Vja Bad Police: మహిళా కానిస్టేబుల్‌కు లైంగిక వేధింపులు, విజయవాడలో సీఐపై సస్పెన్షన్ వేటు
Vja Bad Police: విజయవాడలో మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించిన సీఐపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో విధులను నిర్వర్తించడానికి నగరానికి వచ్చిన మహిళా కానిస్టేబుల్‌తో సీఐ ఒకరు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేశారు.
Vja Bad Police: విజయవాడలో గాడి తప్పిన పోలీస్ అధికారి సస్పెన్షన్‌కు గురయ్యాడు. మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించడంతో ఉద్యోగానికి దూరం అయ్యాడు. శాఖపరమైన విచారణకు ఆదేశించడంతో పాటు బాధితురాలి ఫిర్యాదుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు.
భవానీ దీక్ష విరమణల నేపథ్యంలో నగరంలో బందోబస్తు విధులకు హాజరైన ఇద్దరు సీఐలు వేర్వేరు ఘటనల్లో సస్పెండ్ అయ్యారు. సీఐ స్థాయి అధికారులు మహిళలతో అసభ్యకరంగా వేధింపులకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లా వీఆర్‌లో ఉన్న సీఐ డి. జగన్మోహనరావు భవానీ దీక్ష విరమణల బందోబస్తు కోసం నగరానికి వచ్చాడు.
బందోబస్తు డ్యూటీలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్‌ను లైంగిక వేధించడంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో గుంటూరు ఐజీ సీఐను సస్పెండ్ చేశారు. బాధితురాలు వినాయక గుడి సమీపంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె పై అధికారిగా పర్యవేక్షణలో ఉన్న సీఐ బాధితురాలి ఫోన్ నంబర్ తీసుకుని వాట్సాప్‌లో మెసేజీలు పంపాడు. బాధితురాలు వాటికి స్పందించక పోవడంతో అందంగా ఉన్నావంటూ సందేశాలు పంపుతూ వచ్చాడు. చివరకు అసభ్యకరంగా మెసేజీలు చేయడంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు సీఐపై వేటు వేశారు.
హౌస్ కీపింగ్ ఉద్యోగితో మరొకరు..
భవానీ దీక్షల్లో బందోబస్తు విధుల కోసం బాపట్ల నుంచి వచ్చిన సీఐ శ్రీనివాసరావు విజయవాడ గాంధీనగర్‌లోని చిట్టూరి స్కూల్ ఎదురుగా ఉన్న హోటల్లో బస చేశాడు. 22వ తేదీ ఆదివారం రాత్రి మద్యం సేవించి ఆ మత్తులో హోటల్లో హౌస్ కీపింగ్ విధులు నిర్వర్తిస్తున్న మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సత్యనారాయణపురం పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. బాపట్ల సీఐపై చర్యలు తీసుకోనున్నారు.