Tanush Kotian: అశ్విన్ స్థానంలో టీమిండియాలోకి వచ్చిన 26 ఏళ్ల స్పిన్నర్.. ఎవరీ తనూష్ కోటియన్?-tanush kotian replaces retired ravichandran ashwin in team india border gavaskar trophy boxing day test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Tanush Kotian: అశ్విన్ స్థానంలో టీమిండియాలోకి వచ్చిన 26 ఏళ్ల స్పిన్నర్.. ఎవరీ తనూష్ కోటియన్?

Tanush Kotian: అశ్విన్ స్థానంలో టీమిండియాలోకి వచ్చిన 26 ఏళ్ల స్పిన్నర్.. ఎవరీ తనూష్ కోటియన్?

Hari Prasad S HT Telugu
Dec 23, 2024 09:36 PM IST

Tanush Kotian: అశ్విన్ స్థానంలో టీమిండియాలోకి ఇప్పుడో 26 ఏళ్ల యువ స్పిన్నర్ వస్తున్నాడు. అతని పేరు తనూష్ కోటియన్. ఇప్పుడీ ముంబై ఆల్ రౌండర్ ను హుటాహుటిన ఆస్ట్రేలియాకు పంపిస్తున్నారు. ఇంతకీ ఈ తనూష్ ఎవరో తెలుసా?

అశ్విన్ స్థానంలో టీమిండియాలోకి వచ్చిన 26 ఏళ్ల స్పిన్నర్.. ఎవరీ తనూష్ కోటియన్?
అశ్విన్ స్థానంలో టీమిండియాలోకి వచ్చిన 26 ఏళ్ల స్పిన్నర్.. ఎవరీ తనూష్ కోటియన్? (AFP)

Tanush Kotian: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించి ఇండియాకు వచ్చేసిన రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో మరో స్పిన్నర్ ను ఎంపిక చేశారు టీమిండియా సెలెక్టరలు. దేశవాళీ క్రికెట్ లో ముంబై తరఫున ఆడే తనూష్ కోటియన్ ను ఆస్ట్రేలియాకు పంపిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న అతడు.. మంగళవారం (డిసెంబర్ 24) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు ఆస్ట్రేలియా ఫ్లైటెక్కనున్నాడు.

yearly horoscope entry point

ఎవరీ తనూష్ కోటియన్?

ఆస్ట్రేలియాతో జరగబోయే చివరి రెండు టెస్టుల కోసం తనూష్ కోటియన్ ను ఎంపిక చేశారు. అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో సిరీస్ మధ్యలో మరో స్పిన్నర్ ను ఎంపిక చేయాల్సి వచ్చింది. అశ్విన్ వెళ్లిపోవడంతో జట్టులో జడేజా, వాషింగ్టన్ సుందర్ మాత్రమే ఉన్నారు. దీంతో మూడో స్పిన్నర్ గా తనూష్ ను తీసుకున్నారు. అతడు మంగళవారం (డిసెంబర్ 24) ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడు. ప్రస్తుతం ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీ కోసం అతడు అహ్మదాబాద్ లో ఉన్నాడు. మొదట అతడు ముంబైకి వచ్చి, అక్కడి నుంచి మెల్‌బోర్న్ ఫ్లైటెక్కబోతున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల్లో ముగ్గురు స్పిన్నర్లను టీమిండియా వినియోగించుకుంది. పెర్త్ లో వాషింగ్టన్ సుందర్, అడిలైడ్ లో జరిగిన పింక్ బాల్ టెస్టులో అశ్విన్, బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్టులో జడేజా తుది జట్టులో ఉన్నారు. ఇప్పుడు అశ్విన్ వెళ్లిపోవడంతో అతని స్థానంలో తనూస్ కోటియన్ ను పంపిస్తున్నట్లు సోమవారం (డిసెంబర్ 23) సాయంత్రం బీసీసీఐ కన్ఫమ్ చేసింది.

తనూష్.. ఓ ఆల్ రౌండర్

ఈ మధ్యే రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. టెస్టుల్లో మంచి ఆల్ రౌండర్. ఆరు సెంచరీలతోపాటు 537 వికెట్లు తీసిన ఘనత అతని సొంతం. ఇప్పుడతని స్థానంలో జట్టులోకి వస్తున్న తనూష్ కూడా మంచి ఆల్ రౌండరే. ఆస్ట్రేలియా ఎతో ఈ మధ్యే జరిగిన రెండు అనధికారిక టెస్టుల కోసం ఇండియా ఎలోనూ అతడు ఉన్నాడు. రెండో టెస్టులో ఆడి ఒక వికెట్ తీయడంతోపాటు 44 రన్స్ చేశాడు. అతడు ఇప్పటి వరకూ 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 1525 రన్స్ చేశాడు. సగటు 41.21 కావడం విశేషం. ఇక 25.7 సగటుతో 101 వికెట్లు కూడా తీశాడు.

రెండు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కొన్నేళ్లుగా ముంబై తుది జట్టులో క్రమం తప్పకుండా ఉంటున్నాడు. 2023-24లో రంజీ ట్రోఫీని ముంబై గెలవగా.. తనూష్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. ఆ సీజన్ లో అతడు 502 రన్స్ చేయడంతోపాటు 29 వికెట్లు కూడా తీశాడు. ఇక ఇరానీ కప్ లోనూ రెస్టాఫ్ ఇండియాపై సెంచరీ చేశాడు. దీంతో ముంబై టీమ్ 27 ఏళ్ల తర్వాత ఈ కప్ గెలిచింది. ఇండియా ఎ తరఫున దులీప్ ట్రోఫీలో ఆడి 10 వికెట్లు తీసుకున్నాడు.

Whats_app_banner