KTR Latest Comments : డిక్లరేషన్లన్నీ పాములై రేవంత్ మెడలో పడతాయి : కేటీఆర్-ktr satires on congress government and revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Latest Comments : డిక్లరేషన్లన్నీ పాములై రేవంత్ మెడలో పడతాయి : కేటీఆర్

KTR Latest Comments : డిక్లరేషన్లన్నీ పాములై రేవంత్ మెడలో పడతాయి : కేటీఆర్

Basani Shiva Kumar HT Telugu
Nov 10, 2024 05:27 PM IST

KTR Latest Comments : బీసీ డిక్లరేషన్ ఇచ్చి సంవత్సరం పూర్తయిన ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదని.. కేటీఆర్ విమర్శించారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందన్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందన్నారు.

కేటీఆర్
కేటీఆర్

హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన రేవంత్, బీసీ బిడ్డలకు క్షమాపణలు చెప్పాలని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీసీ కుల గణన చేయాల్సిందేనని.. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినంకనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పైన నమ్మకం లేకనే కులగణనకు వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇచ్చిన హామీలను రేవంత్ ఎందుకు అమలు చేయడం లేదంటూ.. ఇంటికి వచ్చిన ప్రభుత్వాధికారులను ప్రశ్నించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాల పైన ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంటుందని.. ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 60 ఏళ్ల పాటు బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. 60 ఏళ్లలో కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేని చరిత్ర కాంగ్రెస్‌దే అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

'కాంగ్రెస్ ఏడాది వైఫల్యాల పైన మేము కూడా వారోత్సవాలు నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వెళ్లి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఎవని అయ్యా సొమ్ము అని అబద్ధాలతో ఫుల్ పేజీ యాడ్లు వేస్తున్నారు. సరిగ్గా సంవత్సరం కింద ఇదే రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనేక హామీలు ఇచ్చింది. ఆడపిల్లల ఓట్ల కోసం బలహీన వర్గాల ఓట్ల కోసం దొంగ హామీలను ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క బీసీ డిక్లరేషన్ హామీ అయినా అమలు చేసిందా?' అని కేటీఆర్ ప్రశ్నించారు.

'కొత్త పథకాల విషయం దేవుడెరుగు.. ఉన్న వాటిని కూడా కాంగ్రెస్ ఎత్తగొట్టింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేతి వృత్తులకు చేయూతనిస్తూ బలహీన వర్గాలకు విద్య, వృత్తి లాంటి అన్ని అవకాశాల్లో ఆసరాగా నిలిచింది. పథకాలన్నింటికీ పాతర వేసిన పాపాత్ములు కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు తర్వాత బీసీల కోసం బీసీ బంధు ప్రవేశపెట్టింది. కానీ రేవంత్ రెడ్డి రాగానే బీసీ బంధు, రైతుబంధు, దళిత బంధు ఇలా అన్ని బంద్ అయినయి' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

'కుల గణన కచ్చితంగా చేయాల్సిందే. కుల గణన పూర్తయిన తర్వాతనే, 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. ఆరు నెలల్లో స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఏడాది దాటిన అమలు చేయలేదు. 42 శాతం రిజర్వేషన్లు అమలు అయినంకనే ఎన్నికలు పెట్టాలని ఇంటికి వచ్చే ప్రభుత్వాధికారులను, కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ప్రజలు నిలదీయాలి' అని కేటీఆర్ పిలుపునిచ్చారు

'మూడు లక్షల ఆదాయమున్న ప్రతి బీసీ కుటుంబానికి పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ ఎక్కడ పోయింది. ప్రతి మండలంలో ఒక గురుకులం అన్నారు. ఎక్కడికి పోయింది? ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజ్ అన్నారు.. బీసీలకు 10 లక్షల వడ్డీ లేని రుణమిస్తా అని చెప్పారు. ఒక్క బీసీ బిడ్డకు అయినా రుణం ఇచ్చారా? ఐదేళ్లలో బీసీల సంక్షేమ కోసం సంవత్సరానికి 20 వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు ఖర్చుపెడతామని చెప్పారు. కేవలం 8 వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అందులో ఎంత ఖర్చు పెడతారో ఎవరికీ తెలియదు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

'సర్పంచులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. బీసీ వెల్ఫేర్ శాఖతోపాటు ఎంబీసీలకు మరొక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అన్నారు. ఉన్న మంత్రులనే నింపుకోలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి. కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? రాష్ట్రానికి అవసరం ఉన్న 18 మందిని నింపుకోలేని చేతకానివారు రేవంత్ రెడ్డి. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో బీసీ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేస్తా అన్నారు, ఒక్కదానికైనా కనీసం పని మొదలైందా?' అని కేటీఆర్ ప్రశ్నించారు.

'ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నడు. ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తానని చెప్పి మాట తప్పినవ్. అబద్దాల ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్ర సమితి తరపున అడుగుతూనే ఉంటాం.. నిలదీస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్లన్నింటిపైనా ప్రశ్నిస్తూనే ఉంటాం. డిక్లరేషన్లన్నీ పాములై రేవంత్ మెడలో పడతాయి. అన్ని డిక్లరేషన్లు అమలు అయ్యేదాకా రేవంత్‌ను వదిలిపెట్టం' అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Whats_app_banner