Bandi Sanjay:కాంట్రాక్టర్ లు సిండికేట్ అయితే క్రిమినల్ చర్యలు తప్పవన్న కేంద్ర మంత్రి బండి సంజయ్-union minister bandi sanjay says criminal action will be taken if contractors form syndicates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay:కాంట్రాక్టర్ లు సిండికేట్ అయితే క్రిమినల్ చర్యలు తప్పవన్న కేంద్ర మంత్రి బండి సంజయ్

Bandi Sanjay:కాంట్రాక్టర్ లు సిండికేట్ అయితే క్రిమినల్ చర్యలు తప్పవన్న కేంద్ర మంత్రి బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Dec 25, 2024 06:51 AM IST

Bandi Sanjay: కాంట్రాక్టర్ లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్లు సిండికేట్ అయితే క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో వేయక తప్పదని హెచ్చరించారు.‌ జనవరి 5లోగా పని చేయని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదేశం
పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదేశం

Bandi Sanjay:  కేంద్రం మంజూరు చేసిన పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారులకు ఆదేశించారు. అభివృద్ధి,  సంక్షేమం విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి పని చేస్తామని చెప్పారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. 

yearly horoscope entry point

కరీంనగర్ లో ఆర్వోబి పనులకు 153 కోట్లు మంజూరు చేయించామని, సర్వీస్ రోడ్డు కోసం 36 లక్షలు మంజూరు చేయించానని చెప్పారు. కాంట్రాక్టర్ ల నిర్లక్ష్యం వల్లే పనులు సరిగా జరగడం లేదన్నారు. స్మార్ట్ సిటి నిధులను గత రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించిందని ఆరోపించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు, ఇచ్చిన నిధులను సరిగా వినియోగించుకునే చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

ఎక్కడో ఓ చోట బిల్లు రాకుంటే ఏ పని చేయకుండా కాంట్రాక్టర్ లు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. పని చేయని కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. కచ్చితంగా కేసులు పెట్టి జైల్లో వేస్తామని, భవిష్యత్తులో ఏ పని చేయకుండా అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు 60 సీ కింద నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలని కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

విద్యావైద్యంకు కేంద్రమే నిధులు...

కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్య, వైద్య శాఖలకు అధిక నిధులిస్తుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రభుత్వ ఆసుపత్రులకు పైసలిస్తున్నా... వాటి పనితీరు మెరుగుపర్చుకోకపోవడంపైనా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల, వేల కోట్ల నిధులిస్తున్నా ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాటన్ లేదంటారు. మందుల్లేవంటారు. ఎక్స్ రే మిషన్ కరాబైందంటారు? దశాబ్దాలు మారినా సర్కార్ ఆసుపత్రుల తీరు మారదా? పేదలకు రోగమొస్తే ఏకైక దిక్కు ప్రభుత్వ ఆసుపత్రులే కదా.. వీటి తీరు మారకపోతే వాళ్లు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా? రోజూ పత్రికల్లో వార్తలొచ్చినా మీరు చలించరా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారాల్సిందేనని, లేనిపక్షంలో తగిన చర్యలు తప్పవని హెచ్చరికలు పంపారు. నేషనల్ హెల్త్ మిషన్ నియామకాల్లోనూ భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని వచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో ఎంక్వేరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. మోదీ ప్రభుత్వం అర్హులందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ... కట్టెల పొయ్యి బాధ లేకుండా చేస్తుంటే... వందలాది మంది పిల్లలు చదువుకునే పాఠశాలల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ వారి ఆనారోగ్యాలను దెబ్బతీయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇకపై కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా గ్యాస్ స్టవ్ పై మధ్యాహ్న భోజనం వండిపెట్టాలని ఆదేశించారు.

స్మార్ట్ పనులు జాప్యం ఎందుకు?

కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ కింద రూ.398 కోట్లు మంజూరు చేసినా పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఎందుకు సమర్పించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. యూసీ‌ సమర్పించకపోవడంవల్లే కేంద్రం మిగిలిన నిధులు మంజూరు చేయడం లేదని, మీరు ఎంత తొందరగా యూసీ సమర్పిస్తే... అంత తొందరగా మిగిలిన రూ.70 కోట్ల నిధులను మంజూరు చేయిస్తామని తెలిపారు. 

వైద్యశాఖపై....

కరీంనగర్ జిల్లాకు సంబంధించి నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ద్వారా 2022-23 ఆర్దిక సంవత్సరానికి రూ.7 కోట్లు, ఈ ఆర్దిక సంవత్సరంలో 5.29 కోట్లు ఖర్చు చేశామన్నారు? ఆ నిధులను దేనికి ఖర్చు పెట్టారు ? ఆ వివరాలు ఎందుకు ఇవ్వలేదు? కేంద్రం నుంచి అందే ప్రతి పైసాకు పక్క లెక్క ఉండాల్సిందేనన్నారు.

రోడ్లు- వంతెనలు

పీఎంజీఎస్ వై(ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ) పథకంలో భాగంగా సిరిసిల్ల జిల్లాలో గత ఆర్దిక సంవత్సరంలో 12 రోడ్ల (80కి.మీలు) నిర్మాణం కోసం రూ.46 కోట్లు మంజూరు చేసినం. ఇందులో ఒకటే వర్క్ పూర్తయింది. మిగిలినవి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అసలు ఎన్ని నెలల్లో పూర్తి చేయాలి? కరీంనగర్ లో కూడా అదే పరిస్థితి. అగ్రిమెంట్ ప్రకారం నిర్ణీత గడువులోగా ఎందుకు పూర్తి చేయడంలేదన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించి 2021-22 సంవత్సరానికి 150 కి.మీల మేరకు 219 కోట్లతో 16 రోడ్లు శాంక్షన్ చేయించిన. ఇందులో ఒకటి రెండు తప్ప 18 నెలల గడువు తీరినా ఎక్కడా ప్రోగ్రెస్ లేదన్నారు.

ఎంపీ లాడ్స్ నిధులపై...

ఎంపీ నిధుల అభివృద్ధి పనుల విషయంలో అనుకున్నంత ప్రోగ్రెస్ కనిపించడం లేదని  ఈ ఏడాదికి సంబంధించి ఐదు కోట్ల ఖర్చు విషయంలో ఇంకా అనుకున్న పురోగతి లేదన్నారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా విషయంలో మరి ఎందుకు నిధులను పక్కాగా వినియోగించలేకపోతున్నారు. ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. నాకున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం ఎంపీ నిధులు అనేసరికి కొంచెం కావాలని ఆలస్యం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.‌ దీని మీద క్లారిటీ ఇవ్వాలన్నారు. రెండు జిల్లాల్లో ఎంపీ నిధులతో చేపట్టిన పనుల పురోగతి ఏమిటి? గడువులోగా పనులెందుకు పూర్తి చేయలేకపోయారు?ఏయే చర్యలు తీసుకున్నారో తక్షణమే పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వండని అదికారులను బండో సంజయ్ ఆదేశించారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner