Questions to Allu Arjun : చిక్కడపల్లి ఠాణాలో అల్లు అర్జున్.. పోలీసులు అడిగిన 11 ప్రశ్నలు ఇవేనా!
Questions to Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది.. అల్లు అర్జున్‌కు ఏం తెలుసు అని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఏసీపీ స్థాయి అధికారి బన్నీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విచారణపై ఉత్కంఠ నెలకొంది.
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో.. అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో బన్నీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే.. అల్లు అర్జున్‌ను పోలీసులు అడిగిన ప్రశ్నలు ఇవే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆయన్ను 11 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది.
11 ప్రశ్నలు..
1.పుష్ప -2 స్పెషల్ షో సదంర్భంగా సంధ్య థియేటర్‌కు రావడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు?
2.పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు?
3.సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా? లేదా?
4.తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా తెలియదా?
5.మీడియా ముందు.. మీకు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు?
6.రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా?
7.అనుమతి లేకుండా రోడ్ షో ఏవిధంగా నిర్వహించారు?
8.మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమా థియేటర్‌కు వచ్చారు?
9.మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు?
10.ఎంత మంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు?
11.ప్రేక్షకుల మీద, పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు చెప్పండి.. అని పోలీసులు ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.
పుష్ప రాకతో..
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరం నుంచి ఆంక్షలు విధించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ వచ్చిన నేపథ్యంలో.. పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీ.. విచారణకు హాజరయ్యారు. అతని తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డితో అల్లు అర్జున్ చిక్కడపల్లి ఠాణాకు వచ్చారు.
ఉత్కంఠ..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ సహా 18 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. చిక్కడపల్లి పీఎస్‌లో సంధ్య థియేటర్ ఘటన దృశ్యాలను పోలీసులు అల్లు అర్జున్‌కు చూపనున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ ఏం చెబుతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు పోలీసుల ప్రశ్నలతో బన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
మరో ఫిర్యాదు..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు కొలిక్కి రాముందే.. మరో కేసు పుష్ప టీమ్‌ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, అల్లు అర్జున్ పై పోలీసు ఫిర్యాదు చేశారు. పుష్ప 2 సినిమా పోలీసులను అవమానించిందని ఆరోపించారు. ఈ మేరకు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంట్లో దర్శకుడు సుకుమార్, నిర్మాతల పేర్లు కూడా ఉన్నాయి.