వారం పాటు మృత్యువుతో పోరాడి.. గుండెపోటుతో 11ఏళ్ల అత్యాచార బాధితురాలు మృతి!
Gujarat Rape case : వడోదర ఆసుపత్రిలో వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన 11 ఏళ్ల అత్యాచార బాధితురాలు మృతిచెందింది. రెండుసార్లు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచింది.
గుజరాత్లో హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది! వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన 11ఏళ్ల అత్యాచార బాధితురాలు, చివరికి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది.
ఇదీ జరిగింది..
భరూచ్ జిల్లాలో పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. డిసెంబర్ 16న గుడిసె సమీపంలో ఆడుకుంటున్న బాలికను ఓ పారిశ్రామిక కార్మికుడు అపహరించాడు. ఆమెను సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అక్కడే విడిచిపెట్టి, అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయ తెలుసుకున్న పోలీసులు.. నిందితుడుని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. నేరం జరిగిన మరుసటి రోజే ఝార్ఖండ్‌కు చెందిన 36 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బాలిక గుడిసె పక్కనే ఉంటూ ఆమె తండ్రితో కలిసి అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని తేలింది.
మరోవైపు లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికను భరూచ్ జిల్లాలోని పారిశ్రామిక పట్టణం అంక్లేశ్వర్కి చెందిన సివిల్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆమెను వడోదరలోని ఎస్ఎస్జీ ఆసుపత్రికి తరలించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
అక్కడ ఆ బాలిక వారం పాటు చికిత్స తీసుకుంది. కాగా సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాలికకు గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించింది. చికిత్స అనంతరం కోలుకున్నప్పటికీ సాయంత్రం 5.15 గంటల సమయంలో మరోసారి ఆమె గుండెపోటు వచ్చింది. వైద్యులు ఆమెకు తక్షణ చికిత్స అందించారు. కానీ సాయంత్రం 6:15 గంటలకు ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఈ వివరాలను ఎస్ఎస్జీ ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంఓ) డాక్టర్ హితేంద్ర చౌహాన్ తెలిపారు. సెప్సిస్ (ఇన్ఫెక్షన్ లేదా గాయానికి ప్రాణాంతక ప్రతిస్పందన) ఆమె శరీరమంతా వ్యాపించడంతో మైనర్ బాలిక పరిస్థితి క్షీణించిందని, ఇది అవయవ వైఫల్యానికి దారితీసిందని తెలిపారు. ఈ పరిస్థితులు గుండె ఆగిపోవడానికి దారితీశాయని ఆయన వివరించారు.
బాధితురాలి కుటుంబానికి పరామర్శ..
కాగా ఝార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రిగా ఉన్న దీపికా పాండే సింగ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందం గత వారం వడోదరలోని ఆసుపత్రిని సందర్శించి బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించింది. బాధితురాలి కుటుంబానికి రూ.4 లక్షల చెక్కును అందజేశారు. దీనిపై గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి రుషికేశ్ పటేల్ స్పందిస్తూ అత్యాచారం వంటి తీవ్రమైన నేరాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
సంబంధిత కథనం