Hyderabad Zoo Lion Attack : హైదరాబాద్ జూ పార్క్ సిబ్బందిని హడలెత్తించిన సింహం, కేర్ టేకర్ పై దాడి
Hyderabad Zoo Park Lion Attack : హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో సింహం ఎన్ క్లోజర్ నుంచి బయటకు వచ్చిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో యానిమల్ కీపర్ గాయపడ్డాడు.
Hyderabad Zoo Park Lion Attack : హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో యానిమల్ కీపర్ పై సింహం దాడి చేసింది. జూపార్క్ లోని సింహాలకు ఆహారం పెడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సింహం దాడిలో హుస్సేన్ అనే యానిమల్ కీపర్ కు గాయాలయ్యాయని జూ పార్క్ అధికారులు తెలిపారు. హుస్సేన్ ను సింహం దాడి నుంచి కాపాడి వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. హుస్సేన్ ఆసుపత్రిలో చికిత్స అందుతుందని, అతడు కోలుకుంటున్నాడని చెప్పారు.
అసలేం జరిగింది?
8 ఏళ్ల వయస్సు గల ఆఫ్రికన్ సింహం(శిరీష) పక్షవాతంతో బాధపడుతోంది. సమ్మర్ హౌస్ ఏరియాలో సింహాన్ని ఉంచి చికిత్స అందిస్తున్నారు జూ నిర్వాహకులు. అయితే జూ పార్క్ లో యానిమల్ కీపర్ గా పనిచేస్తున్న సయ్యద్ హుస్సేన్ రాత్రి సమయంలో సింహాలు ఉండే ప్రాంతాలను శుభ్రం చేస్తుంటాడు. అయితే జూ పార్క్ తలుపులు మూసే క్రమంలో హుస్సేన్ నిర్లక్ష్యం కారణంగా సింహం అతడిపై దారికి పాల్పడిందని జూ నిర్వాహకులు అంటున్నారు.
ఎన్ క్లోజర్ తలుపు సరిగ్గా మూయకపోవడంతో
లయన్ ఎన్‌క్లోజర్ మధ్య తలుపు సరిగ్గా క్లోజ్ చేయలేదని అధికారులు తెలిపారు. ఎన్ క్లోజర్ క్లీన్ చేస్తున్న సమయంలో బయటకు వచ్చిన సింహం హుస్సేన్‌పై దాడి చేసిందన్నారు. సింహం దాడిలో సయ్యద్ చేతికి తీవ్ర గాయమైంది. దాడి తరువాత హుస్సేన్ కేకలు వేస్తూ అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. సింహం ఎన్ క్లోజర్ నుంచి బయటకు వచ్చిందని జూ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు సయ్యద్. సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ముందుగా జూ పార్క్ ప్రధాన గేట్లు మూసివేశారు. అలాగే సోమవారం జూ హాలిడే కావడంతో టూరిస్ట్ లు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. సింహాన్ని పట్టుకునేందుకు సెక్యురిటీ సిబ్బంది, వెటర్నరీ బృందం డార్టింగ్ పరికరాలతో రంగంలోకి దిగింది. వెటర్నరీ బృందం 10 నిమిషాల్లోనే సింహాన్ని గుర్తించి దానికి మత్తు ఇచ్చారు.
యానిమల్ కీపర్ నిర్లక్ష్యం
అనంతరం సింహం బంధించి, దాని ఎన్ క్లోబర్ లోకి పంపారు. యానిమల్ కీపర్ సయ్యద్ హుస్సేన్‌ను ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు జూ పార్క్ డైరెక్టర్ కమిటీని నియమించారు. ఈ ఘటనపై విచారించిన కమిటీ నివేదిక సమర్పించింది. యానిమల్ కీపర్ సయ్యద్ హుస్సేన్ భద్రతా చర్యలను పాటించడంలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. గేట్లు మూసివేయడంలో నిర్లక్ష్యంగా వహించినట్లు గుర్తించారు. సయ్యద్ నిర్లక్ష్యం కారణంగా సింహం బయటకు వచ్చినట్లు కమిటీ నిర్థారించింది. ఇలాంటి సంఘటనలను ఎలా స్పందించాలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి నిపుణులను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది.
సంబంధిత కథనం