Srikakulam Road Accident : దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం - ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని బిరజాదేవి అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. క్షతగాత్రులను శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఒడిశాలోని బిరజాదేవి అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా…ఈ విషాదం జరిగింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మృతి చెందిన వారిలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందారు. క్షతగాత్రులు శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా…
ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చిన కొజ్జారియా జాతీయ రహదారి మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నంలోని సీతమ్మధారకు చెందిన వ్యాపారి ముత్తా వెంకట రంగారాజేష్, తల్లి సుబ్బలక్ష్మి, భార్య లావణ్య (43), కుమార్తె నేహాగుప్తా (18), మరదలు రాధిక, తోడల్లుడు సోమేశ్వరరావు (49)తో కలిసి ఒరిస్సాలోని జాబ్‌పూర్‌లో బిరజాదేవి అమ్మవారి దర్శనానికి మంగళవారం బయల్దేరారు. చిన కొజ్జారియా వద్దకు వచ్చే సరికి జాతీయ రహదారిపై కారు నడుపుతున్న రంగారాజేష్ నిద్రలోకి జారుకోవడంతో వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో లావణ్య, ఆమె సోదరి భర్త సోమేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. నేహాగుప్తా మాత్రం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. లావణ్య సోదరి రాధిక, సుబ్బలక్ష్మి, రాజేష్‌కి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాకుళంలోన ఆసుపత్రికి తరలించారు. రాధిక పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న కంచిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మంగరాజు తెలిపారు.
మృతులంతా ఒకే ఫ్యామిలీ…!
మృతి చెందినవారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే అందులో ఇద్దరు విశాఖపట్నానికి చెందిన వారు కాగా, ఒకరు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. లావణ్య, నేహా గుప్తా విశాఖ వాసులు కాగా… సోమేశ్వరరావు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన వారు. ఆయన ఐటీసీలో ఇంజినీరుగా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నేహా గుప్తా పాట్నా ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేస్తుంది. పుట్టిన రోజు సందర్భంగా ఇటీవలి పాట్నా నుంచి విశాఖపట్నం ఆమె వచ్చింది. ఈనెల 22న పుట్టిన రోజు వేడుకలు చేసుకుంది. అనంతరం అమ్మవారి మొక్కు తీర్చుకుని తిరిగి పాట్నాకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఈ మృత్యువు కబలించింది.
మిన్నంటిన రోదనలు…
సోంపేట ఆసుపత్రిలో రాజేష్ రోదనలు మిన్నంటాయి. తన కుమార్తెను, భార్యను తలుచుకుని ఆయన రోదనలు అక్కడికి వారి మనసులను కలిచివేశాయి. ఆ కుటుంబ సభ్యులు, బంధువులు సోంపేట ఆసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరు అయ్యారు.
ఘటనా స్థలానికి కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు, సోంపేట సీఐ మంగరాజు, కంచిలి ఎస్ఐ పాపినాయుడు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సోంపేట ఎంపీపీ ఎన్.దాసు ఆసుపత్రిలో బాధితులకు సహకారం అందించారు. ఈ ఘటన పట్ల రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం