PV Sindhu Wedding: ఆ విషయం సీక్రెట్‌గా ఉంచడం చాలా కష్టంగా అనిపించింది: పెళ్లి తర్వాత పీవీ సింధు కామెంట్స్
PV Sindhu Wedding: పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి చేసుకున్నారు. ఆదివారం (డిసెంబర్ 22) వీళ్ల పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట తొలిసారి తమ రిలేషన్షిప్, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కారణమేంటన్న విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
PV Sindhu Wedding: ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్స్ మెడలిస్ట్ అయిన పీవీ సింధు వ్యాపారవేత్త వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల మొదట్లోనే వీళ్ల పెళ్లి గురించి వార్త బయటకు వచ్చింది. చాలా ఏళ్లుగా వీళ్లకు పరిచయం ఉన్నా.. అది పెళ్లి వరకూ వెళ్లనుందన్న విషయాన్ని సీక్రెట్ గా ఉంచడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని సింధు తెలిపింది. వీళ్ల పెళ్లికి సంబంధించిన తొలి ఫొటోను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ షేర్ చేశారు.
పెళ్లిపై సింధు ఏమన్నదంటే?
పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఆదివారం (డిసెంబర్ 22) రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. వీళ్ల పెళ్లి విషయం చాలా రోజుల వరకు సీక్రెట్ గా ఎలా ఉంచారో.. పెళ్లికి సంబంధించిన ఫొటోల విషయంలోనూ అదే పాటించారు. అయితే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తొలి ఫొటోను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
పెళ్లి తర్వాత ఈ జంట ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. తమ మధ్య రిలేషన్షిప్ కొన్నేళ్ల కిందటే మొదలైనట్లు వీళ్లు వెల్లడించారు. చాలా రోజులుగా వీళ్ల కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో తమ మధ్య బంధం కూడా బలపడుతూ వచ్చినట్లు సింధు తెలిపింది. జీవితంలో స్థిరత్వం కోసమే తాను ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు కూడా చెప్పింది.
సీక్రెట్‌గా ఉంచడం కష్టంగా అనిపించింది
"సింధుకు ఈ సమయం సరైనదని అనిపించింది. ఒలింపిక్స్ తర్వాత ఆమె జీవితంలో సెటిలవ్వాలని భావించింది. స్థిరత్వం కోసం చూసింది. జీవితంలో మలి ప్రయాణంపై దృష్టి సారించాలని అనుకుంది. ఇదే సరైన అడుగు అని మేమిద్దరం అనుకున్నాం. ఎందుకంటే ఇద్దరం కలిసి భవిష్యత్తును నిర్మించుకోవాలని భావించాం" అని వెంకట దత్త సాయి అన్నారు.
అటు సింధు కూడా పెళ్లిపై స్పందించింది. "నా వరకు పెళ్లంటే స్థిరత్వం. ఇది నేను మరింత మెరుగ్గా రాణించడానికి ఉపయోగపడుతుంది. అత్యున్నత స్థాయిలో పోటీ పడటం చాలా కష్టం. అందుకే ఈ సెక్యూరిటీ, సపోర్ట్ చాలా ముఖ్యం. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. జీవితంలో ఈ కొత్త దశ నాకు ఎంతో ప్రత్యేకం" అని సింధు చెప్పింది.
"ప్రతి విషయం రహస్యంగా ఉంచడం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడది అందరికీ తెలిసిపోయింది. అది నాకు ఓకే" అని సింధు తెలిపింది. సింధు, వెంకట దత్త సాయి పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే మంగళవారం (డిసెంబర్ 24) హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి ఎంతో మంది ప్రముఖ క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని మోదీతోపాటు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్లను కూడా సింధు ఆహ్వానించింది.