UK Visa rules : యూకే స్టూడెంట్, జాబ్ వీసా కోసం కొత్త రూల్స్- ఆర్థిక భారం ఎక్కువే!
UK Visa new rules : యూకేలో చదువు లేదా జాబ్‌కి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! యూకే వీసా రూల్స్ మారబోతున్నాయి. ఇది మీ మీద ఆర్థిక భారాన్ని పెంచే అవకాశం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
యూకేలో చదువు లేదా ఉద్యోగం కోసం ప్లాన్ చేస్తున్న వారికి కీలక అలర్ట్! 2025 జనవరి నుంచి యూకే వీసా నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇమ్మిగ్రేషన్ సమస్య, ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులను ఎదుర్కొనేందుకు యూకే చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్‌లో భాగంగా అధిక ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. యూకేలో స్టడీ లేదా జాబ్ కోసం ప్రస్తుత రూల్స్ కన్నా 11శాతం అధిక 'ఫైనాన్షియల్ రిజర్వ్స్'ని భారతీయులు చూపించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
యూకే స్టూడెంట్ వీసా కొత్త రూల్స్..
2025 జనవరి 2 నుంచి యూకే స్టూడెంట్ వీసాకు అప్లై చేస్తున్న వారు ఈ కింద చెప్పే ఆధారాలను చూపించాల్సి ఉంటుంది..
- లండన్‌లో కోర్సుకు ప్రతి నెల 1,483 పౌండ్లకు (సుమారు రూ. 1.5లక్షల) సంబంధించిన నిధుల ప్రూఫ్‌ని చూపించాల్సి ఉంటుంది.
- లండన్‌లో కాకుండా యూకేలోని ఇతర ప్రాంతాల్లో కోర్సులకు 1,136 పౌండ్ల నిధులను ప్రూఫ్‌గా చూపించాలి.
యూకేలో ఒక ఏడాది మాస్టర్ ప్రోగ్రామ్ కోసం.. లండన్‌లో అయితే 13,347 పౌండ్లు (సుమారు రూ. 14లక్షలు), ఇతర ప్రాంతాల్లో అయితే 10,224 పౌండ్లకు చెందిన నిధుల ఆధారాలను చూపించాలి. ఇవి 9 నెలల ఖర్చులకు సమానం. వీసా అప్లికేషన్ సమర్పించే కనీసం 28 రోజుల ముందు నుంచే ఈ నిధులు సంబంధిత అకౌంట్లో జమ చేసి ఉండాలి.
ప్రస్తుతం లండన్‌లో జీవన ఖర్చుల అవసరాలు (కొన్నింటిని మినహాయించి) నెలకు 1,334 పౌండ్లు, లండన్ బయట నెలకు 1,023 పౌండ్లుగా ఉన్నాయి.
యూకే వర్క్ వీసాలో కొత్త రూల్స్..
స్కిల్డ్ వర్కర్‌గా తొలిసారి యూకే వర్క్ వీసాకు అప్లికేషన్ దాఖలు చేస్తున్న వారు జీవన ఖర్చులు, స్టేని భరించేందుకు 38,700 పౌండ్ల ఆదాయాన్ని చూపించాలి. అంతేకాకుండా, హోం ఆఫీస్ ఆమోదించిన యూకే సంస్థ నుంచి స్పాన్సర్షిప్ ఉండాలి. స్పాన్సర్షిప్ లేని వారు, అప్లికేషన్‌కి కనీసం 28 రోజుల ముందు నుంచే సంబంధిత నిధులను అకౌంట్లో చూపించాలి.
వీసా ఫీజులు కూడా పెరిగాయి..
యూకే టూరిస్ట్, ఫ్యామిలీ, చైల్డ్- స్పౌస్, స్టూడెంట్ వీసాల ఫీజులు కూడా స్వల్పంగా పెరిగాయి. అయితే హెల్త్‌కేర్, ఆర్మీ, ప్రత్యేక ట్యాలెంట్ విభాగంలా పనిచేస్తున్న వారితో పాటు దివ్యాంగులకు కొన్ని మినహాయింపులు ఉంటాయి.
ఇక్కడ 28 డే రూల్ కీలకంగా మారింది. అప్లికేషన్ వేసే కనీసం 28 రోజుల ముందు నుంచే తగిన అమౌంట్‌ని బ్యాంక్ అకౌంట్లో చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అప్లికేషన్ సబ్మీట్ చేస్తున్న రోజున, క్లోజింగ్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ చివరి 30 రోజులు మించి ఉండకూడదు!
స్టూడెంట్, వర్క్ వీసా కోసం యూకే అధిక ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ అడుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులు అందుకు తగ్గట్టు ముందు నుంచే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఉండవు!
సంబంధిత కథనం