Allu Arjun: పోలీస్ స్టేషన్ చేరుకున్న అల్లు అర్జున్.. విచారించేది వీళ్లే! ఏం జరుగుతుందోననే ఉత్కంఠ
Allu Arjun in Police Station: హీరో అల్లు అర్జున్ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్‍కు చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా నోటీసులు రావడంతో ఆయన స్టేషన్‍కు వెళ్లారు. దీంతో తదుపరి ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠగా మారింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలులో ఓ రోజు ఉన్నారు. మధ్యంతర బెయిల్‍పై బయటికి వచ్చారు. పుష్ప 2 ప్రీమియర్ల సందర్భంగా డిసెంబర్ 4న జరిగిన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. బాలుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఇటీవల అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్‍మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. పోలీసులు కొన్ని వీడియోలు ప్రదర్శించి అల్లు అర్జున్ అలసత్వం ప్రదర్శించారనేలా చెప్పారు. ఈ తరుణంలో అల్లు అర్జున్‍కు పోలీసుల నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. దీంతో ఆయన నేడు (డిసెంబర్ 24) పోలీస్ స్టేషన్‍కు వెళ్లారు.
చిక్కడపల్లి స్టేషన్‍కు.. విచారణ అధికారులు వీరే
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణకు రావాలని అల్లు అర్జున్‍కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం (డిసెంబర్ 23) నోటీసులు జారీ చేశారు. నేడు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాలని చెప్పారు. అందుకు తగ్గట్టే నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‍కు చేరుకున్నారు అల్లు అర్జున్. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు నాయక్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరగనుంది.
పోలీసు నోటీసుల విషయంపై సోమవారమే తన లీగల్ టీమ్‍తో ఆయన సుదీర్ఘ చర్చలు జరిపారు. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో ఆయనకు న్యాయవాదులు వివరించినట్టు సమాచారం.
అభివాదం చేసి..
పోలీస్ స్టేషన్‍కు బయలుదేరే ముందు ఇంటి వద్దకు వచ్చిన వారికి అల్లు అర్జున్ అభివాదం చేశారు. నమస్కరించారు. ఆ తర్వాత కారులో ఎక్కి పోలీస్ స్టేషన్ బయలుదేరారు.
విచారణలో ఇవి? తీవ్ర ఉత్కంఠ
అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్‍కు విచారణ కోసం వెళ్లడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. తనపై తప్పుడు ఆరోపణ చేశారని ప్రెస్‍మీట్‍లో అల్లు అర్జున్ వివరించారు. ఆ విషయాలు ఏవో కూడా పోలీసులు వివరణ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొక్కిసలాటకు సంబంధించి ఘటన జరిగిన రోజు ఏఏ విషయాలు తన దృష్టికి వచ్చాయో కూడా అడిగే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తం ఘటన జరిగిన తీరుపై ప్రశ్నలు ఉండొచ్చు. కేసు కోర్టులో ఉండగా.. మధ్యంతర బెయిల్‍పై ఉంటూ ప్రెస్‍మీట్ పెట్టడం గురించి కూడా అల్లు అర్జున్‍ను ప్రశ్నించొచ్చు. ఇదే కారణం చూపి బెయిల్ రద్దుకు కూడా పోలీసులు కోర్టుకు వెళతారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠ విపరీతంగా నెలకొంది.