OTT Action Thriller: ఓటీటీలో రెంట్ లేకుండా ఈ వారమే భారీ మల్టీస్టారర్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్!
Singham Again OTT: సింగం అగైన్ చిత్రం రెంట్ లేకుండా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చేస్తోందని తెలుస్తోంది. ఈ వారమే ఈ మల్టీస్టారర్ చిత్రం రెంట్ తొలగిపోతుందని సమాచారం. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సింగం అగైన్ చాలా అంచనాలతో వచ్చింది. దీపావళి సందర్భంగా నవంబర్ 1న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. అజయ్ దేవ్‍గణ్, కరీనా కపూర్, రణ్‍వీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొణ్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో భారీ మల్టీస్టారర్‌గా ఈ చిత్రం రూపొందింది. అయితే, బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఈ మూవీ పర్ఫార్మ్ చేయలేకపోయింది. సింగం అగైన్ చిత్రం ఇటీవలే రెంట్ పద్ధతిలో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు రెంట్ లేకుండా స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు సమీపించింది.
స్ట్రీమింగ్ ఎక్కడ?
సింగం అగైన్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ వారంలోనే ఈ రెంట్ తొలగిపోతుందని తెలుస్తోంది. అద్దె లేకుండా ఈ శుక్రవారం నుంచే స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం బయటికి వచ్చింది. దీంతో ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్లందరూ ఈ మూవీని చూసేయవచ్చు.
సింగం అగైన్ చిత్రం మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వచ్చినా ఆ రేంజ్‍లో కలెక్షన్లు దక్కలేదు. ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. రామాయణం రిఫరెన్సులతో ఈ యాక్షన్ మూవీని తెరకెక్కించారు. సింగం ఫ్రాంచైజీలో భాగంగా వచ్చింది.
సింగం అగైన్ కలెక్షన్లు
సింగం అగైన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.390కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. ఈ మూవీ దాదాపు రూ.350కోట్ల కలెక్షన్లతో రూపొందింది. ఎంతో క్రేజ్‍తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టలేకపోయింది. ఆరంభం నుంచే మోస్తరుగా కలెక్షన్లు వచ్చాయి. టాక్ సరిగా లేకపోవడంతో లాంగ్ థియేట్రికల్ రన్ సాధించలేకపోయింది. మోస్తరు ఫలితంతో సరిపెట్టుకుంది.
సింగం అగైన్ చిత్రంలోని పాత్రలను రామాయణం స్ఫూర్తితో రోహిత్ శెట్టి రాసుకున్నారు. అజయ్ దేవ్‍గణ్ పోషించిన బాజీరావ్ సింగం పాత్రను రాముడిగా, కరీనా కపూర్ చేసిన అవ్ని కామత్ క్యారెక్టర్‌ను సీత రిఫరెన్సులతో చూపించారు. విలన్ల వల్ల విడిపోయిన వీరిద్దరినీ కలిపేందుకు అక్షయ్ కుమార్, రణ్‍వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకొణ్ పాత్రలు సాయం చేసినట్టుగా కథను ముందుకు నడిపించారు. కన్విన్సింగ్‍గా లేకపోవడంతో ఈ అంశం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సింగం అగైన్ చిత్రంలో అర్జున్ కపూర్ విలన్‍గా నటించారు.
సింగం అగైన్ మూవీని జియో స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‍మెంట్స్, రోహిత్ శెట్టి పిక్చర్స్, దేవ్‍గణ్ ఫిల్మ్స్, సినర్జీ పతాకాలు కలిసి ప్రొడ్యూజ్ చేశాయి. రవి బస్సూర్, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. జాకీ ష్రాఫ్, అషుతోశ్ రాణా, రవికిషన్, శ్వేతా తివారీ, దయానంద్ శెట్టి, రణ్‍బీర్ విజన్ ఈ మూవీలో కీలకపాత్రల్లో కనిపించారు.