Varun Dhawan: నా చేతుల్లోనే మనోజ్ చనిపోయాడు- ఆరోజు హీరోగా ఫెయిలయ్యా- కన్నీళ్లతో కీర్తి సురేష్ హీరో వరుణ్ ధావన్ (వీడియో)
Varun Dhawan Emotional On His Driver Manoj Death: కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా బేబీ జాన్ హీరో వరుణ్ ధావన్ కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. 26 ఏళ్లు తనతో కలిసి ఉన్న డ్రైవర్ మనోజ్ ఆకస్మిక మరణం గురించి తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యాడు.
Varun Dhawan About Manoj Death And Bhagavad Gita: కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మూవీ బేబీ జాన్. ఈ సినిమాలో హీరోగా వరుణ్ ధావన్ నటించాడు. ఇటీవల సమంత సిటాడెల్ హనీ బన్నీ ఓటీటీ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న వరుణ్ ధావన్ బేబీ జాన్ మూవీతో అలరించనున్నాడు.
26 ఏళ్లుగా కలిసి
బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ ఎమోషనల్ అయ్యాడు. 26 ఏళ్లుగా తనతో కలిసి ఉన్న డ్రైవర్ మనోజ్ ఆకస్మిక మరణం గురించి చెబుతూ ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. డ్రేవర్ మరణంతో తన ఆలోచన ధోరణి ఎలా మారిందో, భగవద్గీత, రామాయణం తనను ఎలా ప్రేరేపించాయో పంచుకున్నాడు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. "నేను చాలా కాలం ఒక బుడగలో జీవించాను. వరుణ్ ధావన్‌ను 35 ఏళ్లకు ముందు ఆ తర్వాత అని చూడొచ్చు. నా డ్రైవర్ మనోజ్ మరణం నా ఆలోచన ధోరణినే మార్చేసింది. నేను ఆన్‌స్క్రీన్‌లో హీరోగా చేస్తాను కదా. అందుకే నన్ను నేను ఒక ఆదర్శవంతమైన హీరోగా చూడాలని అనుకున్నాను. కానీ, ఆరోజు మాత్రం నేను హీరోగా ఫెయిల్ అయ్యాను" అని వరుణ్ ధావన్ అన్నాడు.
ప్రాణాన్ని కాపాడినట్లే అనిపించింది
"అప్పుడు డ్రైవర్ మనోజ్ గురించి చెబుతూ కాస్తా ఎమోషనల్ అయ్యాడు వరుణ్ ధావన్. "నా దగ్గర చాలా ఏళ్లుగా డ్రైవర్‌గా చేస్తున్న మనోజ్ నాకు చాలా క్లోజ్. మేము పని చేస్తున్నప్పుడు సడెన్‌గా చనిపోయాడు. నేను అతనికి సీపీఆర్ చేశాను, కరెక్ట్ టైమ్‌లో లీలావతి హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. మేము ఒక ప్రాణాన్ని కాపాడినట్లే అనిపించింది. కానీ, అతను నా చేతుల్లోనే మరణించాడు. అతను అలా చనిపోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. కానీ, అలా జరిగిపోయింది" అని వరుణ్ ధావన్ గుర్తు చేసుకున్నాడు.
మనోజ్ మరణం తనను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతగా ప్రభావితం చేసిందో వరుణ్ ధావన్ వివరించాడు. "తర్వాత నా సినిమాలు కూడా తగ్గిపోయాయి. రెండేళ్ల తర్వాత ఇప్పుడు నా సినిమా వస్తుంది. ఇదే నా బేబీ జాన్ మూవీ రెండేళ్ల తర్వాత థియేటర్‌లో విడుదల అవుతోంది. ఆయన మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది" అని వరుణ్ ధావన్ పేర్కొన్నాడు.
మనిషిగా ముందుకు సాగాలి
అయితే, మనోజ్ మరణ బాధను తగ్గించుకోడానికి రామాయణం, భగవద్గీత వంటి ధార్మిక గ్రంథాల వైపు మొగ్గు చూపినట్లు వరుణ్ ధావన్ వెల్లడించాడు. "జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. కానీ, ఒక మనిషిగా మనం ముందుకు సాగాలని నేను గ్రహించాను. ఆ సంఘటనలు మనల్ని కలిచివేస్తాయి. అలా అని మీరు అలా స్తబ్దుగా ఉండలేరు. నేను భగవద్గీత, మహాభారతం, రామాయణాలను చదవడం ప్రారంభించాను. ఎందుకంటే నా దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి" అని వరుణ్ ధావన్ తెలిపాడు.
వరుణ్ ధావన్ మాట్లాడిన కామెంట్స్‌తోపాటు వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, వరుణ్ ధావన్ డ్రైవర్ మనోజ్‌కు ముందుగా కొవిడ్ 19 సోకింది. కరోనా నుంచి కోలుకున్న వారం రోజుల తర్వాత మనోజ్‌కు గుండెపోటు వచ్చింది. అది తనను మానసికంగా ఎంతో ప్రభావితం చేసిందని ఇదివరకు ఇండియా టుడేకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ తెలిపాడు. కాగా వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ డిసెంబర్ 25న రిలీజ్ కానుంది.