తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - తెలంగాణలో 7 నవోదయ, ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు-union cabinet approves 7 navodaya vidyalayas to telangana 8 kendriya vidyalayas to andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - తెలంగాణలో 7 నవోదయ, ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - తెలంగాణలో 7 నవోదయ, ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు

HT Telugu Desk HT Telugu
Dec 07, 2024 05:21 AM IST

Union Cabinet Decisions : తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ కు ఎనిమిది కేంద్రీయ విద్యాల‌యాలు, తెలంగాణ‌కు ఏడు న‌వోద‌య విద్యాల‌యాలను కేటాయించింది. ఈ మేరకు కేంద్రమంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

.ఏపీకి ఎనిమిది కేంద్రీయ విద్యాల‌యాలు
.ఏపీకి ఎనిమిది కేంద్రీయ విద్యాల‌యాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణాల ఉభ‌య‌ తెలుగు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఎనిమిది కేంద్రీయ విద్యాల‌యాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించింది. అలాగే తెలంగాణ‌కు ఏడు న‌వోద‌య విద్యాల‌యాల‌ను కేటాయిస్తూ కేంద్ర మంత్రి వ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది.

yearly horoscope entry point

ఏపీలో ఏర్పాటయ్యేది ఇక్కడ…

శుక్ర‌వారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త కేంద్ర మంత్రి వ‌ర్గం స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో దేశంలోని 19 రాష్ట్రాల్లో 85 కొత్త కేంద్రీయ విద్యాల‌యాలకు ఆమోదం తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన‌కాప‌ల్లి, వ‌ల‌స‌ప‌ల్లె (చిత్తూరు జిల్లా, మ‌ద‌న‌ప‌ల్లె మండ‌లం), పాల‌స‌ముంద్రం (శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా గోరంట్ల మండ‌లం), తాళ్ల‌ప‌ల్లి (గుంటురు జిల్లా మాచ‌ర్ల మండ‌లం), నందిగామ (కృష్ణా జిల్లా), రొంపిచ‌ర్ల (గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట డివిజ‌న్‌), నూజీవిడ్ (ఏలూరు జిల్లా), థోన్ (నంద్యాల‌)లో కేంద్రీయ విద్యాల‌యాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.

ఏపితో పాటు అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ (1), అస్సాం (1), ఛ‌త్తీస్‌గ‌ఢ్ (4), గుజ‌రాత్ (3), హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ (4), జ‌మ్ము కాశ్మీర్ (13), జార్ఖండ్ (2), క‌ర్ణాట‌క (3), కేర‌ళ (1), మ‌ధ్య‌ప్ర‌దేశ్ (11), మ‌హారాష్ట్ర (3), ఢిల్లీ (1), ఒరిస్సా (8), రాజ‌స్థాన్ (9), త‌మిళ‌నాడు (2), త్రిపుర (2), ఉత్త‌రప్ర‌దేశ్ (3), ఉత్త‌రాఖండ్ (4)ల్లో కొత్త కేంద్రీయ విద్యాల‌యాల‌ను ప్రారంభించ‌నున్నారు. క‌ర్ణాట‌క‌లోని శివ‌మొగ్గ జిల్లాలో కెవి శివ‌మొగ్గలో కేంద్రీయ విద్యాల‌యాన్ని విస్తర‌ణ‌కు కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. మొత్తం ఈ 86 కేంద్రీయ విద్యాల‌యాల‌కు ఏర్పాటుకు 2025-26 నుంచి ఎనిమిదేళ్ల‌లో రూ. 5,872.08 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు.

తెలంగాణ‌లో 7 న‌వోద‌యాలు

తెలంగాణ‌లో ఏడు న‌వోద‌యాలు ఏర్పాటుకు కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ‌లో జ‌గిత్యాల‌, నిజమాబాద్‌, కొత్త‌గూడెం భద్రాద్రి, మేడ్చేల్ మ‌ల్కాజ్‌గిరి, మ‌హ‌బుబ్‌న‌గ‌ర్‌, సంగారెడ్డి, సూర్య‌పేటలో న‌వోద‌య విద్యాల‌యాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.

తెలంగాణ‌తోపాటు దేశ‌వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 28 కొత్త న‌వోద‌యాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌(8), అస్సాం (6), మ‌ణిపూర్ (3), క‌ర్ణాట‌క (1), మ‌హారాష్ట్ర (1), ప‌శ్చిమ బెంగాల్ (2) న‌వోద‌య విద్యాల‌యాల‌ను ఏర్పాటు చేస్తారు. మొత్తం ఈ 28 న‌వోద‌య‌ విద్యాల‌యాల‌కు ఏర్పాటుకు 2024-25 నుంచి 2028-29 మ‌ధ్య‌ రూ. 2,359.82 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు.

ఢిల్లీ మెట్రో నాలుగో విడ‌త ప్రాజెక్టుకు ఆమోదం

ఢిల్లీ మెట్రో నాలుగో విడ‌త ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. రిథాలా నుండి కుండ్లీ వ‌ర‌కు 26.468 కిలో మీట‌ర్ల మేరా ఈ మెట్రో ప్రాజెక్టు నిర్మిస్తారు. దేశ రాజ‌ధాని, పొరుగ‌న ఉన్న హ‌ర్యానా మ‌ధ్య క‌నెక్టివిటీని మ‌రింత మెరుగుప‌రుస్తుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తి వ్య‌యం రూ.6,230 కోట్లతో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేష‌న్ (డీఎంఆర్‌సీ) అమ‌లు చేస్తుంది. ఈ వ్య‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్ (ఎస్‌పీవీ), ఢిల్లీ ప్ర‌భుత్వం 50ః50 నిష్ప‌త్తిలో భ‌రిస్తారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner