Chittoor Crime : చిత్తూరు జిల్లాలో విషాదం, వివాహేతర సంబంధానికి స్నేహితుడు సాయం-ఆపై ఆత్మహత్య
Chittoor Crime : చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి సాయం చేసి ప్రాణాలు తీసుకున్నాడు. తన మిత్రుడు, వివాహిత పారిపోవడానికి కారు ఇచ్చినందుకు పోలీస్ లు స్టేషన్ కు పిలిచి విచారణకు పిలిచారని అవమానంతో అతడు ఉరేసుకున్నాడు.
చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి సాయం చేసిన స్నేహితుడు, దాని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు స్టేషన్‌కు పిలవడంతో మనస్తాపనకు గురైన యువకుడు వ్యవసాయ పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడి ఆత్మహత్యతో వృద్ధురాలైన తల్లి, దివ్యాంగురాలైన చెల్లిలు అనాథలయ్యారు.
ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని బోడేవారిపల్లెలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బోడేవారిపల్లెకు చెందిన పల్ల దేవేంద్ర (32), చిన్నరమణ, చౌడేపల్లె అగ్రహారానికి చెందిన విశ్వనాథ్, ప్రసాద్ స్నేహితులుగా ఉన్నారు. వీరి నలుగురు కలిసి పనులు చేసుకునేవారు. అలాగే పుంగనూరు నుంచి బెంగళూరుకు కూరగాయలను రవాణా చేస్తున్నారు. వీరికి అదే గ్రామానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
చిరంజీవి పుంగనూరు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రైవేట్ పాఠశాలలో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేయడంతో అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసే ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ తరచూ కలిసేవారు. పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. వీరిద్దరూ తమ కుటుంబాలను వదిలి వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నారు.
ఈనెల 15న ఇద్దరు వెళ్లి పోదామనుకుని పథకం వేశారు. అందులో చిరంజీవి తన స్నేహితులు తెలిపాడు. వారు కూడా దానికి సహయం చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో దేవేంద్ర, తన స్నేహితుడు ప్రసాద్ వద్దనున్న కారు తీసుకొచ్చి చిరంజీవికి ఇచ్చారు. దీంతో చిరంజీవి తన వివాహిత ప్రియురాలు కారులో పరార్ అయ్యారు. తన సోదరి కనిపించడం లేదని ఉపాధ్యాయురాలు సోదరుడు అరుణ్ కుమార్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదును స్వీకరించిన పుంగనూరు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం చిరంజీవి నలుగురు స్నేహితులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. కొద్దిసేపు విచారించి, సోమవారం మళ్లీ రమ్మని పంపించేశారు. అయితే పోలీసులు స్టేషన్‌కు పిలిపించడాన్ని అవమానంగా భావించిన దేవేంద్ర స్వగ్రామంలోనే వ్యవసాయ పొలాల్లో సోమవారం మధ్యాహ్నం చింత చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చింతచెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని అటుగా వెళ్తున్న కొంత మంది చూసి, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం అందించారు. దీంతో అందరూ హుటాహుటిన వ్యవసాయ పొలాల్లోకి వెళ్లారు. వృద్ధురాలైన తల్లి, దివ్యాంగురాలైన చెల్లి రోదనలు మిన్నంటాయి. బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. దీంతో బోడేవారిపల్లె గ్రామంలో విషాదం నెలకొంది. మరోవైపు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం