జంటలకు అలెర్ట్, రాత్రి భోజనం తర్వాత ఆ పని చేయడం సరైనది కాదని చెబుతున్న కొత్త అధ్యయనం
భార్యాభర్తలు ఏకాంతంగా గడిపేందుకు రాత్రి సమయమే ఉత్తమమైనదని అనుకుంటారు. రాత్రి భోజనం చేశాకే తమ లైంగిక జీవితం పనికి సిద్ధపడతారు. కానీ ఇది మంచి పద్ధతి కాదని అధ్యయనాలు చెబుతున్నాయి.
భార్యా భర్తల సంబంధంలో లైంగిక అనుబంధానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ జంట మధ్య లైంగిక సంబంధం ఆరోగ్యంగా ఉంటుందో వారు సంతోషంగా జీవిస్తారని, వారిద్దరి మధ్య గొడవలు కూడా తక్కువగా వస్తాయని, సర్దుకుపోయే తత్వము ఇద్దరిలోనూ ఏర్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వారు ఏకాంతంగా గడిపేందుకు రాత్రి భోజనం తర్వాత సమయాన్ని ఎన్నుకుంటారు. నిజానికి రాత్రి భోజనం తర్వాత లైంగిక ప్రక్రియకు సిద్ధం అవ్వడం మంచి పద్ధతి కాదని ఒక అధ్యయనం చెబుతోంది.
భోజనం చేశాక ఎందుకు వద్దు?
భోజనం చేశాక శరీరంలో ఉన్న రక్తం జీర్ణవ్యవస్థకు చురుగ్గా ప్రవహిస్తుంది. జననేంద్రియాలకు తగినంత రక్తం చేరుకోదు. దీనివల్ల ప్రేరణ, ఉద్వేగం వంటివి కలగవు. భోజనం తర్వాత ఇన్సులిన్, సెరటోనిన్ హార్మోన్ స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల అలసటగా అనిపిస్తుంది. శక్తి స్థాయిలు కూడా తగ్గిపోతాయి. ఇలాంటి సమయంలో లైంగిక ప్రక్రియకు సిద్ధం అవ్వడం వల్ల వారి మధ్య సాన్నిహిత్యం కొరవడుతుంది. ఘనాహారం ఎక్కువగా తిన్న వారికి జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి వారు లైంగిక ప్రక్రియలో చురుగ్గా, ఉత్సాహంగా పాల్గొనలేకపోవచ్చు. భోజనం తర్వాత పొట్ట ఉబ్బినట్టు, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇది లైంగిక ప్రక్రియను ఇబ్బందికరంగా మార్చేస్తుంది.
ఏ సమయం బెస్ట్?
రాత్రిపూట భోజనం చేశాక లైంగిక కార్యక్రమానికి సిద్ధమైతే ఆ పని సమర్థవంతంగా చేయలేక విరక్తిని పెంచేస్తుందని కొత్త అధ్యయనం చెబుతోంది. మన శక్తి, హార్మోన్ స్థాయిలు, మానసిక స్థితి అనేది ఉదయం పూట లేదా రోజులో మొదటి భాగంలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. కాబట్టి ఈ సమయంలోనే భార్యాభర్తలు లైంగిక ప్రక్రియకు సమయం కేటాయించుకోవడం మంచిది. ఇది భాగస్వాముల మధ్య ప్రేమను పెంచుతుంది. బిజీ షెడ్యూల్ కారణంగా చాలామందికి ఉదయం పూట వీలుకాదు. అందుకే రాత్రిపూట మాత్రమే ఆ పనిని చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇది మీ మానసిక ఆరోగ్యానికి, లైంగిక ఆరోగ్యానికి కూడా చేసే ప్రయోజనం పెద్దగా లేదు. కాబట్టి ఉదయం పూట అప్పుడప్పుడు సమయం కేటాయించుకోవడానికి ప్రయత్నించండి. రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణను పెంచుకోవచ్చు. కాబట్టి మీ మనసు, శరీరం కూడా లైంగిక ప్రక్రియకు సిద్ధమవుతుంది. ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు ఆ పనికి పూనుకోకపోవడమే మంచిది. లేకుంటే త్వరగా విరక్తి వచ్చేస్తుంది.
లైంగిక ప్రక్రియ అనేది భార్యాభర్తలను ఇద్దరికీ మానసికంగా శారీరకంగా ఎంతో మేలు చేస్తుందని అధ్యయనాలు ఇప్పటికే చెబుతున్నాయి. ఇది మన మెదడును ప్రేరేపించడమే కాదు, ఇతర అవయవాలను కూడా ఉత్సాహపరిచేలా చేస్తుంది. ఆ సమయంలో మీ శరీరంలో ఎండార్పిన్లు, డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి ఆనంద హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు మీ శరీరంలో ఉన్న ఒత్తిడిని తగ్గించేస్తాయి. మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. మీ భాగస్వామితో భావోద్వేగా సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. శారీరకంగా కూడా ఇది ఆరోగ్యానికి మేలే చేస్తుంది. క్యాలరీలను బర్న్ చేయడంలో శృంగారం ముందుంటుంది. కాబట్టి భార్యాభర్తలు దీనికి కూడా ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకోవాల్సిన అవసరం ఉంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్