Aditya Haasan: రెండు సినిమాలు చేస్తున్నా: 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్
90s Web Series Director Aditya Haasan: 90s వెబ్ సిరీస్‍తో పాపులర్ అయిన డైరెక్టర్ ఆదిత్య హాసన్‍కు రెండు సినిమాల అవకాశాలు వచ్చేశాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. మొదటి సినిమా హీరోగా ఎవరో కూడా వెల్లడించారు.

Aditya Haasan: ‘90s’ వెబ్ సిరీస్‍తో యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ చాలా పాపులర్ అయ్యారు. ‘ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ అంటూ వచ్చిన ఈ సిరీస్ భారీగా ఆదరణ దక్కించుకుంది. ఈటీవీ విన్‍లో జనవరి మొదట్లో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ 90s ఈ సిరీస్ చాలా మందికి కనెక్ట్ అయింది. ఈ సిరీస్‍ను ఆదిత్య హాసన్ తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆయనకు ఇప్పుడు సినిమా అవకాశాలు వచ్చేశాయి. ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని తాజాగా వెల్లడించారు ఆదిత్య హాసన్.
హీరో నితిన్‍తో ఓ సినిమా చేయనున్నానని, రెండో సినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై చేయనున్నానని ఆదిత్య హాసన్ తెలిపారు. నితిన్‍తో తీసే సినిమా స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని రాజేశ్ మన్నే అనే యూట్యూబ్ ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిత్య తెలిపారు.
“నితిన్‍తో ఓ సినిమా చేస్తున్నా. రెండో సినిమా నాగవంశీ(సితార ఎంటర్‌టైన్మెంట్స్) తో చేస్తున్నా. నితిన్‍తో మూవీ షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి” అని ఆదిత్య హాసన్ చెప్పారు. 90s వెబ్ సిరీస్ గురించి నితిన్ ఎలా స్పందిచారన్న ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇచ్చారు. “90s వెబ్ సిరీస్ ఆయనకు బాగా నచ్చింది. ఆదిత్య క్యారెక్టర్ బాగా నచ్చిందని, సాంప్రదాయినీ సాంగ్ బాగా నచ్చిందని చెప్పారు” అని ఆదిత్య హాసన్ తెలిపారు.
నితిన్‍తో ఆదిత్య హాసన్ సినిమా చేయనున్నారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. అలాగే, నిర్మాత నాగవంశీ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై కూడా ఓ చిత్రం చేస్తారని టాక్ వచ్చింది. అయితే, ఈ విషయాలను ఇప్పుడు స్వయంగా ఆదిత్య హాసనే కన్ఫార్మ్ చేసేశారు.
నితిన్ సొంత బ్యానర్‌లోనే..
ఆదిత్య హాసన్‍తో చేసే సినిమాను నితిన్ ఫ్యామిలీకి చెందిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానరే నిర్మించనుంది. ఈ విషయాన్ని కూడా ఆదిత్య ధ్రువీకరించారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడే తేదీలు చెప్పలేమని ఆయన అన్నారు. స్క్రిప్ట్ సిద్ధమైన వెంటనే నితిన్ - ఆదిత్య చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
నితిన్ ప్రస్తుతం రాబిన్‍హుడ్ సినిమా చేస్తున్నారు. వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నితిన్ దొంగగా కనిపించనున్నారు. ఇటీవలే వచ్చిన గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. గతంలో నితిన్ - వెంకీ కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అయింది. దీంతో రాబిన్‍హుడ్‍పై భారీ అంచనాలు ఉన్నాయి. గతేడాది ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ నిరాశపరచటంతో ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు నితిన్. రాబిన్ హుడ్ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ముందుగా రష్మిక మందన్నాను హీరోయిన్‍గా ఎంపిక చేయగా.. ఆమె ఇటీవలే తప్పుకున్నారు.
90s వెబ్ సిరీస్
1990ల్లో ఓ మధ్య తరగతి కుటుంబం స్టోరీతో 90s వెబ్ సిరీస్‍ను రూపొందించారు దర్శకుడు ఆదిత్య హాసన్. సీనియర్ నటుడు శివాజీ, వాసుకీ ఆనంద్, మౌళి తనూజ్ ప్రశాంత్, రోహన్, వసంతిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ మంచి పాపులర్ అయింది. సురేశ్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ కూడా ఈ సిరీస్‍లో ఆకట్టుకుంది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో 90s వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది.
టాపిక్