AP Teachers Transfers : డీఈవో, ఆర్జేడీ ఆఫీసుల్లో పనిచేసే టీచర్లను వెంటనే రిలీవ్ చేయండి- విద్యాశాఖ ఆదేశాలు
AP Teachers Transfers : ఏపీలో బదిలీలపై మళ్లీ కదలిక వచ్చింది. డీఈవో, ఆర్జేడీ ఆఫీసుల్లో మూడేళ్లకు మించి పనిచేస్తున్న ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే మంగళవారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాష్ట్రంలో కొంత మంది ఉపాధ్యాయులకు ఉన్నతాధికారులు ఝలక్ ఇచ్చారు. జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో), ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ (ఆర్‌జేడీ) కార్యాలయాల్లో మూడేళ్లకు మించి పని చేస్తున్న ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించారు. ఆయా ఉపాధ్యాయులను వెంటనే పాఠశాలలకు పంపాలని సూచించారు. ఈ ఆదేశాలను పాటించకపోతే, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డీఈవో, ఆర్జేడీ కార్యాలయాల్లో పని చేసే ఉపాధ్యాయుల్లో చాలా మంది ఏళ్ల తరబడి బోధనకు దూరమవుతున్నారు. అంతేకాకుండా కొంత మంది అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ పి.పార్వతి ఆదేశాలు ఇచ్చారు. డీఈవో, ఆర్జేడీ కార్యాలయాల్లో మూడేళ్లకు పైబడి పని చేస్తున్న ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని, వారి స్థానాల్లో కొత్తవారిని తీసుకురావాలని ఆదేశించారు. వచ్చే మంగళవారం నాటికి ఈ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని డీఈవోలు, ఆర్జేడీలకు అడిషనల్ డైరెక్టర్ పి.పార్వతి ఆదేశించారు.
ప్రస్తుతం పని చేస్తున్న వారిని శనివారం సాయంత్రం నాటికే రిలీవ్ చేయాలని, వారిని స్కూల్స్‌లో బోధనకు ఉపయోగించాలని సూచించారు. ఈ ఆదేశాలను పాటించకపోతే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏళ్ల తరబడి బోధనకు దూరంగా ఉండటం మంచిది కాదని, మూడేళ్లు మించి పని చేస్తున్న ఉపాధ్యాయులను తొలగించాలని ఆదేశించారు. వారు పాఠశాలలకు వెళ్లి బోధనలో భాగస్వామ్యం కావాలని సూచించారు.
ప్రకాశం జిల్లాలోని డీఈవో కార్యాలయంలో 20 ఏళ్లుగా ఏఎస్‌వోగా పని చేస్తున్న ఒక ఉపాధ్యాయుడి పనితీరుపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆ ఉపాధ్యాయుడిని ఏఎస్‌వోగా ఆ బాధ్యతల నుంచి తప్పుకొని తిరిగి పాత స్కూల్‌కు టీచర్‌గా వెళ్లాలని అధికారులు ఆదేశించారు. అధికారుల ఆదేశాలపై సదురు ఉపాధ్యాయుడు కోర్టును ఆశ్రయించాడు. ఈ పరిణామాలను విద్యాశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. వెంటనే డీఈవో, ఆర్జేడీ కార్యాలయాల్లో మూడేళ్ల మించి పని చేస్తున్న ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని ఆదేశించారు.
వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సమాచారం సేకరణ, హాజరు వంటి వివరాలను తీసుకోవడానికి డీఈవో, ఆర్జేడీ కార్యాలయాల్లో కొంత మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిని ఏఎస్‌వో, ఏపీవోలుగా పిలుస్తారు. అయితే ఈ విధులను నాన్ టీచింగ్ ఉద్యోగులతో చేయించొచ్చునని, ఆ పనులను ఉపాధ్యాయులే చేయాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఆ స్థానాల్లో మూడేళ్లకుపైగా పని చేస్తున్నవారిని రిలీవ్ చేయాలని ప్రభుత్వం సూచన మేరకు ఉన్నతాధికారులు ఆదేశించారు.
డీఈవో, ఆర్జేడీ కార్యాలయాల్లో కొంత మంది ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి తిష్టవేసి ఉన్నారు. వీరిని రిలీవ్ చేసి, వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు డీఈవోలు, ఆర్‌జేడీలు దృష్టి సారించారు. ఏఎస్‌వో, ఏపీవోలుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ముందకు రావాలని కోరుతున్నారు.
ఏఎస్‌వో, ఏపీవోలుగా ఎవరిని తీసుకుంటారు?
ఏఎస్‌వో, ఏపీవోలుగా అందరి ఉపాధ్యాయులను తీసుకోరు. కేవలం గణితం, భౌతిక శాస్త్రం బోధించే స్కూల్ అసిస్టెంట్లను మాత్రమే డిప్యూటేషన్ మీద నియమిస్తారు. అలాగే ఏపీవోలుగా సెకండరీ గ్రేడ్ టీచర్లను డిప్యూటేషన్ మీద నియమిస్తారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు