Gym Mistakes: జిమ్‌లో చేసే ఈ ఐదు పొరపాట్లు మీకు బట్టతల రావడానికి కారణం అవుతాయి!
Gym Mistakes: కండరాల ఫిట్‌నెస్ కోసం జిమ్ కు వెళ్లడం మంచిదే. కానీ, వ్యాయామం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ప్రభావం మన కేశాలపై కనిపిస్తుందట. తక్కువ కాలంలోనే జుట్టు ఊడిపోయి బట్టతలగా మారే ప్రమాదముంది.
బిజీబిజీగా గడుపుతున్న యువత ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా చేస్తున్న ఉత్తమమైన మార్గం జిమ్‌కు వెళ్లడం. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ మార్గానికి.. ప్రస్తుత తరంలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎవరైనా కొంతకాలం తర్వాత మనకు కనిపించి బరువు తగ్గినట్లుగా కనిపిస్తే మనం కూడా జిమ్‌కు వెళ్లాలి అనే తపన పుడుతుంది. ఆ శరీర సౌష్టవాన్ని నిర్మించుకోవడానికి వాళ్లకు మాదిరిగా గంటల కొద్దీ సమయం వెచ్చించాలని అనిపిస్తుంది. అలా జిమ్‌కు వెళ్లి మీరు కూడా మీ శరీరాకృతిని నిర్మించుకోవడానికి కమిట్ అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి. మీరు మీ శరీరాన్ని తీర్చిదిద్దుకోవడంతో పాటు మీ కేశాలపై కూడా కాస్త జాగ్రత్త వహించాలని మర్చిపోకండి. ఎందుకంటే, జిమ్ లో చాాలా మంది రొటీన్ గా చేసే పొరబాటు వారి తలపై జుట్టు రాలిపోవడానికి కారణమవుతుంది. ఆ తప్పులేంటో తెలుసుకుని మీ వల్ల ఆ పొరబాటు జరగకుండా జాగ్రత్తపడుతుంది.
హానికరమైన బ్యాక్టీరియా
జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు చెమట వస్తుంది. ఈ చెమట కారణంగా, జుట్టు రాలే సమస్య కూడా పెరుగుతుందట. చెమటలో ఉప్పుతో పాటు అనేక రకాల హానికరమైన బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, చెమట అనేది జుట్టులో ఎక్కువసేపు ఉన్నప్పుడు, వెంట్రుకలు రాలిపోయే సమస్యను తీవ్రతరం చేస్తుంది. అలా కాకుండా చెమట ఆరిపోయేలా జుట్టును వదులుగా చేసుకోవడం లేదా, సరైన సమయానికి తలస్నానం చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
టైట్‌గా హెయిర్ స్టైల్స్
జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు చాలా మంది అమ్మాయిలు జుట్టును చాలా గట్టిగా కట్టుకుంటారు. ఇలాంటి హెయిర్ స్టైల్స్ వల్ల వర్కవుట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొంత కంఫర్ట్ ఉంటుంది. కానీ, ఇది వారి కేశారోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. నిజానికి టైట్‌గా హెయిర్ స్టైల్స్ చేసుకోవడం వల్ల జుట్టు మూలాలు చాలా బలహీనంగా మారి జుట్టు వేగంగా విరిగిపోవడం మొదలవుతుంది. ముఖ్యంగా వర్కవుట్స్ చేసేటప్పుడు జుట్టును ఎప్పుడూ తేలికగా కట్టుకోవాలి.
తీవ్రమైన వ్యాయామం వల్ల హార్మోన్లలో మార్పులు:
జిమ్‌లో ఎక్కువ సేపు వ్యాయామం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా పెరుగుతుంది. వాస్తవానికి, తీవ్రమైన వ్యాయామం కారణంగా, అలసటతో పాటు మానసికంగా ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇది ఆరోగ్యంతో పాటు జుట్టును నేరుగా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా, అధిక వ్యాయామం శరీరంలో హార్మోన్ల మార్పులకు దారి తీస్తుంది. ఇది జుట్టు రాలే సమస్యను కూడా పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో, నిపుణుడి పర్యవేక్షణలో మాత్రమే అధిక తీవ్రత ఉన్న వ్యాయామాలు చేయండి. అలాగే శరీరానికి సరైన పోషణ, విశ్రాంతి ఇవ్వడం కూడా మర్చిపోవద్దు.
తలకు టోపీలు
జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు తలకు టోపీలు వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో చాలా మంది ఇలా చేస్తుంటారు. అయితే, ఈ అలవాటు జుట్టుకు చాలా హానికరం. వాస్తవానికి, ఎక్కువసేపు తలపై టోపీ ధరించడం, ముఖ్యంగా జిమ్లో వ్యాయామం చేసేటప్పుడు టోపీ పెట్టుకోవడం వల్ల వెంట్రుకల కుదుళ్లకు సరైన వెంటిలేషన్ ఉండదు. ఇది జుట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల జుట్టు రాలే సమస్య పెరగడంతో పాటు జుట్టు పెరుగుదలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.
జుట్టు పరిశుభ్రత
సాధారణంగా జిమ్ లో వ్యాయామం చేసిన తర్వాత జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం వల్ల జుట్టు రాలడం మొదలవుతుంది. నిజానికి జిమ్ లో వర్కవుట్స్ చేయడం వల్ల చెమట, దుమ్ము వంటి వాటి వల్ల తల వెంట్రుకల విషయంలో దుష్ప్రభావం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, జిమ్ లో వ్యాయామం చేసిన తర్వాత జుట్టు పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలి. జుట్టు రాలడం గురించి పట్టించుకోకపోతే క్రమేణా బట్టతల వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.