CBN Delhi Tour: నేడు ఢిల్లీకి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు,రెండు రోజుల ఢిల్లీ ప‌ర్యటన, మోడీతో స‌హా కేంద్ర మంత్రుల‌తో భేటీ-chief minister chandrababu to delhi today two day visit to delhi meeting with union ministers including modi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Delhi Tour: నేడు ఢిల్లీకి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు,రెండు రోజుల ఢిల్లీ ప‌ర్యటన, మోడీతో స‌హా కేంద్ర మంత్రుల‌తో భేటీ

CBN Delhi Tour: నేడు ఢిల్లీకి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు,రెండు రోజుల ఢిల్లీ ప‌ర్యటన, మోడీతో స‌హా కేంద్ర మంత్రుల‌తో భేటీ

HT Telugu Desk HT Telugu
Aug 16, 2024 10:50 AM IST

CBN Delhi Tour: రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎన్‌.చంద్ర‌బాబు నాయుడు నేడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స‌హా కేంద్ర మంత్రుల‌తో భేటీ కానున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు చేసిన చంద్ర‌బాబు,నాలుగో ప‌ర్య‌ట‌న‌కు నేడు ఢిల్లీకి వెళ్తున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు

CBN Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళుతున్నారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స‌హా కేంద్ర మంత్రుల‌తో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు చేసిన చంద్ర‌బాబు, నాలుగో ప‌ర్య‌ట‌న‌కు నేడు ఢిల్లీకి వెళ్తున్నారు.

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో హెలీప్యాడ్ నుంచి హెలీకాప్ట‌ర్ ద్వారా విజ‌య‌వాడ ఎయిర్‌పోర్టుకు బ‌య‌లుదేరుతారు. అక్క‌డి మ‌ధ్యాహ్నం 2.10 గంట‌ల‌కు విజ‌య‌వాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్క‌డ నుంచి మ‌ధ్యాహ్నం 2.15 గంట‌ల‌కు విజ‌య‌వాడ ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి బ‌య‌లుదేరుతారు.

సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్క‌డ నుంచి సాయంత్రం 4.40 గంట‌ల‌కు రోడ్డు మార్గంలో అధికారిక నివాసం 1 జ‌న్‌ప‌థ్‌కు బ‌య‌లుదేరుతారు. సాయంత్రం 5.10 గంట‌ల‌కు అధికారిక నివాసం 1 జ‌న్‌ప‌థ్‌కు చేరుకుంటారు.

ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ త‌దిత‌రుల‌ను భేటీ కానున్నారు. రాష్ట్రానికి కేంద్రం సాయం, పెండింగ్ ప్రాజెక్టుల‌కు నిధుల కేటాయించ‌డం వంటి అంశాల‌పై చ‌ర్చిస్తారు.

పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధులు, అలాగే రాజ‌ధాని అమ‌రావ‌తికి ఇప్పిస్తామ‌న్న రూ.15 వేల కోట్ల రుణాన్ని త్వ‌ర‌గా ఇప్పించాల‌ని కోర‌నున్నారు. మ‌రోవైపు రాష్ట్రంలోని వెనుక‌బ‌డిన జిల్లాల నిధులు ఇస్తామ‌ని బ‌డ్జెట్ ప్ర‌సంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. అయితే వాటికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి ప్ర‌క్రియ ప్రారంభించ‌లేదు. దీని గురించి కూడా కేంద్ర మంత్రుల వ‌ద్ద లేవ‌నెత్త‌నున్నారు.

అలాగే కేంద్ర బడ్జెట్‌లో స‌వ‌రించిన అంచ‌నాల్లో రాష్ట్రానికి కేటాయింపులు పెంచాల‌ని కోరనున్నారు. అలాగే విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న పెండింగ్ అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం-2014లోని 13వ షెడ్యూల్‌లో సెక్ష‌న్ 93లో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాల‌ని ఉంది.

విభ‌జ‌న చ‌ట్ట అపాయింట్మెంట్ డే నుంచి ఆరు నెలల్లోపు గ్రీన్‌ఫీల్డ్ ముడి చ‌మురు శుద్ధిక‌ర్మాగారం, పెట్రోకెమిక‌ల్ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు సంబంధించి ఐఓసి, హెచ్‌పీసీఎల్‌ సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించాల‌ని విభ‌జ‌న చ‌ట్టంలో స్ప‌ష్టంగా ఉంది. ప‌దేళ్ల‌లోపు దీన్ని ఏర్పాటు చేయాల‌ని ఉంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఏర్పాటు చేయ‌లేదు. దీనిపై గ‌తంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర ట్రోలియం మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీతో చంద్ర‌బాబు నాయుడు చ‌ర్చించారు. దీనిపై మ‌రోసారి చ‌ర్చిస్తారు.

ముఖ్య‌మంత్రి అయ్యాక ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు చేసిన చంద్ర‌బాబు, ఇప్పుడు నాలుగో ప‌ర్య‌ట‌న‌కు ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్రం స‌హ‌కారం కోసం ఈ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న‌ట్లు టీడీపీ వ‌ర్గాలు తెలుపుతున్నాయి.

కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన త‌రువాత‌, మ‌ళ్లీ స‌వ‌రించిన బ‌డ్జెట్‌లో మ‌రిన్ని కేటాయింపులు చేయాల‌ని కోర‌నున్నారు. ఇప్ప‌టికే రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ క‌లిశారు. రాష్ట్రానికి స‌వ‌రించిన బ‌డ్జెట్ కేటాయింపులు చేయాల‌ని కోరారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)