Kadapa Knife Attack : కడప జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, ప్రేమించడంలేదని యువతిపై కత్తితో దాడి
Kadapa Knife Attack : కడప జిల్లాల్లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడంలేదనే కోపంతో యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన యువతిని కడప రిమ్స్ కు తరలించారు.
కడప జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడంలేదనే కోపంతో యువతిపై కత్తితో దాడి చేయాడు. ఈ దాడిలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. కడప జిల్లాలోని వేముల మండలం కొత్తపల్లి చెందిన షర్మిలను కుల్లాయప్ప అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శనివారం యువతి ఇంట్లో ఒంటరిగా ఉందనే విషయం తెలుసుకున్న కుల్లాయప్ప కత్తితో యువతిపై విచక్షణారహితంగా దాడిచేశాడు.
14 కత్తిపోట్లు
యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడికి రావడంతో... వారిని చూసి కుల్లాయప్ప పారిపోయాడు. అయితే అప్పటికే తీవ్రగాయాలతో రక్తపు మడుగులో ఉన్న షర్మిలను చికిత్స కోసం బంధువులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. యువతి పరిస్థితి విషమించడంతో పులివెందులలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. యువతి రక్తం ఎక్కువగా కోల్పోవడంతో... అపస్మారక స్థితిలోకి చేరింది. దీంతో మెరుగైన వైద్యం కోసం యువతిని కడప రిమ్స్ కు తరలించారు. షర్మిల తండ్రి స్థానికంగా వీఆర్ఏగా పనిచేస్తున్నారు. ఆయన రెవెన్యూ సభలు కోసం శనివారం గొందిపల్లెకు వెళ్లారు. షర్మిల తల్లి కూలి పనికి వెళ్లడంతో ఇంట్లో షర్మిల ఒక్కరే ఉన్నారు. యువతి ఒక్కతే ఉన్న విషయాన్ని తెలుసుకున్న ప్రేమోన్మాది...ఇంట్లోకి వెళ్లి షర్మిలపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
వివాహితపై కత్తితో దాడి
ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు పట్టణం రజకవీధిలో దారుణం జరిగింది. ఓ యువకుడు మహిళను హత్య చేశాడు. ఈ ఘటన గురించి బాధిత మహిళ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాచర్ల మండలానికి చెందిన పేకినేని సుహాసిని (28), కృష్ణ భార్య భర్తలు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త కృష్ణ రెండేళ్ల కిందటే మృతి చెందాడు. భర్త దహన సంస్కారాలు పూర్తయిన తరువాత సుహాసిని రాచర్లలోని ఎస్‌సీ కాలనీకి చెందిన నాని అనే యువకుడితో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయింది. నానితో కొన్ని నెలల పాటు సహజీవనం చేసింది. ఆ తరువాత వారిద్దరికి గొడవులు వచ్చాయి. దీంతో సుహాసిని ఐదు నెలల కిందట మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. అప్పుడు నాని కూడా గిద్దలూరికి వచ్చేశాడు. సుహాసిని వద్దకు వెళ్లి కలిసి ఉందామని వేధిస్తున్నాడు. నాని వేధింపులు భరించలేక సుహాసిని రాచర్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రాచర్ల పోలీసులు నానిని స్టేషన్‌కు పిలిపించి, కౌన్సిలింగ్ ఇచ్చారు. సుహాసిని వేధించడం మానుకోవాలని హెచ్చరించారు.
గిద్దలూరు పట్టణంలోని రజకవీధిలో సుహాసిని ఓ ఇల్లు అద్దెకు తీసుకుని తన పిల్లలతో కలిసి ఉంటుంది. బతుకు దెరువు కోసం స్థానికంగా ఉన్న బట్టల షాప్‌లో పని చేసుకుంటూ.. కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. అయితే.. తనతో సహజీవనానికి ఒప్పుకోకపోవడం, తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుహాసినిపైన నాని కక్షపెట్టుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సుహాసిని ఒక్కతే ఇంట్లో ఉన్న సమయంలో.. ఆమె ఇంట్లోకి చొరబడి కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. గొంతు, పొట్ట, గుండెలపై దాడి చేసి పరారయ్యాడు. సుహాసిని కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. కొద్దిసేపటికే సుహాసిని మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.