Amaravati ORR : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు డిజైన్.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు శుభవార్త!
Amaravati ORR : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు సూచించారు. ఓఆర్ఆర్‌ను 7 జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని సూచించారు. ఈ రింగ్ రోడ్డు ప్రతిపాదనలతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల ధరలు పెరగనున్నాయి.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ మేరకు రూపొందించిన ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌ను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఓఆర్ఆర్ ప్రతిపాదిత మ్యాప్‌ను ముఖ్యమంత్రికి చూపించారు. దీన్ని పరిశీలించిన సీఎం.. పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎక్కువ వంపులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రతిపాదిత అమరావతి రింగ్ రోడ్డుకు మరో ప్రత్యేకత. ఈ ఓఆర్ఆర్ 7 జాతీయ రహదారులకు అనుసంధానం కానుంది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో కనెక్టివిటీ మరింత పెరగనుంది. దీని నిర్మాణం పూర్తయితే.. గుంటూరు, విజయవాడ నగరాల్లోకి ప్రవేశించకుండానే.. హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై నగరాలకు వెళ్లవచ్చు.
7 జాతీయ రహదారులతో..
కొండమోడు-పేరేచర్ల (ఎన్‌హెచ్-163ఇజి)
మచిలీపట్నం-హైదరాబాద్ (ఎన్‌హెచ్-65)
చెన్నై-కోల్‌కతా (ఎన్‌హెచ్-16)
విజయవాడ-ఖమ్మం-నాగ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి (ఎన్‌హెచ్-163జి).
గుంటూరు-అనంతపురం (ఎన్‌హెచ్-544డి)
ఇబ్రహీంపట్నం-జగదల్‌పుర్ (ఎన్‌హెచ్-30)
అనంతపురం జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్టు నుంచి ముప్పవరం వరకు.
సీఆర్‌డీఏ ఎన్‌ఓసీ..
ముఖ్యమంత్రికి వివరించిన ఎలైన్‌మెంట్‌కి ఇప్పటికే సీఆర్‌డీఏ ఎన్‌ఓసీ జారీ చేసింది. రోడ్లు భవనాలశాఖ కూడా ఎన్‌ఓసీ జారీ చేస్తే.. ఆ ప్రతిపాదనను ఎన్‌హెచ్‌ఏఐ.. కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదం కోసం పంపిస్తుందని అధికారులు చెబుతున్నారు. అక్కడ ఖరారైతే రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ, ఇతర ప్రక్రియలు మొదలవుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. రింగ్ రోడ్డు నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చు భరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
భూముల ధరలకు రెక్కలు..
ప్రతిపాదిత రింగ్ రోడ్డు మొత్తం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఉంది. దీనికి సంబంధించిన మ్యాప్ ప్రకారం.. కృష్ణా జిల్లాల్లోని నందిగామ, మైలవరం, గన్నవరం, పెనమలూరు, గుంటూరు జిల్లాలోని తెనాలి, గుంటూరు, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతాయని రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు.