90s Web Series Review: నైంటీస్ వెబ్ సిరీస్ రివ్యూ: శివాజీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సిరీస్ ఎలా ఉందంటే..-90s middle class biopic ott web series review bigg boss fame sivaji comedy emotional drama relatable and entertaining ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  90s Web Series Review: నైంటీస్ వెబ్ సిరీస్ రివ్యూ: శివాజీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సిరీస్ ఎలా ఉందంటే..

90s Web Series Review: నైంటీస్ వెబ్ సిరీస్ రివ్యూ: శివాజీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సిరీస్ ఎలా ఉందంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 05, 2024 11:39 AM IST

90s A Middle Class Biopic OTT Web Series Review: శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ‘నైంటీస్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. 1990 దశకాల్లో మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి.

90s OTT Web Series Review: నైంటీస్ వెబ్ సిరీస్ రివ్యూ
90s OTT Web Series Review: నైంటీస్ వెబ్ సిరీస్ రివ్యూ

90s A Middle Class Biopic OTT Web Series Review: వెబ్ సిరీస్: నైంటీస్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్; ప్రధాన నటీనటులు: శివాజీ, వాసుకీ ఆనంద్, మౌళి తనూజ్ ప్రశాంత్, రోహన్, వసంతిక, స్నేహల్ తదితరులు; మ్యూజిక్ డైరెక్టర్: సురేశ్ బొబ్బిలి; డీవోపీ: అజీమ్ మహమ్మద్; నిర్మాత: రాజశేఖర్ మేడారం; రచన, దర్శకత్వం: ఆదిత్య హాసన్; స్ట్రీమింగ్: ఈటీవీ విన్, జనవరి 5వ తేదీ నుంచి..

సీనియర్ నటుడు, ఇటీవలే బిగ్‍బాస్‍లో పాలొన్న శివాజీ.. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘నైంటీస్’ (#90s) వెబ్ సిరీస్ ఈటీవీ విన్‍ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. దీనికి ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది క్యాప్షన్‌గా ఉంది. పవన్ కల్యాణ్ ‘తొలి ప్రేమ’లో చెల్లెలుగా చేసిన వాసుకీ ఆనంద్ ఈ వెబ్ సిరీస్‍లో మరో ప్రధాన పాత్రలో నటించారు. ట్రైలర్‌తోనే ఆసక్తి రేపిన ఈ సిరీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ‘నైంటీస్ - ఏ మిడిల్‍క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.

కథ ఇలా..

ప్రభుత్వ పాఠశాలలో లెక్కల ఉపాధ్యాయుడిగా పని చేసే మధ్య తరగతి వ్యక్తి చంద్రశేఖర్ (శివాజీ) తన పిల్లలను క్రమ శిక్షణతో పెంచుతుంటారు. పెద్ద కుమారుడు రఘుతేజ (మౌళి తనూజ్ ప్రశాంత్).. పదో తరగతిలో జిల్లా ఫస్ట్ వస్తాడని నమ్మకంతో ఉంటాడు. అమ్మాయి దివ్య (వసంతిక) భవిషత్తుపై, అల్లరి చేస్తూ చదువు బుర్రకెక్కని చిన్నోడు అర్జున్ (రోహన్) చదువు గురించి ఆలోచిస్తుంటారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య కుటుంబాన్ని నడిపిస్తుంటారు చంద్రశేఖర్, ఆయన భార్య రాణి (వాసుకీ ఆనంద్). మధ్య తరగతి ఆప్యాయతలు, ఆలోచనలతో జీవిస్తుంటారు. సుజిత (స్నేహల్)ను రఘుతేజ ప్రేమిస్తాడు. క్రికెట్ అంటే కూడా ఇష్టపడుతుంటాడు. మరి చంద్రశేఖర్ ఆశించినట్టు రఘుతేజకు పదో తరగతిలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? వీరి కుటుంబంలో జరిగిన పరిస్థితులేంటి? ఉపాధ్యాయుడిగా చంద్రశేఖర్ సాధించే ఘనత ఏంటి? రఘు ప్రేమ సంగతి ఏమైంది? అనేదే ఈ నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ ప్రధాన కథగా ఉంది.

జ్ఞాపకాలను తట్టిలేపేలా..

90s A Middle Class Biopic Web Series Review: ఉపాధ్యాయుడిగా చేసే మధ్య తరగతి తండ్రి.. పిల్లలకు వందకు వంద మార్కులు రావాలనుకునే ఆయన మనస్తత్వం - పిల్లల భవిష్యత్తు గురించి.. కుటుంబ బాధ్యతల గురించి నిత్యం ఆలోచించే తల్లి - తమ ఆకాంక్షల కోసం, తండ్రి అంచనాలను నిలబెట్టేందుకు తపించే పిల్లలు - ఇలా 1990 దశకాల్లో సగటు మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే పరిస్థితుల చుట్టూ ఈ కథను దర్శకుడు ఆదిత్య హసన్ రాసుకున్నారు. ఈ సిరీస్‍లో కనిపించే వస్తువులు, చిన్నచిన్న విషయాలు, పరిస్థితులు, అందరి ఆలోచనలు.. నైంటీస్ కిడ్స్ (1990 దశకంలో పుట్టిన వారికి)కు రిలేట్ అవుతాయి. జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. నైంటీస్ కిడ్స్ చాలా మంది.. ఇది మనకు కూడా జరిగింది కదా అనుకునేలా కొన్ని సన్నివేశాలైనా టచ్ అవుతాయి. స్కూల్‍లో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య టీనేజ్ అట్రాక్షన్ కూడా రిలేట్ అవుతుంది.

కథనం సాగిందిలా..

రఘు (మౌళి తనూజ్ ప్రశాంత్) తాను పదో తరగతి చదువుతున్నప్పుడు పరిస్థితులను గుర్తు చేసుకోవడంతో ఈ సిరీస్ మొదలవుతుంది. మిడిల్ క్లాస్ మైండ్‍సెట్‍ను, తల్లిదండ్రుల ఆలోచనలను వివరిస్తూ.. ఇదేం పెద్ద కథ కాదని.. మంచి, జ్ఞాపకాలు, అనుభవాలు మాత్రమేనని.. పెద్దగా అంచనాలు పెట్టుకోవద్దంటూ ఆరంభంలోనే రఘుతో చెప్పించేశాడు దర్శకుడు. ఆ తర్వాత కథ ప్రారంభం అవుతుంది.

పాడైపోయిన చెప్పులు.. బొక్కలు పడిన బనియన్లను చంద్రశేఖర్ (శివాజీ) వేసుకోవడం.. రాణి (వాసుకీ) ఇంట్లో ఎక్కువగా ఉప్మానే చేస్తుండడం.. సరిగా చదవకపోతే పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం అని తపనపడడం.. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిపై ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం.. ఇలా మధ్యతరగతి పరిస్థితులతో ఈ సిరీస్ సాగుతుంది. 90 కంటే ఎక్కువ మార్కులు వచ్చినా పిల్లలను పొగడడు చంద్రశేఖర్. ఇంట్లో కేబుల్ పెట్టించాలన్నా.. ఏ ఖర్చు చేయాలన్నా ఆలోచిస్తుంటాడు. ఇలా ప్రతీ ఎపిసోడ్‍లోనూ ఒకప్పటి మిడిల్ క్లాస్ ఆలోచనలు ఉంటాయి. ఇక, స్కూల్‍లో రఘు లవ్ స్టోరీ కూడా సహజంగానే ఉంటుంది. ఆ వయసులో ఒకరిపై ఒకరు ఎలా అట్రాక్ట్ అవుతారో దర్శకుడు చూపించారు.

1990 దశకంలో సగటు మధ్యతరగతి కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉండేవో దర్శకుడు ఆదిత్య చూపించారు. ఎక్కువ డ్రామా లేకుండా.. సహజత్వానికి దగ్గరగా ఉండేలా తెరకెక్కించారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలను రాసుకున్న, చూపించిన తీరు మెప్పిస్తుంది. సహజంగా ఉండటంతో చాలా మంది కనెక్ట్ అవుతారు. ప్రైవేట్ పాఠశాలల్లో బట్టీ చదువుల ప్రస్తావన కూడా ఉంది.

ఇంకాస్త ఫన్ ఉండి ఉంటే..

అయితే, ఈ సిరీస్‍లో మిడిల్ క్లాస్ పరిస్థితుల చుట్టూ ఆర్గానిక్‍గానే మరింత ఫన్ జనరేట్ చేసే అవకాశం ఉంది. అయితే, దర్శకుడు ఎక్కువగా సరదా సన్నివేశాలను రాసుకోలేదు. దీంతో అక్కడక్కడా సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కువగా సహజత్వంతో తెరకెక్కించాలన్న ఉద్దేశంతో ఇలా చేసి ఉండొచ్చు. అల్లరి చేసే అర్జున్ క్యారెక్టర్‌తో కాస్త నవ్వులు పంచారు. అయితే, మరికొంత ఫన్ ఉండి ఉండే ఈ సిరీస్‍ మరింత మెరుగ్గా ఉండేది.

ఫుల్ మార్క్స్..

90s web series Review: ఈ సిరీస్‍లో ప్రధానంగా కనిపించేది కొన్ని పాత్రలే అయినా.. అందరూ న్యాయం చేశారు. ముఖ్యంగా ఉపాధ్యాయుడిగా, మధ్యతరగతి వ్యక్తిలా శివాజీ జీవించేశారు. తాను ఎంత మంచి నటుడో నిరూపించుకునేందుకు శివాజీకి చాలా కాలం తర్వాత అవకాశం వచ్చింది. చంద్రశేఖర్ పాత్రలో ఆయనకు ఫుల్ మార్క్స్ పడతాయి. అయితే, తెలంగాణ యాస ఆయనకు అంత సెట్ అయినట్టు కనిపించలేదు. తల్లిగా వాసుకీ నటన కూడా చాలా సహజత్వంతో మెప్పించేలా ఉంది. పెద్ద కొడుకు రఘు పాత్రలో మౌళి తనూజ్ ప్రశాంత్ కూడా పరిణితి చూపించాడు. రోహన్, వసంతిక కూడా బాగా చేశారు. మిగిలిన నటీనటులు కూడా ఉన్నంత సేపు బాగా చేశారు.

సాంకేతిక వర్గం

ఈ సిరీస్‍ను తాను రాసుకున్న, ఊహించిన విధంగా తెరకెక్కించటంలో దర్శకుడు ఆదిత్య హాసన్ దాదాపు సక్సెస్ అయ్యారు. 90ల మధ్య తరగతి కుటుంబ పరిస్థితులను బాగా చూపించారు. ఎక్కడా నాటకీయంగా లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇళ్లు, పరిసరాలు మొత్తం 1990ల్లో ఉన్న ఫీలింగే కలిగేలా మెప్పించారు. మాటలు కూడా సహజంగా ఉన్నాయి. ‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ టైటిల్‍కు న్యాయం చేశారు. ముందు చెప్పినట్టు.. ఇంకొన్ని సరదా సన్నివేశాలు రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది. సురేశ్ బొబ్బిలి ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సిరీస్‍కు సరిగ్గా సూటైంది. టైటిల్ సాంగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా సరిపోయింది.

మొత్తంగా.. నైంటీస్ వెబ్ సిరీస్ చాలా మందికి రిలేట్ అవుతుంది. జ్ఞాపకాలను, అనుభవాలను గుర్తు చేస్తుంది. ఒకప్పటి మిడిల్ క్లాస్ లైఫ్‍ను కళ్ల ముందు ఉంచుతుంది. పిల్లలను ప్రయోజకులను చేయాలనుకుంటూ భవిష్యత్తు గురించి మధ్యతరగతి తల్లిదండ్రులు తపన పడడం, వారంటే పిల్లలు భయపడడం, తెలిసీ తెలియని వయసులో స్కూల్‍లో ఆకర్షణ లాంటి అంశాలతో సాగుతుంది. కుటుంబంతో కలిసి చూసేందుకు ఇది పర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్. అక్కడక్కడా సాగదీతగా అనిపించినా.. బోర్ కొట్టదు. ఆహ్లాదంగా సాగిపోతుంది.

రేటింగ్: 3.25/5

టీ20 వరల్డ్ కప్ 2024