Kodangal Medical College : కొడంగల్‌లో మెడికల్ కాలేజీ.. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభం-admissions to begin in kodangal medical college from next year ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kodangal Medical College : కొడంగల్‌లో మెడికల్ కాలేజీ.. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభం

Kodangal Medical College : కొడంగల్‌లో మెడికల్ కాలేజీ.. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభం

Basani Shiva Kumar HT Telugu
Dec 19, 2024 12:06 PM IST

Kodangal Medical College : రేవంత్ నియోజకవర్గం కొడంగల్‌‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా దీనిపై ఆరోగ్య మంత్రి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభం అవుతాయని ప్రకటించారు.

కొడంగల్‌లో మెడికల్ కాలేజీ
కొడంగల్‌లో మెడికల్ కాలేజీ (Facebook)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి కొడంగల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభిస్తామని చెప్పారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు కూడా ప్రారంభిస్తున్నామని వివరించారు. ఆరోగ్య రంగానికి సంబంధించి శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

ఈ ఏడాది 8 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించామని మంత్రి దామోదర గుర్తు చేశారు. ఒక్కో కాలేజీలో 50 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. అన్ని కాలేజీల్లో ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఫాకల్టీని నియమించామని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీతో తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 35కు చేరుకోనుంది. కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లతో పాటు 60 బీఎస్సీ నర్సింగ్, 50 ఫిజియోథెరపీ, 30 పారామెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

మెడికల్ కాలేజీ , నర్సింగ్ కాలేజీ, ఫిజియోథెరపీ కళాశాలలతో పాటు 220 పడకల టీచింగ్ హాస్పటల్ నిర్మాణం కోసం రూ.224.50 కోట్లు మంజూరు చేస్తూ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య కళాశాల భవనాలను రూ.124.5 కోట్లతో నిర్మిస్తారు. నర్సింగ్ కాలేజీ భవనాలను రూ.46 కోట్లతో, ఫిజియోథెరపీ కళాశాల భవనాలను రూ.27 కోట్లతో ఆర్‌ అండ్‌ బి శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో 220 పడకల ఆసుపత్రిని రూ.27 కోట్లతో టీఎస్ఎం ఎస్ఐడీసీ నిర్మిస్తుంది.

విద్యార్థుల కోసం పూర్తిస్థాయిలో హాస్టళ్లను కూడా నిర్మిస్తారు. కొత్త కళాశాలల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఎంఈ, ఇతర విభాగాధిపతులను వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించిన.. నేపథ్యంలో కొడంగల్‌లో నాలుగు కళాశాలలు ఏర్పాటు కానున్నాయి.

వైద్య సౌకర్యాలు..

రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్‌లో కలిపి 2500 కు పైగా డయాగ్నస్టిక్స్ యంత్రాలు ఉన్నాయని.. ఈ యంత్రాల మెయింటనన్స్, రిపేర్లకు స్పెషల్ సెల్స్ ఏర్పాటు చేశామని మంత్రి దామెదర రాజనర్సింహ వెల్లడించారు. అవసరాన్ని బట్టి అవసరమైన చోట ఎంఆర్‌ఐ స్కానింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. యంత్రాలు నడిపేందుకు అవసరమైన హెచ్‌ఆర్‌ను రిక్రూట్ చేస్తామన్నారు.

కేన్సర్ స్క్రీనింగ్ కోసం మొబైల్ స్క్రీనింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. రీజనల్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటళ్లకు ప్రజలే యజమానులని వ్యాఖ్యానించారు‌. హైదరాబాద్‌తో పాటు, జిల్లాల్లోనూ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఆ ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్‌‌లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న కొంతమంది సీనియర్ డాక్టర్లను జిల్లాలకు ట్రాన్స్‌ఫర్ చేశామన్నారు. రాబోయే రోజుల్లో 90 శాతం ట్రీట్‌మెంట్ జిల్లాల్లోనే అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Whats_app_banner