Chittoor : భార్య వివాహేతర సంబంధం.. భర్త సెల్ఫీ వీడియో.. అవమానం భరించలేక ఆత్మహత్య
Chittoor : చిత్తూరు జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్య చేసిన ఈ పనిని జీర్ణించుకోలేక భర్త సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియోలో తన బాధను గ్రామస్తులకు చెబుతూ విలపించాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది.
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని ఉడ్యాణంపల్లెలో విషాదం జరిగింది. సెల్ఫీ వీడియో తీసి ఓ భర్త సూసైడ్ చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉడ్యాణంపల్లెకు చెందిన రవి ఆచారి కుమారుడు మోహన్ ఆచారి (36)కి పాకాల మండలం గాదంకి గ్రామానికి చెందిన సరితతో పదేళ్ల కిందట వివాహం అయింది. మోహన్ ఆచారి, సరిత దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. గత కొంత కాలంగా సరిత గుంటిపల్లె సచివాలయంలో ఉద్యోగి సురేంద్రతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
నిలదీసిన భర్త..
ఈ విషయం గ్రామంలో చాలా మందికి తెలిసింది. అందరి నోళ్లలో నాని భర్త మోహన్ ఆచారి చెవిలో పడింది. భార్య వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న భర్త, భార్యను నిలదీశాడు. సరితను మందలించాడు. ఇంట్లో గత 50 రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ సచివాలయ ఉద్యోగి మోజులో ఉన్న భార్య, అతనితోనే తాను ఉంటానని గొడవ జరిగిన ప్రతిసారి చెప్తుంది. ఆయనతోనే ఉంటానని భార్య చెప్పడంతో మోహన్ ఆచారి తీవ్ర మనస్తాపానికి, మనోవేదనకు గురయ్యాడు. ఇదే విషయాన్ని మోహన్ ఆచారి సోమవారం సెల్ఫీ వీడియో ద్వారా తన గ్రామస్తులకు చెప్పాడు.
ఇక బతకలేనని..
తన భార్య ప్రవర్తన, తన పట్ల వ్యవహరించిన తీరును మోహన్ ఆచారి చెప్పుకున్నాడు. తాను ఇక బతకలేనని, ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో వివరించాడు. తన భార్య, సురేంద్రను కఠినంగా శిక్షించాలని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. న్యాయం చేయాలని కోరాడు. వీడియోను చూసిన గ్రామస్తులు మోహన్ ఆచారి ఇంటికి వెళ్లారు. ఆయన కనిపించకపోవడంతో వెతకడం మొదలు పెట్టారు. గ్రామస్తులు మోహన్ ఆచారిని వెతికే క్రమంలో ఊరి సమీపంలోని క్వారీ వైపు వెళ్లారు. అక్కడ మోహన్ ఆచారి మృతదేహాన్ని గుర్తించారు.
క్వారీలో విగతజీవిగా..
పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మోహన్ ఆచారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. మోహన్ ఆచారి భార్య సరిత చేసిన పనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కారణంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)