Karimnagar Bandisanjay: కరీంనగర్ లో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు, వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్
Karimnagar Bandisanjay: వెలుగులు విరజిమ్మే దీపావళి పర్వదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా జరిగాయి. సంబరాలు అంబరాన్నంటాయి. ఊరువాడ చిన్న పెద్ద తేడా లేకుండా దీపావళి వేడుకల్లో పాల్గొని టపాసులు మోత మ్రోగించారు.
Karimnagar Bandisanjay: కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో జరిగిన దీపావళి వేడుకల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించారు. అంగరక్షకులు, సెక్యూరిటీ సిబ్బందితో కలిసి టపాసులు కాల్చి దీపావళి పండుగను కన్నుల పండువలా జరుపుకున్నారు.
హిందూ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్, అసురులపై దేవిశక్తులు సాధించిన విజయంగా దీపావళి జరుపుకుంటామని తెలిపారు. స్వార్థం కల్మషం అహంకారం లేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలందరు ఐక్యంగా జీవించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రతి మనిషి లో చీకట్లను ప్రారద్రోలి వెలుగులు నింపాలన్నారు.
దేశ ప్రజలను కాపాడడానికి దేశ అభివృద్ధికి ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా నిలువాలని... భారతమాతను విశ్వగురువు స్థానంలో నిలుపడానికి కృషి చేస్తున్న నరేంద్ర మోడీకి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నానని బండి సంజయ్ తెలిపారు.
కన్నుల పండువలా సమాదుల పండుగ
దేశమంతట వెలుగులు విరజిమ్మే దీపావళి సంబరాలు అంబరాన్ని తాకితే కరీంనగర్ లో సమాధుల పండుగ కన్నుల పండువలా జరిగింది. కాలం చేసిన వారిని స్మరిస్తూ కుటుంబసభ్యులు స్మశానంలో సమాధుల వద్ద వేడుకలు నిర్వహించారు. ఖార్కానగడ్డలోని స్మశాన వాటికలో ఎస్సీలు పెద్దఎత్తున సమాధుల వద్దకు చేరుకొని దీపాలు వెలిగించి దూప దీప నైవేద్యాలు సమర్పించి టపాసులు కాల్చి పెద్దలను స్మరించుకున్నారు. చనిపోయిన వారికి ఏది ఇష్టమో అది చేసి సమాధుల వద్ద పెట్టారు. చుక్క, ముక్క బతికున్నప్పుడు ఇష్టంగా ఏది తినేవారో అది చేసి పెట్టారు. బంధుమిత్రులను పిలుచుకుని విందు భోజనాలు ఆరగించారు.
అనాదిగా వస్తున్న ఆచారం
అనాదిగా పూర్వకాలం నుంచి దీపావళి రోజున సమాధుల పండుగను జరుపుకుంటున్నామని ఎస్సీ కమ్యూనిటీ ప్రతినిధులు కార్పోరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ తెలిపారు. దీపావళి రోజున ధనలక్ష్మి పూజలు, కేదారేశ్వర వ్రతాలు చేస్తారు... మాకు సమాధుల పండుగ పెద్ద పండుగ అని తెలిపారు. కుటుంబ సభ్యులు ఎక్కడున్నా దీపావళి రోజున స్వస్థలానికి చేరుకుని స్మశానంలో సమాధుల వద్ద పెద్దలను స్మరిస్తూ సమాధుల పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటామని చెప్పారు
సమాదుల పండుగలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే దీపావళి నాటికి సమాదుల పండుగ వరకు స్మశానంలో సుడా ఆద్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)