Araku Special trains: అరకు పర్యాటకులకు శుభవార్త, డిసెంబర్ 28 నుంచి వారాంతాల్లో స్పెషల్ ట్రైన్
Araku Special trains: న్యూఇయర్, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అరకు వచ్చే పర్యాటకుల కోసం ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.డిసెంబర్ 28 నుంచి జనవరి 19వరకు ఈ ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం-అరకు మధ్య నడుస్తాయి.విశాఖ నుంచి ఉదయం బయల్దేరి సాయంత్రానికి తిరిగి విశాఖ చేరుకుంటుంది.
Araku Special trains: న్యూఇయర్ వేడుకలతో పాటు సంక్రాంతి సందర్భంగా అరకు వచ్చే పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.
వారాంతాల్లో ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయలు దేరి ఉదయం 11.45 గంటలకు అరకు రైల్వే స్టేషన్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలు దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకుంటుందని పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక రైలులో ఒక సెకెండ్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ, 10 స్లీపర్ క్లాస్ కోచ్‌లతో పాటు, 4 సాధారణ రెండో తరగతి బోగీలు, 2 సాధారణ జనరల్ సీటింగ్, దివ్యాంగుల కోచ్ లగేజీ బోగీలతో ఈ రైలును నడుపుతారు. విశాఖ నుంచి సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రా గుహలు మీదుగా ప్రత్యేక రైలు రాకపోకలు సాగిస్తుంది. విశాఖ, అరకు సందర్శనకు వచ్చే పర్యాటకులు ఈ రైలు సేవలు వినియోగించుకోవాలని కోరారు.
విశాఖపట్నం-అరకు-విశాఖపట్నం (08525/08526) స్పెషల్ రైళ్లు ప్రతి శని, ఆదివారాల్లో విశాఖపట్నంలో ఉదయం 8:30 గంటలకు బయల్దేరి అదే రోజు ఉదయం 11.45 గంటలకు అరకు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో అరకులో ప్రతి శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖప ట్నం చేరుకుంటాయి. ఈ స్పెషల్ రైళ్లు ఈ నెల 28వ తేది నుంచి జనవరి 19వ తేదీ వరకు నడుస్తాయి.