Tollywood Shifting : టాలీవుడ్ ఏపీకి తరలిపోతుందా? వాస్తవ పరిస్థితులేంటి?
Tollywood Shifting : తెలంగాణలో ఇటీవల పరిస్థితులతో టాలీవుడ్ ఏపీకి తరలిపోతుందనే చర్చ మొదలైంది. టాలీవుడ్ తరలిపోయేంతగా ఏపీలో మౌలిక సదుపాయాలు ఉన్నాయా? వాస్తవ పరిస్థితులు ఏంటో చూద్దాం.
Tollywood Shifting : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగు సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంపు ఉండవని స్వయంగా సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో పాటు గత రెండు రోజులుగా మంత్రులు, కాంగ్రెస్ నేతలు సినీ పరిశ్రమపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. అల్లు అర్జున్ వివాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను టార్గెట్ చేసినట్లు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. 'టాలీవుడ్' ఆంధ్రప్రదేశ్ కు తరలిపోతుందా? అనే చర్చ మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు చెన్నై కేంద్రంగా తెలుగు సినీ పరిశ్రమ కొనసాగేది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత...కొన్నాళ్లకు సినీ ప్రముఖులు హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. హైదరాబాద్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందింది. స్టూడియోస్, సినీ పరిశ్రమకు అవసరమయ్యే అన్ని సదుపాయాలు.. ఒక్కొక్కటిగా ఏర్పాటుచేసుకున్నారు.
ఏపీ నుంచి రిక్వెస్ట్ లు
ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్...రెండు రాష్ట్రాలుగా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమలో డైలామా మొదలైంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో స్థిరపడడంతో...పరిశ్రమ ఇక్కడి నుంచే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవనేది ఇటీవల సంఘటనలు నిరూపించాయి. సంధ్య థియేటర్ ఘటనతో సినీ పరిశ్రమ లక్ష్యంగా విమర్శలు మొదలయ్యాయి. టాలీవుడ్ ఏపీకి తరలిపోతుందా? అనే చర్చ మళ్లీ మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వంలో టికెట్ల రేట్ల తగ్గింపు వ్యవహారంపై చర్చించేందుకు సినీ ప్రముఖులు అప్పటి సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంలో ఏపీలో షూటింగ్స్ చేయాలని, చిత్ర పరిశ్రమను విశాఖకు తీసుకురావాలని కోరారు. విశాఖలో అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే సినీ ప్రముఖులు హైదరాబాద్ ను వీడేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం టాలీవుడ్ ను ఏపీకి ఆహ్వానించారు.
ఏపీలో పరిస్థితులు
తాజాగా అల్లు అర్జున్ వివాదంతో టాలీవుడ్ లో చీలిక వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎప్పటికైనా టాలీవుడ్ ఏపీ, తెలంగాణగా విడిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇది ఇప్పుడే సాధ్యం కాకపోవచ్చంటున్నారు. వాస్తవ పరిస్థితులు చూస్తే సినీ పరిశ్రమ తరలి వెళ్లేంతగా ఏపీలో మౌలిక సదుపాయాలు లేవు. ప్రభుత్వం చొరవ చూపినా...ఇప్పటికే స్థిరపడిన హైదరాబాద్ నుంచి వెళ్లేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరనేది వాస్తవం. ఏపీలో చెప్పుకునే స్థాయిలో స్టూడియోలు అభివృద్ధి చెందలేదు. టెక్నాలజీ పరంగా మళ్లీ హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. 24 క్రాఫ్ట్స్ కు సంబంధించి హైదరాబాద్ అనువైన ప్రదేశం. ఏపీకి ఇవన్నీ తరలిపోయే ప్రసక్తే ఉండదనేది వాస్తవం. సినిమా షూటింగ్ లు వరకు ఏపీ అనువైనా...పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ హైదరాబాద్ లోనే చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వాల సహకారం తప్పనిసరి
టాలీవుడ్ లో ఏడాదికి సగటున మూడు నాలుగు వేల కోట్లకు బిజినెస్ జరుగుతుంటుంది. భారీ బడ్జెట్ సినిమాలతో ప్రభుత్వానికి భారీగా టాక్స్‌లు వస్తాయి. పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే ప్రభుత్వాల సహాయ సహకారాలు తప్పనిసరి. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో బడా నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ పెద్దలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఏపీ వారే కావడంతో ఏపీ ప్రభుత్వంతో వీరికి ఎప్పుడూ మంచి సంబంధాలే ఉంటున్నాయి. అల్లు అర్జున్ వివాదంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సినీ పరిశ్రమకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఈ తాత్కాలిక ఇబ్బందులతో టాలీవుడ్ ఏపీకి షిఫ్ట్ అవుతుందా? అంటే సాధ్యంకాదనే చెప్పాలి. సినీ పరిశ్రమకు అవసరమయ్యే రామోజీఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయా స్టూడియోస్, ప్రసాద్ ల్యాబ్స్, రామకృష్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ ఇతర స్టూడియోలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. విశాఖలో స్టూడియోల నిర్మాణాలు జరుగుతున్నా..ఇప్పటికిప్పుడు ప్రారంభం అయ్యే అవకాశం లేదు. అయినా ఇలాంటి ఇబ్బందులు తాత్కాలికమని, ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ మంత్రులు ఒకపక్క విమర్శలు చేస్తున్నా...మరోపక్క తాము చిత్రసీమకు వ్యతిరేకంకాదని అంటున్నారు.
సంబంధిత కథనం