Agrigold Deposits: అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకోడానికి చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశం
Agrigold Deposits: ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది డిపాజిటర్లను నిలువునా ముంచి అగ్రిగోల్డ్ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంపై వివిధ శాఖలతో సమీక్షించారు.
Agri :old Deposits: ఆంధ్రప్రదేశ్‌తో పాటు నాలుగైదు రాష్ట్రాల్లో లక్షలాది మంది డిపాజిటర్లను నిలువునా ముంచేసి అగ్రిగోల్డ్ వ్యవహారంలో బాధితులకు సకాలంలో తగిన న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అగ్రిగోల్డు ఆస్తులపై అధికారులతో సిఎస్ సమీక్షించారు.
అగ్రిగోల్డు బాధితులు పోగొట్టుకున్న ఆస్థులను సకాలంలో వారికి తిరిగి చేర్చే విధంగా కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ సిఐడి, తదితర విభాగాల అధికారులను సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
ఈ సమావేశంలో సీఐడీ ఐజి వినీత్ బ్రిజ్ లాల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ అగ్రిగోల్డు మోసానికి సంబంధించి మొత్తం 23 జిఓలను విడుదల చేసినట్టు వివరించారు. అగ్రిగోల్డ్ కేసు ఏపీతో పాటు 9 రాష్ట్రాలతో ముడిపడి ఉందని, ఈ కంపెనీ అన్ని రాష్ట్రాల్లో కలిపి 19లక్షల 18వేల 865 మంది డిపాజిట్ దార్ల నుండి మొత్తం సుమారు రూ.6వేల 380 కోట్ల వరకు వసూలు చేసి డిపాజిట్ దార్లను మోసానికి గురి చేసిందని వివరించారు.ఈకేసును వేగవంతంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు.
ఈసమావేశంలో ఏపీ ఐఐసి విసి అండ్ ఎండి అభిషిక్త్ కిషోర్,న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభా దేవి,హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వర్చువల్ గా డిజిపి ద్వారకా తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఖజనాకు భారీగా గండి…
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో 30లక్షల మంది జనం నెత్తిన టోపీ పెట్టిన అగ్రిగోల్డ్ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. బాధితుల ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల వరకు చెల్లింపులు జరిపినా ఒక్క రుపాయి కూడా ప్రభుత్వానికి సమకూరలేదు. అగ్రిగోల్డ్ అక్రమాలపై జాతీయ బ్యాంకులు సిబిఐకు ఫిర్యాదు చేయడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్ సిఐడి దర్యాప్తు ప్రకారం అగ్రిగోల్డ్ అక్రమ వసూళ్లు దాదాపు రూ.6400కోట్లకు పైగా ఉంటాయని అంచనా వేశారు. అదే సమయంలో అగ్రిగోల్డ్ ప్రజల నుంచి సేకరించిన డబ్బుతో వేల కోట్ల రుపాయల ఆస్తుల్ని పొగేసినట్లు గుర్తించారు.
2015లో అగ్రిగోల్డ్ వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు రకరకాల కారణాలు వినిపించాయి. వేల కోట్ల రుపాయల ఆస్తులు ఉన్న అగ్రిగోల్డ్ అకస్మాత్తుగా పుట్టిమునిగింది. ఆ తర్వాత అగ్రిగోల్డ్ సంస్థను టేకోవర్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరిగినా కొలిక్కి రాలేదు. పలు అంతర్జాతీయ సంస్థలు అగ్రిగోల్డ్ చెల్లించాల్సిన అప్పుల కంటే ఆస్తుల విలువ ఎక్కువగా ఉంటుందని తేల్చాయి. దీంతో ఆస్తుల్ని విక్రయించి డిపాజిటర్లకు డబ్బు చెల్లించవచ్చని భావించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ వ్యాపారాలు నిర్వహించింది. డిపాజిటర్లకు పెద్దఎత్తున వడ్డీ ఆశచూపించి, పెట్టుబడులకు భూమిని ఇస్తామంటూ రకరకరాల పద్ధతుల్లో వేల కోట్ల రుపాయలు సేకరించారు. 2015-19 మధ్య కాలంలో అగ్రిగోల్డ్ వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. అగ్రిగోల్డ్‌కు వివిధ ప్రాంతాల్లో ఉన్న వేల కోట్ల రుపాయల ఆస్తులపై కన్నేసిన రాజకీయ నేతలు వాటిని స్వాధీనం చేసుకోవడానికే వివాదాలు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి.
డిపాజిటర్ల ఆందోళన….
చిన్నాచితక మదుపుదారులు డిపాజిట్లు చేసిన సొమ్ము వెనక్కి రాక పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకోవడంతో రాజకీయంగా దుమారం రేగింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లను కాపాడాలంటూ రాజకీయ పార్టీలు ఉద్యమాలు నిర్వహించాయి. మరోవైపు ఉమ్మడి హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులో సైతం ఈ వ్యవహారంపై పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు గడువు ముగిసిన డిపాజిట్లను తిరిగి చెల్లించకపోవడంతో డిపాజిటర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.
అగ్రిగోల్డ్ వ్యవహారం రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడంతో 2019 ఎన్నికలకు ముందు చిన్న మొత్తాలు డిపాజిట్లు చేసిన వారిని ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పది వేల లోపు డిపాజిటర్లకు మొదట నగదు చెల్లిస్తామని, ఆ తర్వాత రూ.20వేల లోపు డిపాజిటర్లకు నగదు చెల్లిస్తామని ప్రకటించారు. 2019లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రూ.940 కోట్ల రుపాయలను దశల వారీగా డిపాజిటర్లకు చెల్లించారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లోను అగ్రిగోల్డ్ మోసాలపై కేసులు నమోదయ్యాయి.
రంగంలోకి ఈడీ, సిబిఐ
అగ్రిగోల్డ్ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించడంతో ఇప్పటికే ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో పెద్ద ఎత్తున నగదును విదేశాలకు మళ్లించినట్లు గుర్తించారు. తాజాగా యూనియన్ బ్యాంకు అగ్రిగోల్డ్ తమను మోసం చేసినట్లు సిబిఐకు ఫిర్యాదు చేసింది. ఆర్ధిక లావాదేవీలలో భాగంగా ఆంధ్రా బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను ఎగవేయడంతో పాటు బ్యాంకును నష్టపరిచేలా వ్యవహరించారని సిబిఐకు ఫిర్యాదు చేసింది. దీంతో విశాఖపట్నం సిబిఐ కోర్టు అనుమతితో 2022 ఆగష్టు 11న అగ్రిగోల్డ్ ఛైర్మన్, డైరెక్టర్ల నివాసాలపై సిబిఐ దాడులు నిర్వహించింది. విజయవాడలో ఛైర్మన్ అవ్వా రామారావు ఇంట్లో తనిఖీలు నిర్వహించింది. విజయవాడ, హైదరాబాద్‌లోని అగ్రిగోల్డ్ డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించి బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తుల్లో చాలా వరకు ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది. మిగిలిన వాటిని సిబిఐ స్వాధీనం చేసుకోనుంది.
సిఐడి దర్యాప్తులో తాత్సారం…
అగ్రిగోల్డ్ వ్యవహారంలో దాదాపు ఏడేళ్లుగా సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రుపాయలు కేటాయించారు. రూ.940కోట్ల రుపాయల్ని బాధితులకు చెల్లించారు. ఇది చూడ్డానికి బాగానే ఉన్నా అగ్రిగోల్డ్ నుంచి ప్రభుత్వానికి మాత్రం ఒక్క రుపాయి కూడా దక్కలేదు. ఇకపై దక్కే అవకాశాలు కూడా దాదాపు మూసుకుపోయాయి.
ఈడీ జప్తు చేసిన ఆస్తుల్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం తప్ప మరో అవకాశం ఉండదు. ఇటీవలి కాలంలో అగ్రిగోల్డ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి స్థాయిలో జరిపిన సమావేశంలో కూడా ఆస్తుల వేలం వ్యవహారంలో నిర్దిష్టమైన భరోసా ఇవ్వలేకపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు మొత్తం కేంద్ర ప్రభుత్వ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోవడంతో పీటముడి బిగుసుకుపోయింది. రాష్ట్ర దర్యాప్తు సంస్థల వైఫల్యంతోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయనే ఆరోపనలు ఉన్నాయి.
సంబంధిత కథనం