Vikarabad : అధికారులపై దాడి, 55 మంది అరెస్టు.. కొడంగల్‌లో ఇంటర్నెట్ సేవలు బంద్
Vikarabad : లగచర్ల ఘటన తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ వాహనాలు ధ్వంసం, అధికారులపై దాడి కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో 55 మందిని అరెస్టు చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు.
ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ కోసం.. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభకు వెళ్లిన కలెక్టర్‌పై గ్రామస్థులు దాడికి యత్నించారు. కొందరు అధికారులపై దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు 55 మందిని అరెస్టు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. దుద్యాల, కొడంగల్, బోంరాస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
నాపై ఎవరూ దాడి చెయ్యలేదు..
ఈ ఘటనపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళన బాటపట్టారు. దీనిపై వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందించారు. పెన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడారు. తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టం చేశారు. మాట్లాడేందుకు గ్రామస్థులు పిలిచారని.. చర్చలు జరిపామని వెల్లడించారు. ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశారని వివరించారు. అంతా మన రైతులు, మనపై దాడి చేయరని కలెక్టర్ సర్దిచెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. ఎవరూ ఆందోళన చేయవద్దని సూచించారు.
లడాయిని ఆపలేరు..
'అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు. బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు. అర్దరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా? రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఇదేనా ప్రజాస్వామ్య పాలనా? రైతు సంక్షేమ పాలన? ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం' అని కేటీఆర్ ప్రశ్నించారు.
'అర్దరాత్రి అన్నదాతల అరెస్టులు ఎందుకు? ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి.. పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతుల అరెస్టులా? మీ అల్లుడు, సోదరుల సంపాదనల కోసం.. భూమిని నమ్ముకున్న మా పొట్ట కొట్టవద్దన్నందుకు అరెస్టులా? రైతుల అరెస్టులను ఖండిస్తున్నాం. పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్నాం. లగచర్ల గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నా' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
అటు రైతులకు మద్దతుగా కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ పాదయాత్ర మొదలైంది. వేములవాడ దర్శనం అనంతరం సంజయ్ పాదయాత్రలో హరీష్ రావు పాల్గొననున్నారు. చల్గల్ నుండి జగిత్యాల వరకు 5 కిలోమీటర్ల పాటు హరీష్ రావు నడవనున్నారు. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. కోరుట్ల నుండి జిల్లా కేంద్రం జగిత్యాల వరకు కల్వకుంట్ల సంజయ్ రైతు పాదయాత్ర చేస్తున్నారు.