CM Jagan: మురుగు శుద్ధి యంత్రాలు పంపిణీ చేసిన సిఎం జగన్
CM Jagan: స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా సఫాయి కర్మచారి కార్మికులకు ఆధునిక యంత్రాలను ముఖ్యమంత్రి జగన్ పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందిన కార్మికులకు యంత్రాలను అందించారు.
CM Jagan: పారిశుధ్య కార్మికులకు ఆధునిక వాక్యుమ్ క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందచేశారు. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు చెందిన వాహనాలను బుధవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. క్యాంప్ ఆఫీసు వద్ద జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. తెనాలి మునిసిపాలిటీకి చెందిన దాసరి మాధవి, బోరుగడ్డ కీర్తలతో కలిసి సిఎం జగన్ జెండా ఊపి వాహనాలను అందచేశారు.
రేపు నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో సీఎం పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు.
అక్కడి నుంచి అవుకు రెండో టన్నెల్ వద్దకు చేరుకుని నీటిని విడుదల చేసి.. ఆ టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారు. సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు.