Telangana Weather Updates : అల్పపీడనం ఎఫెక్ట్ - ఇవాళ, రేపు తెలంగాణలో వర్షాలు..!
Telugu States Weather Updates : ఏపీ, తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
దక్షిణకోస్తా-ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఏపీకి వర్ష సూచన…
ఈ ప్రభావంతో రాగల ఏపీలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
అల్పపీడనం ప్రభావంతో ఇవాళ (డిసెంబర్ 25) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
రేపు(డిసెంబర్ 26) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ, రేపు తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. ఇక డిసెంబర్ 27వ తేదీ నుంచి మళ్లీ పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. చలి తీవ్రత కొనసాగుతోందని అంచనా వేసింది.
హైదరాబాద్ కు వర్ష సూచన:
ఇవాళ హైదరాబాద్ లో చూస్తే ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల తూర్పు, ఆగ్నేయ దిశలో గాలుల వీచే అవకాశం ఉందని పేర్కొంది.