AP Stamps Papers: ప్రైవేట్ జోక్యం, ఏపీలో నియంత్రణ లేకుండా స్టాంప్ పేపర్ల విక్రయం..
AP Stamps Papers: ఏపీలో డిజిటల్ స్టాంప్ పేపర్ల విక్రయాలు ప్రారంభమయ్యాక వీధివీధిలో ఆన్‌లైన్ స్టాంప్ పేపర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ల అమ్మకాలతో పాటు డైరెక్ట్ స్టాంప్ డ్యూటీ ఫీజుల వసూళ్లు కూడా చేస్తుండటంతో గందరగోళంగా మారింది.ఫీజుల వసూళ్లపై ప్రభుత్వ స్పష్టత కొరవడింది.
AP Stamps Papers: ఆంధ్రప్రదేశ్‌లో నాన్ జ్యూడిషియల్ స్టాంపుల విక్రయాలు నిలిచిపోయి వాటి స్థానంలో ఈ స్టాంప్ పేపర్లను వినియోగిస్తున్నారు. గత ప్రభుత్వంలో మహారాష్ట్రలోని నాసిక్ సెక్యూరిటీ ప్రింటర్లకు చెల్లింపులు చేయకపోవడంతో ఏపీకి స్టాంప్ పేపర్ల సరఫరా ఆగిపోయింది. దాని స్థానంలో ప్రైవేట్ సంస్థలు రూపొందించే ఈ స్టాంప్ పేపర్లను వినియోగించడం మొదలైంది.
రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఆధీకృత స్టాంప్ పేపర్ విక్రేతల ద్వారా నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ విక్రయాలు జరిగేవి. గత ప్రభుత్వం నాన్-జ్యుడీషియల్ స్టాంపుల సప్లయిని ఆపివేసి, దాని స్థానములో కొత్తగా ఇ-స్టాంపులను ప్రవేశపెట్టడంతో స్టాంపు వెండర్లతో పాటు, కొత్తవారికి కూడా ఇ-స్టాంపు వెండార్ లైసెన్సును స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఇస్తోంది.
ఈ స్టాంప్ పేపర్ విక్రయాలు ప్రారంభం అయ్యాక విచ్చలవిడిగా లైసెన్సులు జారీ చేయడం మొదలైంది. ఈ అనుమతుల్లో ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో వీధి వీధిలో మొబైల్ రిచార్జ్ కూపన్ల తరహాలో అమ్మకాలు జరుగుతున్నాయి.
మండలాలు, ఏరియాలతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటుతో సంబంధం లేకుండా స్టాంపు వెండార్ లైసెన్సులను జారీ అవుతున్నాయి. పట్టణాలు నగరాల్లో చేసే వ్యాపారాలతో సంబంధం లేకుండా పచారి షాపులు, ఫ్యాన్సీ, కూల్డ్రింక్ షాపులు, జిరాక్స్ షాపులతో వెండారు లైసెన్సులను ఇబ్బడిముబ్బడిగా మంజూరు చేసేస్తున్నారు.
ఈ-స్టాంపు వెండార్లపై గతంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అజమాయిషీ ఉండేది. ఎక్కడ ఎన్ని లైసెన్సులు జారీ చేస్తున్నారో లెక్కలు కూడా రిజిస్ట్రేషన్ శాఖ వద్ద సరైన సమాచారం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు.
కాసులు కురిపించే వ్యాపారం…
సాధారణంగా నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ల విక్రయిస్తే ప్రభుత్వం కొంత కమిషన్ చెల్లించేది. ప్రస్తుతం రూ.100 రుపాయల ముఖ విలువ ఉండే స్టాంప్ పేపర్‌ను రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నా అడ్డుకునే వారు లేరు. స్టాంప్ పేపర్ విక్రయాలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడం, ప్రైవేట్ సంస్థలకు వాటిని కట్టబెట్టడంతో ఈ పరిస్థితి వచ్చింది.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో గతంలో ప్రైవేట్ సంస్థ స్టాంపు వెండార్లకు 500 నుండి 1000 వరకు స్టాంపులను జారీచేసేదని. ప్రస్తుతం స్టాంపు వెండార్లు రిజిస్ట్రేషన్ సేల్ డీడ్‌లకు సంబంధించి డైరెక్ట్ స్టాంప్ డ్యూటీ, యూజర్ ఛార్జి, రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా కట్టించుకుంటేనే కావాలసినన్ని స్టాంపులు ఇస్తామని లేకపోతే 200కు మించి స్టాంపులను ఇవ్వమని వెండార్లకు చుక్కలు చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
డైరెక్ట్ స్టాంప్ డ్యూటీ, యూజర్ ఛార్జీలను సాధారణంగా బ్యాంక్ చలాన్ల ద్వారా నేరుగా ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. ఆస్తి లావాదేవీల్లో టిడిఎస్ వంటి చెల్లింపులను ఆదాయపన్ను శాఖ పోర్టల్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ పోర్టల్ ద్వారా స్టాంప్ డ్యూటీ చెల్లిస్తేవాటితో రిజిస్ట్రేషన్లు చేయడానికి సబ్ రిజిస్ట్రార్లు అనుమతించడం లేదు. ఈ-స్టాంపుల ద్వారా స్టాంప్ డ్యూటీలు, ఇతర ఫీజుల చెల్లింపుకు చట్టబద్దత పై ఇప్పటికీ స్పష్టత లేదు.
డైరెక్ట్ స్టాంప్ డ్యూటీ, యూజర్ ఫీజులను కట్టడానికి అనేకమంది వినియోగదారులు వెనుకాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వినియోగదారులకు సరైన అవగాహన కల్పిస్తే బాగుంటుందని స్టాంపు వెండార్లు, వినియోగదారులు కోరుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా లైసెన్సులు మంజూరు చేయడం, ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో భవిష్యత్తులో ఏమి జరుగుతుందోననే ఆందోళన కూడా విక్రేతల్లో ఉంది.
నాన్-జుడీషియల్ స్టాంపుల పునరుద్ధరణ
ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం నాన్- జుడీషియల్ స్టాంపులను తిరిగి పునరుద్దరించింది. వాటిని కొనుగోలు చేయాలంటే వినియోగదారుడు తన మొబైల్ నెంబరును విక్రేతకు చెప్పి, ఆ నెంబరుకు వచ్చిన ఓటిపి ని నమోదుచేసిన తర్వాతనే స్టాంపులు ఆన్లైన్లో ప్రింట్ అవ్వడంతో వినియోగదారులతో పాటు, స్టాంపు వెండార్లు వాటిని వినియోగించడం లేదు. ఈ స్టాంప్ పేపర్ల విషయంలో ప్రభుత్వం స్ఫష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంపై స్పష్టత కోరేందుకు ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల్ని సంప్రదించినా వారు స్పందించ లేదు.