించారు. పార్టీలో ఇటీవల చేరిన కార్పొరేటర్లు ఇటీవల సమావేశంలో వేదికపై ఉండటం చూసి సీనియర్ కార్యకర్తలు బాధపడ్డారని పురుమల్ల శ్రీనివాస్ గుర్తు చేశారు.
రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.