Colleges Fee Reimbursement : రేపటితో ముగియనున్న ఫీజు రీయింబర్స్మెంట్ టోకెన్ గడువు, బకాయిలు చెల్లించాలని బండి సంజయ్ లేఖ
Colleges Fee Reimbursement : తెలంగాణలో రేపటితో ఫీజు రీయింబర్స్మెంట్ టోకెన్ గడువు ముగియనుంది. మూడేళ్లుగా రూ.7800 కోట్ల బకాయిలు ప్రభుత్వం...కాలేజీలకు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలపై సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు.
Colleges Fee Reimbursement : తెలంగాణలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలల(TS Colleges) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన టోకెన్ ల గడువు మార్చి 31తో ముగుస్తుంది. మూడేళ్లుగా బకాయి పడ్డ రూ.7800 కోట్లు ప్రభుత్వం కళాశాలకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇచ్చిన టోకెన్ లకు రేపటి లోగా డబ్బులు మంజూరు చేయాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) డిమాండ్ చేశారు.
రూ.7800 కోట్ల బకాయిలు
బీఆర్ఎస్ పాలనలో(BRS Rule) ఎన్నడూ ఫీజురీయంబర్స్ మెంట్ సక్రమంగా చెల్లించకపోవడంతో అటు కాలేజీ యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. గత మూడేళ్లుగా ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.7800 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా అధ్యాపకులు, సిబ్బంది జీతభత్యాలు, కళాశాల భవనాల అద్దె, మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించలేక గత మూడేళ్లలో వందలాది కాలేజీలు మూతపడ్డాయి. గత ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల్లో దాదాపు రూ.750 కోట్లు డిగ్రీ, పీజీ కళాశాలలకు మార్చి నెలాఖరు నాటికి చెల్లిస్తామని పేర్కొంటూ టోకెన్లు(Tokens) జారీ చేసింది. కానీ నేటి వరకు నయా పైసా చెల్లించలేదు. రేపటితో(ఈనెల 31నాటికి) టోకెన్ల గడువు ముగుస్తోంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు స్పందన లేకపోవడం బాధాకరమని బండి సంజయ్(Bandi Sanjay) తన లేఖలో పేర్కొన్నారు.
కాలేజీలను చంపేయకండి
విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తామని ఫీజు రీయంబర్స్ మెంట్(Fee Reimbursement) నిధులను సక్రమంగా చెల్లించడంతోపాటు మరింత మెరుగ్గా అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపర్చిందని బండి సంజయ్ గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి వందరోజులు దాటినా ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులకు సంబంధించి నయాపైసా చెల్లించలేదని ఆరోపించారు. సర్కార్ నిర్వాకం వల్ల ముఖ్యంగా సిబ్బంది జీతభత్యాలు, కళాశాలల అద్దెలు, మెయింటెనెన్స్ ఛార్జీల కోసం ఆయా కళాశాలల యాజమాన్యాలు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టేలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయని చెప్పారు. ఆయా కాలేజీల్లో (Colleges)చదివే విద్యార్థులంతా నిరుపేదలే కావడంతో ఫీజులు చెల్లించలేక మధ్యలోనే చదువు మానేస్తున్నారన్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
నాడు బీఆర్ఎస్...నేడు కాంగ్రెస్
గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) విధానాలను పరిశీలిస్తే ప్రైవేటు కాలేజీలను చంపేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కన్పిస్తోందని బండి సంజయ్ (Bandi Sanjay)ఆరోపించారు. ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్యంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్యను దూరమై రోడ్డున పడేసే పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకుని, గత ప్రభుత్వం జారీ చేసిన టోకెన్లకు సంబంధించి నిధులను రేపటిలోగా చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిర్దిష్ట గడువులోగా ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలన్నీ చెల్లించడంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో(Election Manifesto) పేర్కొన్న విధంగా ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లింపుల విషయంలో మరింత మెరుగైన విధానాన్ని అమలు చేయాలని బండి సంజయ్ కోరారు.
HT Correspondent Vijender Reddy Karimnagar
సంబంధిత కథనం