Jagan Reaction on Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్టు.. వైఎస్ జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వైసీపీ మద్దతు
Jagan Comments on Allu Arjun Arrest : సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్‌ను తరలించారు. అయితే.. బన్నీ అరెస్టును ప్రముఖులు ఖండిస్తున్నారు. తాజాగా వైఎస్ జగన్ అల్లు అర్జున్‌కు అండగా నిలిచారు.
చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్‌ను పోలీసులు తరలించారు. నాంపల్లి కోర్టు 14 రోజు రిమాండ్ విధించడంతో.. ఆయన్ను జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో.. చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు అల్లు అర్జున్ అరెస్టుపై ప్రముఖులు స్పందిస్తున్నారు. బన్నీకి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా వైసీపీ చీఫ్ జగన్ అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు.
'హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల.. ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను' అని జగన్ ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్ అరెస్టు పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. 'అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం. యాక్సిడెంట్‌కు ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదు. ఈ తరహా కేసులలో ఇరికిస్తే మంచి మేసేజ్ పోదు. రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందో, తెలియకుండా జరిగిందో తెలియదు. అర్జున్‌ను విడుదల చేయాలని అప్పీల్ చేస్తున్నా. ఈ తరహా కేసులు కోర్టులలో నిలబడ్డా దాఖలాలు లేవు. ఒకవేళ రిమాండ్ వేసినా ఈ రోజో, రేపో బెయిల్ వస్తుంది. ఒకవేళ ఘటనకు బాధ్యులను చేయాల్సి వస్తే బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చిన వాళ్ళను, టికెట్స్ పెంచుతూ అనుమతి ఇచ్చిన వాళ్ళను కూడా అరెస్టు చేయాల్సి ఉంటుంది' అని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.
అటు హైకోర్టులో బన్నీకి ఊరట లభించింది. అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 5 గంటల సమయంలో బన్నీని చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే ఆయనకు బెయిల్ వచ్చింది. హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై వాడీవేడిగా వాదనలు జరిగాయి. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. తొక్కిసలాట కేసులో ఏ11గా అల్లు అర్జున్ ఉన్నారు. ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేశామని పీపీ స్పష్టం చేశారు. అల్లు అర్జున్‌కు బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు.