Rohit Sharma vs Shami: రోహిత్ శర్మ, షమి మధ్య గొడవ.. గాయం విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం!
Rohit Sharma vs Shami: రోహిత్ శర్మ, మహ్మద్ షమి మధ్య గొడవ జరిగిందా? ఇద్దరూ గాయం విషయంలో మాటామాటా అనుకున్నారా? తాజాగా వస్తున్న ఓ రిపోర్టు ఇప్పుడీ సంచలన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
Rohit Sharma vs Shami: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి మధ్య గొడవ జరిగినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు సమయంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీలో ఉన్న షమిని రోహిత్ కలిశాడని, ఆ సమయంలో ఇద్దరూ మాటామాటా అనుకున్నట్లు ఆ రిపోర్టు తెలిపింది.
రోహిత్ శర్మ వర్సెస్ మహ్మద్ షమి
రోహిత్ శర్మ, షమి మధ్య సంబంధాలు అంత బాగా లేవని దైనిక్ జాగరన్ రిపోర్టు ఒకటి వెల్లడించింది. న్యూజిలాండ్ తో బెంగళూరులో తొలి టెస్టు ప్రారంభానికి ముందు ఎన్సీఏలో ఉన్న షమిని రోహిత్ కలిశాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. షమి పూర్తి ఫిట్ గా లేడని, అతని మోకాలిలో వాపు ఉన్నట్లు చెప్పాడు. దీంతో షమికి కొత్త గాయం అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై షమి అసంతృప్తి వ్యక్తం చేశాడు. బెంగళూరు టెస్టులో టీమిండియా ఓడిన తర్వాత మరోసారి షమిని రోహిత్ కలిసిన సందర్భంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగినట్లు దైనిక్ జాగరన్ రిపోర్టు తెలిపింది.
"షమి ఎన్సీఏలో ఉన్నప్పుడు రోహిత్ ను కలిశాడు. అయితే తన గాయం పరిస్థితి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ కు అందుబాటులో ఉండటంపై మీడియాకు రోహిత్ ఇచ్చిన సమాచారంపై అసంతృప్తిగా ఉన్న షమి అతనితో వాగ్వాదానికి దిగాడు" అని ఎన్సీఏ వర్గాలు వెల్లడించినట్లు ఆ రిపోర్టు తెలిపింది.
షమిపై తాజాగా రోహిత్ కామెంట్స్ ఇవీ..
ఇక తాజాగా ఆస్ట్రేలియా చేతుల్లో రెండో టెస్టులో పది వికెట్లతో ఓడిన తర్వాత కూడా మరోసారి షమిపై రోహిత్ శర్మ స్పందించాడు. "అతని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ఎందుకంటే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడే సమయంలో షమి మోకాలిలో వాపు కనిపించింది. దీంతో అతడు టెస్టు మ్యాచ్ సంసిద్ధతకు దెబ్బ తగిలింది. మేము చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాం.
అతన్ని తొందరపడి ఇక్కడికి తీసుకురావాలని అనుకోవడం లేదు. చాలా కాలం కావడంతో అతని విషయంలో 100 శాతం కంటే ఎక్కువ కచ్చితత్వం కోసం చూస్తున్నాం. అతనిపై ఒత్తిడి పెంచాలని భావించడం లేదు. కొందరు ప్రొఫెషనల్స్ అతని పరిస్థితిని గమనిస్తున్నారు. ప్రతి మ్యాచ్ చూస్తున్నారు. అతనికి ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి" అని రోహిత్ స్పష్టం చేశాడు.
షమి పరిస్థితి ఏంటి?
మహ్మద్ షమి తిరిగి వచ్చేది ఎప్పుడన్నదానిపై స్పష్టత లేదు. అతడు ఆస్ట్రేలియాకు వెళ్లడానికి అంతా సిద్ధంగా ఉన్నా ఇప్పటికీ బెంగాల్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతూనే ఉన్నాడు. నేషనల్ క్రికెట్ అకాడెమీ నుంచి పూర్తి క్లియరెన్స్ లభించిన తర్వాతే షమికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.
ఆ లెక్కన మూడో టెస్టుకైతే షమి అందుబాటులో ఉండడు. మెల్‌బోర్న్ లో డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టుకు మాత్రం షమి తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.