Squid Game Season 2: గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో మోస్ట్ పాపులర్ సిరీస్ రెండో సీజన్ స్ట్రీమింగ్.. ఆటలో ఓడితే చావే
Squid Game season 2 OTT: స్విడ్ గేమ్ రెండో సీజన్ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. మరికొన్ని గంటల్లో ఈ నయా సీజన్ వచ్చేస్తోంది. దీని కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలివే..
‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠతో ఊపేసింది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2021లో వచ్చిన ఈ కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తొలి సీజన్ వరల్డ్ వైడ్‍గా పాపులర్ అయింది. ఇండియాలోనూ భారీ వ్యూస్ దక్కించుకుంది. చిన్నచిన్న గేమ్‍లతో ఉండే ఈ సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. గేమ్‍లో ఓడిన వాళ్లను నిర్వాహకులు చంపేస్తుంటారు. ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్‍గా స్క్విడ్ గేమ్ ఘనత దక్కించుకుంది. దీంతో రెండో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూశారు. మరికొన్ని గంటల్లో ఆ నిరీక్షణకు ముగియనుంది.
స్ట్రీమింగ్ వివరాలు
స్క్విడ్ గేమ్ సీజన్ 2 చిత్రం రేపు (డిసెంబర్ 26) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇండియాలో రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. దీంతో మరొక్క రోజులోనే ప్రేక్షకులు ఈ రెండో సీజన్ వీక్షించవచ్చు. ఇప్పటికే చాలా మంది ఈ సీజన్‍నూ చూసేయాలని చాలా నిరీక్షిస్తున్నారు.
తెలుగులోనూ..
స్క్విడ్ గేమ్ రెండో సీజన్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో కొరియన్‍తో పాటు ఇంగ్లిష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. తొలి సీజన్ కూడా తెలుగులో ఉండగా.. ఇప్పుడు రెండో సీజన్ కూడా అందుబాటులోకి వచ్చేస్తోంది. రేపటి నుంచి నెట్‍ఫ్లిక్ ఓటీటీలో స్క్విడ్ గేమ్ సీజన్ 2 చూసేయవచ్చు.
నటీనటులు వీరే..
స్క్విడ్ గేమ్ 2లోనూ లీ జంగ్ జయీ పోషించిన సియోంగ్ జీ ప్రధాన పాత్రగా ఉండనుంది. తొలి సీజన్‍లో విన్నర్‌గా నిలిచిన ఈ 456వ నంబర్ ప్లేయర్ రెండో సీజన్‍లోనూ ఉన్నారు. మళ్లీ గేమ్ ఆడేందుకు ఆ ప్రపంచంలో అడుగుపెడతారు లీ జంగ్. తొలి సీజన్‍లో ఉన్న వి హాన్ జున్, లీ బ్యుంగ్ హన్ కూడా రెండో సీజన్‍లో కనిపించనున్నారు. ఇమ్ సీ వాన్, కంగ్ హా నెయిల్, పార్క్ గ్యూ యంగ్, లీ జిన్ యుక్, పార్క్ సంగ్ హూన్ సహా మరికొందరు ఈ రెండో సీజన్‍కు కొత్త క్యారెక్టర్లుగా అడుగుపెట్టారు. స్క్విడ్ గేమ్ రెండో సీజన్‍కు హ్యాంగ్ డంగ్ హ్యూక్ దర్శకత్వం వహించారు.
పిల్లల గేమ్స్.. ఓడితే మరణం
స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ చిన్న పిల్లల గేమ్‍లతో ఉంటుంది. పార్టిసిపెంట్లు బతకాలంటే తప్పక గేమ్ గెలవాల్సి ఉంటుంది. ఓడిన ప్లేయర్లను నిర్వాహకులు చంపేస్తారు. అందుకే సర్వైవల్ మోడ్‍లో ఉండే ఈ సిరీస్ ప్రేక్షకులకు చాలా థ్రిల్ ఇచ్చింది. ఇప్పుడు రెండో సీజన్ కూడా ఇలానే సాగనుందని ట్రైలర్ ద్వారా అర్థమైపోయింది. ఈసారి కొత్త గేమ్స్, చాలా మంది కొత్త పార్టిసిపెంట్లు ఉండనున్నారు. 45.6 బిలియన్ డాలర్ల బిగ్ ప్రైజ్ మనీ ఉంటుందని ట్రైలర్లో తెలిసింది. ఈ ప్రమాదకరమైన ఆట గురించి నిజాలు బయటపెట్టాలని ఆ ప్రపంచంలోకి విహా జున్ అడుగుపెట్టి ఉంటాడు. రెండో సీజన్ కథలో ఈ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది.
స్క్రిడ్ గేమ్ సీజన్ 2లో ఏడు ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఇండియాలో రేపే (డిసెంబర్ 26) మధ్యాహ్నం 12.30 గంటలకు అన్ని ఎపిసోడ్లు స్ట్రీమింగ్‍కు వస్తాయి. దీంతో వరుసగా బింజ్ వాచ్ చేసేందుకు రెడీగా ఉండండి.