Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్‌డేట్.. లబ్ధిదారుల ఎంపికపై క్లారిటీ.. 9 ముఖ్యమైన అంశాలు
Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై రేవంత్ సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టింది. 33 జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించాలని నిర్ణయించింది. ఈ పథకానికి సంబంధించిన పురోగతిపై మంత్రి పొంగులేటి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. సర్వే జరుగుతున్న తీరును తెలుసుకోనున్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజాపాలన నిర్వహించారు. దీంట్లో ఎక్కువ దరఖాస్తులు ఇళ్ల కోసమే వచ్చాయి. దాదాపు 80.54 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వారి ఇళ్లకు సర్వేయర్లు వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. కానీ.. ఈ సర్వే ప్రభుత్వం ఆశించినంత వేగంగా జరగడం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు 35 శాతం మాత్రమే వరకు పూర్తయినట్లు సమాచారం.
సంక్రాంతి వరకు..
క్షేత్రస్థాయి సర్వే ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ప్రభుత్వ సంకల్పించింది. కానీ.. మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. నెలాఖరు వరకు కాకుండా.. సంక్రాంతి వరకు పూర్తి కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ సర్వే పూర్తయ్యాక.. గ్రామసభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
9 ముఖ్యాంశాలు..
1.జిల్లాకు ప్రాజెక్టు డైరెక్టర్ల నియామకం ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
2.ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున.. రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
3.ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వనుంది. మొదటి విడతలో స్థలం ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేయనుంది. మొదటి విడతలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్లకు రూ.7,740 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
4.లబ్ధిదారుల ఎంపిక పూర్తయితే పునాది పూర్తయ్యాక రూ.లక్ష చొప్పున అందిస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేల చొప్పున ఇస్తుంది.
5.ఈ నిధులను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం అందించనుంది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం కొత్తగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
6.కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 28 యూడీఏలను ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లను దృష్టిలో పెట్టుకునే యూడీఏల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
7.అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుతో పీఎం ఆవాస్ యోజనలో భాగంగా పట్టణాలకు కేంద్రం అందించే నిధులు రానున్నాయి.
8.ఒక్కో ఇంటికి రూ.5 లక్షలకు గాను కేంద్రం అందించే నిధులు పోనూ.. హడ్కో నుంచి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుని లబ్ధిదారులకు అందించనుంది.
9.ఈ ఆర్థిక సంవత్సరంలోనే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి.. ఇళ్లకు నిధుల కేటాయించేలా ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతోంది. దీనిపై మంత్రి పొంగులేటి సమీక్షలో స్పష్టత రానుంది.