RTC BUS Theft: పుష్ప2 సినిమా చూసి నర్సీపట్నం బస్టాండ్‌లో బస్సును కొట్టేసిన గంజాయి స్మగ్లర్
RTC BUS Theft: గంజాయి మత్తులో పుష్ప 2 సినిమా చూసిన నిందితుడు అదే ఊపులో ఆర్టీసీ బస్సును అపహరించుకుపోయాడు. బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసిన బస్సు మాయం కావడంతో ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సును అపహరించిన నిందితుడు అందులోనే విశ్రాంతి తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు.
RTC BUS Theft: ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసిన బస్సును గంజాయి స్మగ్లర్ అపహరించడం కలకలం రేపింది. చోరీ చేసిన బస్సులో కొంత దూరం ప్రయాణించిన నిందితుడు ఓ చోట ఆపేసి అందులో విశ్రమించడంతో ఆర్టీసీ బస్ డ్రైవర్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు గంజాయి మత్తులో పుష్ప 2 సినిమా చూసి అదే ఊపులో బస్సును ఎత్తుకెళ్లినట్టు గుర్తించి అవాక్కయ్యారు.
నర్సీపట్నం బస్టాండ్‌కు 31 టీహెచ్ 0765 నంబరు ఆర్టీసీ అద్దె బస్సు ఆదివారం రాత్రి చేరుకుంది. బస్టాండ్‌కు వచ్చిన తర్వాత క్లీనర్ బస్సును శుభ్రం చేసి తాళాన్ని అందులోనే వదిలి డ్రైవర్‌కు సమాచారం ఇచ్చి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం 5:00 గంటలకు బస్సు డ్రైవర్ బస్టాండ్‌కు వచ్చి చూసేసరికి అక్కడ బస్సు లేకపోవడాన్ని గమనించాడు.
బస్సు లేకపోవడంతో డిపో మేనేజర్ కు సమాచారం ఇచ్చారు. దీంతో డిపోమేనేజర్ నర్సీపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. చోరీకి గురైన బస్సు ఫోటో, వివరాలను ఆర్టీసీ అధికారులు జిల్లాలోని బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగుల వాట్సాప్ గ్రూపులకు పంపించారు. ఆర్టీసీ బస్సు కోసం పోలీసులు గాలింపు చేపట్టినా దాని అచూకీ లభించకపోవడంతో సీసీ కెమెరాలను పరిశీలించారు.
ఈ క్రమంలో చింతపల్లి నుంచి నర్సీపట్నం వస్తున్న నైట్ హాల్ట్ సర్వీస్ బస్సు డ్రైవర్ ఒకరు చింతపల్లి మండలం చింతలూరు వద్ద చోరీకి గురైన బస్సు ఆగి ఉండటాన్ని గుర్తించారు. ఆ విషయాన్ని వెంటనే డిపో మేనేజర్‌కు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన చింతపల్లి సీఐ వినోద్‌కు సమాచారం ఇచ్చారు. చింతపల్లి నుంచి పోలీసు సిబ్బంది వచ్చి చూసేసరికి నిందితుడు బస్సులో నిద్రపోతున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బస్సును నర్సీపట్నం పోలీసు స్టేషన్‌కు తరలించారు.
పుష్ప ఎఫెక్ట్..?
చోరీ చేయడానికి ముందు నిందితుడు బస్టాండ్ సమీపంలో ఉన్న థియేటర్‌లో పుష్ప 2 సినిమా చూసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన సాదిక్ బాషాగా గుర్తించారు. గతంలో బస్సులు నడిపే అనుభవం ఉందని, అప్పుడప్పుడు విశాఖ ఏజెన్సీకి వెళ్లి వస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.
ఆదివారం రాత్రి నర్సీపట్నం వచ్చిన సాధిక్ 'పుష్ప-2' సినిమా చూశాడు. ఆ తర్వాత బస్టాండ్ ఆవరణలో నిలిపి ఉంచిన బస్సుల్లో ఒకదానిలో కాసేపు నిద్రపోయాడు. ఆ తర్వాత అర్థరాత్రి ఒంటి గంట సమయంలో అదే బస్సును తీసుకుని వెళ్లిపోయాడు. నిందితుడిపై గతంలో మూడు గంజాయి కేసులు, ఓ చోరీ కేసు ఉన్నాయి. బస్సును ఎందుకు తీసుకెళ్లాడో చెప్పడం లేదని గంజాయి ప్రభావంలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. గంజాయి రవాణా కోసమో, విడిభాగాలుగా అమ్ముకోడానికో బస్సును తీసుకెళ్లి ఉంటాడని భావిస్తున్నారు.