Christmas 2024: క్రిస్‌మస్‌కు ఎరుపు రంగుకు మధ్య సంబంధం ఏమిటి? ఎరుపు రంగు సాక్సులు, దుస్తులు ఎందుకు వేసుకుంటారు?
Christmas 2024: క్రిస్మస్‌కు ఎక్కువగా కనిపించే రంగు ఎరుపు. శాంతాక్లాజ్ దుస్తులు ఎరుపు రంగులో ఉంటాయి. ఎరుపు రంగు సాక్సులు బహుమతులుగా ఇస్తూ ఉంటారు. క్రిస్ మస్ కు ఎక్కువ మంది రెడ్ కలర్ డ్రెష్ వేసుకునేందుకు ఇష్టపడతారు. క్రిస్‌మస్‌కు ఎరుపు రంగుకు మధ్య సంబంధం ఏంటో తెలుసుకోండి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా నిర్వహించుకుంటారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కోసం ఏడాదంతా ఎదురుచూస్తూ ఉంటారు. జీసెస్ క్రీస్తు జన్మదినం సందర్భంగా ఈ పండుగను వేడుకలా చేసుకుంటారు.
క్రిస్మస్ సందర్భంగా ఇళ్లు, చర్చిలు విద్యుద్దీపాలతో వెలిగిపోతాయి. కుటుంబసభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రతి ఇంట్లో క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేస్తారు. ఈ పచ్చని క్రిస్మస్ చెట్టు శాశ్వత జీవితాన్ని సూచిస్తుందని చెప్పుకుంటారు. క్రిస్మస్ సందర్భంగా అందమైన కరోల్స్ పాడుతూ ఉంటారు.
క్రిస్మస్ పేరు చెబితే మతంలో సంబంధం లేకుండా అందరి పిల్లల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంి. ఏడాది పొడవునా పిల్లలు ఈ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ రోజున, తమ ప్రియమైన శాంటాక్లాజ్ తాతా తమకు బహుమతులు ఇస్తారని చెప్పుకుంటారు. ఎరుపు రంగు దుస్తులు ధరించిన శాంతా ఎరుపు రంగులో సాక్సులోనే బహుమతులను దాచి తమకు అందిస్తారని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా క్రిస్మస్ రోజున ఎరుపు రంగే అధికంగా ఎందుకు కనిపిస్తుంది. ఎరుపు రంగు సాక్సులు, ఎరుపు రంగు డ్రెస్సులోనే శాంతా క్లాజ్ రావడం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ట్రెండ్ ఎందుకు మొదలైంది? దీని గురించి చరిత్ర ఏం చెబుతోందో తెలుసుకోండి.
ఎరుపుతో క్రిస్మస్ కు సంబంధం ఏమిటి?
పాత నమ్మకాల ప్రకారం, క్రిస్మస్ సందర్భంగా చిన్న పిల్లలకు బహుమతులు ఇచ్చే ఈ అందమైన పద్దతి టర్కీలో నాల్గవ శతాబ్దంలో ప్రారంభమైంది. టర్కీలోని మైరాలో సెయింట్ నికోలస్ అనే ధనవంతుడు ఉండేవాడు. నికోలస్ స్వభావరీత్యా చాలా దయగలవాడు. పేద ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినకుండా రహస్యంగా సాయం చేసేవాడు. ఒకసారి నికోలస్ కు ముగ్గురు కుమార్తెలున్న ఒక పేద వ్యక్తి గురించి తెలిసింది. ఆ పేదవాడి దగ్గర కూతుళ్ల పెళ్లిళ్లు చేయడానికి డబ్బుల్లేవు. ఆ పేదవాడికి సహాయం చేయడానికి నికోలస్ రాత్రిపూట ఎర్రటి దుస్తులు ధరించి ఎరుపు రంగు సాక్స్ లోనే చాలా డబ్బు నింపి పేదవాడి ఇంటి చిమ్నీ నుండి ఇంట్లోకి వేశాడు. అది కూడా క్రిస్ మస్ పండుగ సమయంలోనే.
ఈ విధంగా ఎర్ర సాక్స్ లో డబ్బు దాచి నికోలస్ ఆ పేదవాడికి చాలాసార్లు సహాయం చేశాడు. ఒకసారి నికోలస్ ఇలా చేయడం ఆ పేదవాడు చూశాడు. ఈ విషయం మరెవరికీ చెప్పొద్దని నికోలస్ ఆ పేదవాడిని కోరాడు. కానీ క్రమేపీ ఈ వార్త పట్టణం అంతటా వ్యాపించింది. ఆ తర్వాత క్రిస్మస్ రోజున శాంతాక్లాజ్ వస్తాడని, ఎరుపు రంగు సాక్స్ లో బహుమతులు ఇస్తాడనే నమ్మకం ఎక్కువ మందికి వచ్చింది. అలా క్రిస్ మస్ కు ఎరుపు రంగుతో బంధం ఏర్పడింది. ఎరుపు రంగు దుస్తులనే క్రిస్ మస్ రోజు ఎక్కువ మంది వేసుకోవడానికి ఇష్టపడతారు. క్రిస్ మస్ అంటేనే ఎరుపు రంగు కలయికలాగా మారిపోయింది.
సంబంధిత కథనం
టాపిక్