IAF Agni Veer Recruitment: వాయుసేనలో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తు చేసుకోండి ఇలా…-notification for agniveer recruitment in indian air force ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Iaf Agni Veer Recruitment: వాయుసేనలో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తు చేసుకోండి ఇలా…

IAF Agni Veer Recruitment: వాయుసేనలో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తు చేసుకోండి ఇలా…

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 23, 2024 01:05 PM IST

IAF Agni Veer Recruitment: భారతీయ వాయుసేనలో అగ్నివీర్‌ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నాలుగేళ్ల సర్వీస్‌తో వాయుసేనలో 2026 నియామకాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. 2025 జనవరి 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

వాయుసేనలో అగ్నివీర్ వాయు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల
వాయుసేనలో అగ్నివీర్ వాయు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

IAF Agni Veer Recruitment: భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు నియామక ప్రకటన విడుదలైంది. అగ్నిపథ్ స్కీంలో భాగంగా చేపట్టే ఈ నియామకంలో నాలుగేళ్ల లిమిటెడ్‌ సర్వీస్‌తో రిక్రూట్‌మెంట్‌ చేపడతారు. ఇంటర్, తత్సమాన కోర్సులు పూర్తిచేసిన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వాయుసేన తెలిపింది.

ఎంపికైన అభ్యర్థులను అగ్నివీర్ లుగా వ్యవహరిస్తారు. నాలుగేళ్ల పాటు వాయుసేనలో సేవలందించాల్సి ఉంటుంది. పరిమిత కాలం నియామకమే అయినప్పటికీ శారీరక, మానసిక సామర్థ్యాల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని అధికారులు తెలిపారు.

అగ్నివీర్ ల నియామకానికి సంబంధించి వాయు సేన విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనవరి 27 తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. పూర్తి వివరాలు, దరఖాస్తు చేసుకోవడానికి వాయుసేన అధికారిక వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.in/AV/ లో సంప్రదించాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చిలో పరీక్ష నిర్వహించి నవంబర్ లో తుది ఫలితాలను ప్రకటిస్తారు.

పోస్టులు: అగ్నివీర్ వాయు

ఎంపిక ప్రక్రియను రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌ల ద్వారా నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుము రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. అగ్నివీర్‌ వాయు 2026లో చేరాలనుకునే అభ్యర్థులు 2005 జనవరి 1 నుంచి 2008 జులై 1 మధ్య జన్మించిన వారై ఉండాలి. అభ్యర్థులు అన్ని దశల్లో ఎంపిక పూర్తి చేసుకున్నా గరిష్ట వయసు 21ఏళ్లకు మించకూడదు.

అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థులు మాత్రమే అగ్నివీర్‌ వాయు పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల పరిమిత సర్వీస్‌ కావడంతో ఆ సమయంలో పెళ్లి చేసుకోడానికి అనుమతించరు. నాలుగేళ్ల వ్యవధిలోపు పెళ్లి చేసుకుంటే వారిని సర్వీస్‌ నుంచి తొలగిస్తారు. అగ్నివీర్‌ సర్వీస్ నుంచి రెగ్యులర్‌ సర్వీసుల్లోకి నియామకం జరిగే నాటికి అభ్యర్థులు అవివాహితులై ఉండాలి. మహిళా అభ్యర్థులు నాలుగేళ్ల సర్వీస్ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోను గర్భం దాల్చడానికి అనుమతించరు.సర్వీస్ సమయంలో గర్భం దాల్చిన వారిని సర్వీసుల నుంచి తొలగిస్తారు. రెగ్యులర్‌ సర్వీసుల్లోకి కూడా అనుమతించరు. నియామక సమయంలోనే అభ్యర్థులు ఈ షరతులను అంగీకరించాల్సి ఉంటుంది.

విద్యార్హతలు...

అగ్నివీర్‌ వాయులో ప్రవేశించాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సుల్లో ఎంపీసీలో 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీలో 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌, డిప్లొమా సబ్జెక్టుల్లో మార్కులతో పాటు ‎ఇంగ్లీష్‌లో కూడా 50శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సుల్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో 50శాతం మార్కులు సాధించిన వారు కూడా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇతర సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వేతనాలు...

ఎంపికైన వారికి మొదటి ఏడాది రూ.30వేలు, రెండో ఏడాది రూ.33వేలు, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40వేలు వేతనం చెల్లిస్తారు. వేతనంలో 30శాతం అగ్నివీర్ కార్పస్‌ ఫండ్‌గా మినహాయిస్తారు. సర్వీస్‌ లో ఉన్న సమయంలో వేతనంలో మినహాయించిన మొత్తానికి సమానంలో కేంద్రం వాటాగా చెల్లిస్తుంది. నాలుగేళ్ల సర్వీసు ముగిసే సమయానికి ఒక్కో అగ్నివీర్‌ రూ.5.02లక్షలను కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. ప్రభుత్వం కూడా అంతే మొత్తం వారి తరపున జమ చేస్తుంది. నాలుగేళ్ల కాంట్రాక్టు ముగిసే సమయానికి సేవ నిధి ప్యాకేజీ రూపంలో రూ.10.04లక్షలు చెల్లిస్తారు. అగ్నివీర్‌లు ప్రావిడెంట్‌ ఫండ్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

అగ్నివీర్‌ వాయు నోటిఫికేషన్‌ను ఈ లింకు ద్వారా చూడండి… https://agnipathvayu.cdac.in/AV/img/upcoming/AGNIVEER_VAYU_01-2026.pdf

Whats_app_banner