KTR : మేఘా కంపెనీని బ్లాక్‌లిస్ట్ లో పెట్టాలి, ఆ కాంట్రాక్ట్ వెంటనే రద్దు చేయాలి - సీఎం రేవంత్ కు కేటీఆర్ ప్రశ్నలు-ktr demanded that megha engineering compnay should be blacklisted in sunkishala incident ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr : మేఘా కంపెనీని బ్లాక్‌లిస్ట్ లో పెట్టాలి, ఆ కాంట్రాక్ట్ వెంటనే రద్దు చేయాలి - సీఎం రేవంత్ కు కేటీఆర్ ప్రశ్నలు

KTR : మేఘా కంపెనీని బ్లాక్‌లిస్ట్ లో పెట్టాలి, ఆ కాంట్రాక్ట్ వెంటనే రద్దు చేయాలి - సీఎం రేవంత్ కు కేటీఆర్ ప్రశ్నలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 06, 2024 12:51 PM IST

KTR On Megha Engineering : మేఘా కంపెనీతో పాటు మంత్రి పొంగులేటిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుంకిశాల ఘటనకు కారణమైన మేఘా కంపెనీపై చర్యలు తీసుకోవాలని.. వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడేందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.

కేటీఆర్
కేటీఆర్

సాగునీటి రంగంలో కేసీఆర్ ఎంతో గొప్పగా పనిచేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా కాళేశ్వరం కట్టారని చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… వాయువేగంతో తెలంగాణలో సాగునీళ్ల ప్రాజెక్ట్ లు కేసీఆర్ నిర్మించిన విషయం అందరికీ తెలుసన్నారు.

కానీ అప్పట్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని రేవంత్ రెడ్డి మాట్లాడారని కేటీఆర్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కమీషన్ల కోసమే అంటూ రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడారని చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా మేఘా కృష్ణారెడ్డిని పొలిటికల్ మాఫియా అంటూ కామెంట్ చేశారని గుర్తు చేశారు.

చర్యలేవి - సీఎం రేవంత్ కు కేటీఆర్ ప్రశ్నలు

“ఏ కంపెనీని ఆంధ్రా కంపెనీ అన్నారో.. ఏ కంపెనీనిని ఈస్ట్ ఇండియా అన్నారో, ఏ కంపెనీ అరాచక కంపెనీ అన్నారో ఆ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు…? హైదరాబాద్ కు నీళ్లు తీసుకురావటానికి మేము సుంకిశాల ప్రాజెక్ట్ చేపట్టాం. కానీ ఈ ప్రభుత్వం. మున్సిపల్ మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోలేదు. సుంకిశాలలో మేఘా కంపెనీ క్రిమినల్ నెగ్లిజన్స్ కారణంగా రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఈ విషయాన్ని అసలు బయటకు తెలియకుండా ముఖ్యమంత్రి సహా ప్రభుత్వం దాచి పెట్టింది. ఎందుకు దాచి పెట్టారో చెప్పాలంటూ నేను గతంలోనే డిమాండ్ చేశాను. ప్రమాదం పై జ్యూడిషీయల్ ఎంక్వయిరీ కోరాను, కంపెనీని బ్లాక్‌లిస్ట్ చేయాలని అడిగాను” అని కేటీఆర్ తెలిపారు.

కాంట్రాక్ట్ రద్దు చేయాలి - కేటీఆర్

“మేడిగడ్డ ఘటనతో కాళేశ్వరంలో లక్ష కోట్లు నీళ్లలో పోశారంటూ ప్రచారం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్లు సుంకిశాల ప్రమాదాన్ని మాత్రం దాచి పెట్టారు. మొత్తం సంఘటనలో నలుగురు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. అంతేకానీ కంపెనీని బ్లాక్‌లిస్ట్ చేయలేదు. ఏ కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అని ముఖ్యమంత్రి అన్నారో అదే కంపెనీ పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు…? మీరు వేసిన విచారణ కమిటీయే మేఘా కంపెనీని బ్లాక్‌లిస్ట్ లో పెట్టాలని రిపోర్ట్ ఇచ్చింది. కానీ దొంగలు, దొంగలు కలసి ఊళ్లు పంచుకున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా సంస్థ కు రాష్ట్రంలోని ప్రాజెక్ట్ లను కట్టబెడుతున్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ. 4350 కోట్ల టెండర్ ను మేఘా సంస్థకు అప్పగించావు. బ్లాక్‌లిస్ట్ లో పెట్టాలని చెప్పిన సంస్థకు ఎందుకు కాంట్రాక్ట్ కట్టబెట్టావు? సుంకిశాల ప్రాజెక్ట్ విషయంలో మేఘా సంస్థ పై చర్యలు తీసుకొని కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పెద్ద కుంభకోణమే. దానిని కూడా రద్దు చేయాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రూ. 4350 కోట్లలో నీ వాటా ఎంత? ఢిల్లీ వాటా ఎంత? అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. “మొన్న స్కిల్ యూనివర్సిటీ కోసం రూ. 200 కోట్ల విరాళాన్ని ప్రాజెక్ట్ లు కట్టబెట్టినందుకే ఇచ్చారా? కాళేశ్వరం నీళ్లను గండి పేటలో కలిపి మూసీలోకి పంపిస్తారంట. దీనికోసం రూ. 5,500 కోట్లు ఖర్చు చేస్తారంట. ఇది మరొక కుంభకోణం. ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు రేవంత్ రెడ్డి చెప్పినట్లు సంతకం పెడితే మేము అధికారంలోకి వచ్చాక విచారణ తప్పదు. వాళ్ల ఉద్యోగాలు ఊడటం ఖాయం. ఎక్కడ బిడ్ లు చేస్తున్నారో ఆ సంస్థ పేరు కూడా మాకు తెలుసు. రేవంత్ రెడ్డి కి చిత్తశుద్ది ఉంటే వెంటనే ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు అన్న సంస్థ పై చర్యలు తీసుకోవాలి” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

పొంగులేటి ఎప్పుడు జైలుకు వెళ్తావో చూసుకో…!

పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులకు సంబంధించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. "కోహినూర్ హోటల్ లో అదానీ కాళ్లు మొక్కి ఏం కాకుండా పొంగులేటి బతిమిలాడుకున్నాడు. అమృత్ టెండర్లను సీఎం తన బావమరిదికి ఇచ్చిన విషయంలో కేంద్ర సంస్థలు ఎందుకు విచారణ జరపటం లేదు. సీవీసీ ఏం చేస్తోంది. పొంగులేటి అరెస్ట్ అవుతాడంటూ అందరి జాతకాలు చెబుతున్నాడు. నువ్వు ఎప్పుడు జైలుకు వెళ్తావో చూసుకో. అదానీతో మీ సంబంధాలు ఏ విధంగా బలపడుతున్నాయో మాకు తెలుసు.

"అమృత్ టెండర్ల ముఖ్యమంత్రి బావమరిదికి రూ. 11 వందల కోట్ల పనులను ఎలా ఇస్తారంటూ కేంద్రమంత్రి నేను ఉత్తరం రాస్తే ఇప్పటి వరకు స్పందన లేదు. గౌతమ్ అదానీ కొడుకుతో నాలుగు గంటల పాటు రేవంత్ రెడ్డి ఇంట్లోనే చర్చలు జరిపారు. మోడీ కోసం దామగుండం, అదానీకి సిమెంట్ ఫ్యాక్టరీ, మేఘా కృష్ణా రెడ్డికి అన్ని ప్రాజెక్ట్ లు ఇస్తున్నారు. రాయదుర్గంలో 84 ఎకరాలను కూడా ఆదానీకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవ్వరు, ఎప్పుడు అరెస్ట్ అవుతారో మంత్రి చెబుతాడా ? వీళ్లు ప్రభుత్వం నడుపుతున్నారా…సర్కస్ నడుపుతున్నారా?" అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం