Telangana Tourism : పచ్చని అడవిలో బ్లాక్ బెర్రీ ఐలాండ్.. రారమ్మంటున్న ప్రకృతి అందాలు.. డోంట్ మిస్!
Telangana Tourism : చుట్టూ దట్టమైన అడవి. చెట్ల మధ్య నుంచి గలగలా పారే వాగులు. ఏడారిని తలపించే ఇసుక తిన్నెలు. పక్షుల కిలకిలరావాలు. జంతువుల అరుపులు. చల్లిని వాతావరణం.. ఇవన్నీ ఆస్వాదించాలంటే.. ములుగు జిల్లాకు వెళ్లాల్సిందే. పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం సరికొత్త ఆలోచన చేసింది.
కుటుంబం, స్నేహితులతోనే విహారయాత్రకు వెళ్లాలనుకునే వారికి తెలంగాణ పర్యాటక శాఖ శుభవార్త చెప్పింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మొండ్యాల తోగు సమీపంలో.. పచ్చని ప్రకృతి అందాల మధ్య.. బ్లాక్ బెర్రీ ఐలాండ్‌ను పర్యాటక శాఖ అభివృద్ధి చేసింది. దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఐలాండ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక్కడ టూరిస్టులు రాత్రి బస చేసేలా 50 ఆధునిక గుడారాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఉండేలా 25, ముగ్గురు ఉండేలా 21, నలుగురు ఉండేలా 4 గుడారాలను ఏర్పాటు చేశారు.
విశేషాలు..
1.పర్యాటకుల కోసం రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ, నార్త్ ఇండియన్ వంటలు చేసే చెఫ్‌లను దీంట్లో నియమించారు.
2.ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఆడుకొనేందుకు బీచ్ వాలీబాల్ తరహాలో కోర్టు ఏర్పాటు చేశారు. షటిల్ కోర్టులు కూడా ఉన్నాయి. జలగలాంచ వాగు నీటిలో చిన్నారులు ఆటలాడుకొనేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
3.రాత్రిపూట చలి మంటలు వేసుకునేలా ఏర్పాట్లు చేశారు. క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. మరోవైపు అడవిని వీక్షించేలా ఏర్పాటు చేసిన మంచె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
4ఈ దీవిలో విడిది చేసే టూరిస్టులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సోలార్ విద్యుత్తు సదుపాయం కల్పించారు. పర్యాటకులకు రక్షణగా సిబ్బందిని నియమించారు.
5.ఇక్కడికి చేరుకోవడం చాలా సులువు. హైదరాబాద్ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా బస్సుల్లో నేరుగా రావొచ్చు. హైదరాబాద్ నుంచి ఏటూరునాగారం, మంగపేట, భద్రాచలం వైపు వచ్చే బస్సుల్లో పస్రా వద్ద దిగాలి. ఏపీ నుంచి వస్తే భద్రాచలంలో దిగి.. అక్కడి నుంచి హైదరాబాద్, వరంగల్, హనుమకొండ బస్సుల్లో రావచ్చు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరం ఈ ఐలాండ్ ఉంది.
6.బ్లాక్ బెర్రీ ఐలాండ్‌లో బస చేసేందుకు పర్యాటక శాఖ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ధరను ఇంకా నిర్ణయించలేదు. కానీ.. ఒక్కొక్కరికి రోజుకు దాదాపు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం. దీనికి సమీపంలోనే రామప్ప ఆలయం, చెరుపు, లక్నవరం సరస్సు, బోగత వాటర్ ఫాల్స్ ఉంటాయి.