Telugu Web Series OTT: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన ఓటీటీ తెలుగు వెబ్ సిరీస్ ఇదే.. మెప్పించిన విషయాలు ఏంటి? మీరు చూశారా..
Telugu Web Series OTT: 2024లో కొన్ని తెలుగు వెబ్ సిరీస్‍లు వచ్చాయి. వివిధ జానర్లలో సిరీస్‍లు అడుగుపెట్టాయి. అయితే, ఈ ఏడాది వచ్చిన ఓ సిరీస్ ప్రేక్షకుల మనసులను విపరీతంగా గెలుచుకుంది. భారీ వ్యూస్ దక్కించుకుంది. ఆ వివరాలివే..
ఈ ఏడాది 2024లో వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లలో వెబ్ సిరీస్‍లు అడుగుపెట్టాయి. ఫ్యామిలీ డ్రామాలు, థ్రిల్లర్లు, రొమాంటిక్ కామెడీ ఇలా చాలా రకరకాల జానర్ల తెలుగు సిరీస్‍లు వచ్చాయి. అయితే, ఈ ఏడాది అందరీని ఓ వెబ్ సిరీస్ విపరీతంగా మెప్పించింది. 2024లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న తెలుగు సిరీస్‍గా నిలిచింది. అదే ‘#90s: ఏ మిడిల్‍క్లాస్ బయోపిక్’ సిరీస్. 1990ల బ్యాక్‍డ్రాప్‍లో ఓ మధ్య తరగతి కుటుంబ చుట్టూ సాగే ఈ సిరీస్ ప్రేక్షకుల మనసులను గెలిచింది. ఎందుకో.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో ఇక్కడ చూడండి.
90s (నైంటీస్) వెబ్ సిరీస్‍లో సీనియర్ యాక్టర్ శివాజీ, వాసుకీ ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించారు. మౌళి తనూజ్ ప్రశాంత్, రోహన్, వసంతిక, స్నేహల్ కీలకపాత్రల్లో నటించారు. ఈ సిరీస్‍కు యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు.
ఈ సిరీస్‍లో మెప్పించిన అంశాలు ఇవే
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసే చంద్రశేఖర్ (శివాజీ) మధ్యతరగతి కుటుంబం కథే ఈ 90s. 1990ల కాలంలో ఈ సిరీస్ సాగుతుంది. అప్పట్లో సగటు మధ్య తరగతి కుటుంబంలో ఆలోచనలు, పరిస్థితులు ఎలా ఉండేవి, పిల్లల గురించి తల్లిదండ్రులు ఎలా ఆలోచించే వారనే విషయాలను దర్శకుడు ఈ సిరీస్‍లో అద్భుతంగా చూపించారు. పిల్లల చదువులపై పేరెంట్స్ ఎలాంటి అంచనాలు, ఆశలతో ఉంటారనేది తెరకెక్కించారు. 90ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఈ సిరీస్‍లో చాలా విషయాలు ఉంటాయి. దీంతో 90s సిరీస్ చాలా మందికి బాగా కనెక్ట్ అయింది.
1990ల్లోని మిడిల్ క్లాస్ వారికి ఈ 90s వెబ్ సిరీస్ ఎక్కడో చోట కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇలా మనకు కూడా జరిగిందే అని కనీసం ఒక్కసారైనా అనిపిస్తుంది. అంతలా ఈ సిరీస్ ప్రేక్షకులను కనెక్ట్ చేస్తుంది. కథలోనే భాగంగా ఎంటర్‌టైన్‍మెంట్ కూడా ఉండేలా ఆదిత్య హాసన్ ఈ సిరీస్ రూపొందించారు. సహజంగా ఉండే కామెడీ కూడా బాగా నవ్విస్తుంది. ఎమోషనల్, ఆలోచింపజేసే సీన్లు ఉంటాయి. మొత్తంగా ఓ మంచి ప్యాకేజ్‍గా ఈ సిరీస్‍ను ఆదిత్య హాసన్ తెరకెక్కించారు. శివాజీ, వాసుకీతో పాటు పిల్లల యాక్టింగ్ కూడా ఈ సిరీస్‍కు మరో హైలైట్. ముఖ్యంగా రోహన్ చాలా మెప్పించారు. మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించింది. సాంప్రదాయినీ అనే బీజీఎం సాంగ్ ఎంతో పాపులర్ అయింది.
మొత్తంగా ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ 90s సూపర్ సక్సెస్ అయింది. చాలా మంది ప్రేక్షకుల హృదయాలను తాకింది. చాలా ప్రశంసలను దక్కించుకుంది. కొందరు ప్రముఖులు కూడా ఈ సిరీస్‍ను మెచ్చుకున్నారు. దర్శకుడు ఆదిత్య హాసన్‍కు రెండు సినిమాల అవకాశాలు కూడా వచ్చాయి.
ఈటీవీ విన్‍కు బూస్ట్
90s: ఏ మిడిల్‍క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈ ఏడాది జనవరి 5వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సిరీస్ వల్ల ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ మరింత సక్సెస్ అయింది. ఆ ఓటీటీ సబ్‍స్క్రిప్షన్లకు ఈ సిరీస్ మంచి బూస్ట్ ఇచ్చింది.