Dry fish Curry: టమాటోలు వేసి ఎండు చేపల ఇగురు ఇలా వండారంటే చాలా రుచిగా ఉంటుంది, రెసిపీ ట్రై చేయండి
Dry fish Curry: సముద్రపు తీర ప్రాంతాల్లో పచ్చి చేపలను, ఎండు చేపలను అధికంగా తింటారు. ఎండు చేపలను టమోటాలు వేసి ఇగురులా వండితే రుచి అదిరిపోతుంది.
సముద్ర తీర ప్రాంతంలో ఉన్నవారికి ఎండు చేపలు పరిచయమే. ముఖ్యంగా ఎండు చేపల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో ఎండు నెత్తల్లు కూడా ఒకటి. చిన్న పచ్చి చేపలను ఎర్రటి ఎండలో ఎండబెట్టడం ద్వారా తయారు చేస్తారు. రుచిలో అద్భుతంగా ఉంటాయి. పోషకాలు కూడా నిండుగా ఉంటాయి. చలికాలంలో ఈ ఎండు నెత్తల్ల కూరను టమోటోలు వేసి ఇగురులా వండుకొని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో ఈ ఎండు నెత్తల్ల ఇగురును వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది.
ఎండు చేపల ఇగురు రెసిపీకి కావలసిన పదార్థాలు
చిన్న ఎండు చేపలు - ఒక కప్పు
నీళ్లు - సరిపడినన్ని
నూనె - రెండు స్పూన్లు
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
టమాటోలు - రెండు
పసుపు - అర స్పూను
కారం - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాల పొడి - ఒక స్పూను
చింతపండు - చిన్న ఉసిరికాయ సైజులో
కరివేపాకులు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
ఎండు చేపల ఇగురు రెసిపీ
1. ఎండు చేపలను గంటముందే నీళ్లలో నానబెట్టుకోవాలి.
2. వేడి నీళ్లలో నానబెట్టుకుంటే పావుగంటలోనే మెత్తగా అయిపోతాయి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఆ తరువాత ఉల్లిపాయలు తరుగును వేసి వేయించుకోవాలి.
5. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి వేయించుకోవాలి.
6. పచ్చిమిర్చి తరుగును కూడా వేసి ఉల్లిపాయలు రంగు మారేవరకు వేయించాలి.
7. ఆ తర్వాత సన్నగా తరిగి టమోటో ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.
8. రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
9. టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉంచాలి.
10. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
11. ఈలోపు చింతపండును నానబెట్టి గుజ్జును తీసుకోవాలి.
12. ఆ చింతపండు నీటిని కూడా వేసి బాగా కలపాలి.
13. మరి కొంచెం నీళ్లను పోసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మూత పెట్టాలి.
14. ఇప్పుడు ఎండు చేపలను వేసి బాగా కలుపుకోవాలి.
15. కరివేపాకులను కూడా వేసుకోవాలి. మూత పెట్టి ఎండు చేపలు ఉడికే దాకా చిన్న మంట మీద పది నిమిషాలు పాటు వదిలేయాలి.
16. ఆ తర్వాత మూత తీసి గరం మసాలా వేసుకొని మళ్లీ కలుపుకోవాలి.
17. స్టవ్ ఆఫ్ చేయడానికి ముందు కొత్తిమీర తరుగును చల్లి మూత పెట్టేయాలి. అంతే టేస్టీ ఎండు చేపల టమాటో ఇగురు రెడీ అయినట్టే.
18. దీన్ని వండుతున్నప్పుడే నోరూరిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ ఇగురుని వేసుకొని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది.
ఎండు చేపలను అప్పుడప్పుడు తినడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా బాలింతలు ఎండు చేపలను తినడం వల్ల వారికి పాల ఉత్పత్తి పెరుగుతుంది. చలికాలంలో మీకు స్పైసీగా తినాలనిపిస్తే ఈ ఎండు చేపల టమోటో ఇగురును వండుకొని తిని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పైగా ఎండు నెత్తల్లు లేదా ఎండు చేపలు త్వరగా పాడవవు. ఒకసారి కొనుక్కొని వీటిని ఇంట్లో దాచుకుంటే ఎప్పుడు నచ్చితే అప్పుడు వండుకోవచ్చు.
టాపిక్