Hands Rubbing in Winter: చలికి అరచేతులను రుద్దుతున్నారా.. మీకు తెలియకుండానే ఈ బెనిఫిట్స్ పొందుతున్నట్లే!
చలికాలంలో తరచూ అరచేతులు రుద్దుకుంటూ ఉంటాం. దీంతో అరచేయిలో వేడి కలిగి కాస్తంత ఉపశమనం కలుగుతుందని భావిస్తాం. కానీ, ఇలా చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా? అవేంటో చూద్దాం.
మనలో చాలా మంది పని చేసుకుంటూ లేదా ఏదైనా ఆలోచిస్తూ సడెన్‌గా అరచేతులు రుద్దుకుని వేరే పనికి ఉపక్రమిస్తాం. లేదా బాగా చలి వాతావరణంలో తిరుగుతున్నప్పుడు రెండు అరచేతులను కాసేపటి వరకూ రుద్దుకుంటూ ఉంటాం. ఇటువంటి పనులను మనమే కాదు మనతో పాటు ఉండే చాలా మంది చేస్తుంటారు. వాస్తవానికి ఇలా చేయడం ద్వారా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయట. చలి నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగేందుకే కాకుండా ఆలోచనలను కూడా అదుపులో ఉంచే ఎక్సర్‌సైజ్ ఇది. శరీరానికి వెచ్చదనాన్ని తీసుకురావడానికి ప్రజలు చేసే ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్‌తో ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుందామా..
చేతులు బిగుసుకుపోవడం
జలుబు సమస్యతో బాధపడుతున్న వారిలో కొందరికి చేతులు బిగుసుకుపోవడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. అటువంటి పరిస్థితుల్లో, ఆ వ్యక్తులు తమ అరచేతిని రుద్దుకోవడం ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల జలుబు వల్ల మందగించిన మీ చేతుల్లో రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా చేతులు, శరీరం తక్షణమే వేడెక్కుతాయి. ఇలా చేయడం వల్ల బిగుసుకున్న చేతులు కాస్త రిలాక్స్ అయి ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది.
నాడీ వ్యవస్థను శాంతింపజేసేందుకు
చలికాలంలోనూ, జలుబు ఉన్న సమయంలోనే కాకుండా రాత్రి పడుకునే ముందు కూడా చేతులను రుద్దడం ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల నాడీ వ్యవస్థను శాంతింపజేయవచ్చు. ఇది మీ మనస్సుకు ప్రశాంతత చేకూర్చడంతో పాటు శరీరానికి విశ్రాంతి ఇస్తుంది. ఫలితంగా రాత్రి మొత్తం చక్కటి నిద్రలోకి జారుకోవచ్చు. కాబట్టి ఈ పద్ధతిని మీరు ప్రతిరోజూ నిద్ర పోయే ముందు అలవాటుగా మార్చుకోవడం మంచిది. ఫలితంగా మరుసటి రోజు ఉదయానికి నూతనోత్సాహంతో నిద్ర లేవగలరు.
నొప్పి నివారణ
శరీరంలోని ఏదైనా భాగంలో నొప్పిగా అనిపిస్తుంటే, అరచేతులను రుద్దిన తర్వాత ఆ ప్రదేశంలో కాసేపటి వరకూ ఉంచండి. చేతులలోని వెచ్చదనం ఆ కండరాలకు తాకి రిలాక్స్ చేస్తుంది. అంతేకాకుండా స్క్రీన్ ముందు ఎక్కువ సేపు పనిచేసే వాళ్లు తమ కళ్లపై ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా ఇలా చేయొచ్చు. అరచేతులను కాసేపు రుద్దుకుని మీ మూసి ఉన్న కళ్లపై ఉంచండి. కొంతసేపటి వరకూ ఉపశమనం పొందొచ్చు.
ఆలోచనల్లో ఆత్రుత తగ్గేందుకు..
ఏదైనా ముఖ్యమైన విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది. ఫలితంగా మన మెదడుపై ఈ ప్రభావం కనిపిస్తుంది. అటువంటి సమయంలో అరచేతులను రుద్దుకోవడం వల్ల నాడీ వ్యవస్థ శాంతిస్తుంది. క్రమంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలా శారీరక ఒత్తిడి అనే భావన కూడా రాకుండా ఉంటుంది.
ఏకాగ్రత పెంచుకునేందుకు..
మీరు అలసటగా లేదా ఏకాగ్రతతో పని చేయలేకపోతున్న సందర్భంలో అరచేతులను కాసేపటి వరకూ రుద్దుకోండి. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్తం, శక్తి ప్రవాహ స్థాయిలు పెరుగుతాయి. వీటి ప్రభావం మెదడుపై స్పష్టంగా కనిపిస్తుంది కూడా. రోజువారీ జీవితంలో ఇలా చేయడం వల్ల పని ఒత్తిడి తగ్గి, మరింత ప్రభావవంతంగా పనులు పూర్తి చేస్తారు. ఏకాగ్రత లోపించడం వల్ల కలిగే సమస్యల నుంచి కూడా గట్టెక్కుతారు.
సంబంధిత కథనం